
విశాఖలో మత్స్యకార కుటుంబాలకు జగన్ ఓదార్పు!
ఇటీవల సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఓదార్చారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
వైఎస్ జగన్.. బాధిత కుటుంబాల ఓదార్పులో ఆయనది విభిన్న శైలి. జగన్ ఓదార్పు ఇతర నాయకుల మాదిరిగా కనిపించదు. ఆయా కుటుంబ సభ్యులతో మమేకమవుతారు. వారితో కలిసి నేలపై కూర్చుని కష్టసుఖాలను ఓర్పుతో అడిగి తెలుసుకుంటారు. వారికి అండగా ఉంటామని హామీ ఇస్తారు. తోచినంత ఆర్థిక సాయం చేసి ఊరట నిస్తారు. ఇటీవల సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మంగళవారం తాడేపల్లి నుంచి విశాఖపట్నం వచ్చారు. నగరంలోని ఆ మత్స్యకారులుంటున్న జబ్బర్‌తోటకు వెళ్లి పరామర్శించారు. ఆయా కుటుంబాలను ఓదార్చారు. నేనున్నానంటూ వారిలో ధైర్యాన్ని నింపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆరుగురు మత్స్యకారులు గల్లంతు కావడానికి ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని జగన్ ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని మండిపడ్డారు. సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియాతో ఆయన ఏమన్నారంటే..?
బాధిత మత్స్యకార కుటుంబాలను ఓదారుస్తున్న వైఎస్ జగన్
`
``ఈనెల 1న సముద్రంలో వేటకెళ్లిన బోటు తిరుగు ప్రయాణంలో ఉండగా 4 మద్యాహ్నం 2.31 గంటలకు మత్స్యకారులు మరో గంటలో ఒడ్డుకు వచ్చేస్తామని వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. సాయంత్రానికి కూడా రాకపోవడంతో ఫోన్‌లు చేసినా పని చేయలేదు.. ఆ రాత్రి 7 గంటలకు ఆ కుటుంబాలు మత్స్యశాఖ అధికారులను కలిసినా వారు స్పందించలేదు. ఆరోజు రాత్రి మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకరామ్ కలెక్టర్, మెరైన్ సీఐలకు మెసేజ్ పెట్టాడు. వెంటనే రెస్య్కూ చేపట్టాలని కోరాడు. విశాఖలో ఈస్ట్రన్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్, కోస్టుగార్డు, నేవీ హెలికాప్టర్లు ఉన్నాయి. కలెక్టర్, పోలీస్ కమిషనర్లు ఉన్నారు. బోటు బోల్తా పడి ప్రాంతం విశాఖ తీరానికి కేవలం 10 కి.మీల దూరమే ఉంది. ఆ రాత్రే రెస్క్యూ చేపడితే బోటులోని మత్స్యకారులంతా బతికే వారు. కనీసం మర్నాడు తెల్లవారుజామునైనా ఆపరేషన్ మొదలెడితే ప్రాణాలతో దక్కేవారు. కానీ తీరిగ్గా ఆ మర్నాడు ఉదయం రెస్క్యూ చేపట్టే సరికే వారంతా గల్లంతయ్యారు. ఒక్క కారె చిన్న చైనా నౌక వద్దకు చేరుకొని బతికాడు. కేవలం ఈ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ మత్స్యకారులు చనిపోయారు. పైగా వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికి తమకు ఆ మర్నాడు ఉదయం 5 గంటల వరకు సమాచారం ఇవ్వలేదంటూ త్రీమెన్ కమిటీతో తప్పుడు నివేదిక ఇప్పించుకున్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులను బాధ్యులు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా ఉండేందుకు వారిపై చర్యలు తీసుకోవాలి.
విశాఖలో మీడియాతో మాట్లాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డి
ఈ ప్రభుత్వానికి మచ్చుకైనా మానవత్వం లేదు. ఆరుగురు మత్స్యకారులు గల్లంతైతే సీఎం పట్టించుకోలేదు. ఈ ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన హోంమంత్రి అనిత్ కూడా రాలేదు. ఉత్తరాంధ్రకే చెందిన ఫిషరీస్ మంత్రి అచ్చెన్నాయుడు కూడా వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. పైగా అచ్చెన్నాయుడు వీడియో కాల్‌లో పరామర్శించారని అన్నతమ్మ అంటోంది. బాధిత మత్స్యకార కుటుంబాలను ఓదార్చే వారే లేకుండా పోయారు.
విశాఖలో పోటెత్తిన అభిమానులకు అభివాదం చేస్తున్న జగన్
గతంలో మత్స్యకారులు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షల పరిహారం ఇచ్చేవారు. దానిని మా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రూ.10 లక్షలకు పెంచాం. ఈ బోటు ప్రమాదంలో గల్లంతైన వారికి ముష్టివేసినట్టు రూ.10 లక్షలే పరిహారంగా ఇచ్చారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. వారికి కొత్త బోటు ఇవ్వాలి. మీరెవరూ బెంగపెట్టుకోవద్దు. మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది. వచ్చాక మీరు అడిగినట్టే పరిహారం చెల్లిస్తాం.
రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా లేరు..
రాష్ట్రంలో ప్రజలెవరూ సంతోషంగా లేరు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం లేదు. కనీసం స్కూలు బ్యాగులు, బూట్లు సైతం ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయింది. రైతుకు గిట్టుబాటు ధర లేక రోడ్డెక్కుతున్నాడు. ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.`` అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు.
పార్టీ తరఫున రూ.7 లక్షల చొప్పున పరిహారం..
కాగా పరామర్శ అనంతరం ఒక్కో బాధిత కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున పార్టీ తరఫున పరిహారం చెల్లించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఇలా గల్లంతైన ఆరుగురి మత్స్యకారుల కుటుంబాలతో పాటు ప్రాణాలతో బయటపడిన బోటు ఓనరు కారె చిన్నకు కూడా అదే మొత్తాన్ని ఇవ్వనున్నట్టు వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు చెప్పారు.
సీఎం సీఎం అంటూ నినాదాలు..
మత్స్యకార కుటుంబాల పరామర్శకు విశాఖ వచ్చిన వైఎస్ జగన్‌ను చూడడానికి పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. విమానాశ్రయంతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలు, జబ్బర్‌తోటలోనూ కిక్కిరిసిపోయారు. ఓదార్పునకు ముందు, తర్వాత కూడా జనం హోరెత్తారు. ఆయన్ను చూడడానికి మేడలు, అపార్ట్‌మెంట్లు ఎక్కారు. ఆయన్ను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. మరికొందరు ఆయనతో కరచాలనానికి పోటీ పడ్డారు. పర్యటనలో పలు మార్లు జగన్ అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.

