
విజయసాయిరెడ్డి చూపు బీజేపీ వైపు?
మత మార్పిళ్లపై విజయసాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్
గత కొంతకాలంగా తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, నెల్లూరు జిల్లాలో కేవలం వ్యవసాయంపైనే దృష్టి పెడుతున్నానని ప్రకటించిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, అకస్మాత్తుగా సరికొత్త పొలిటికల్ గెటప్‌లో వెలుగులోకి వచ్చారు. ఈసారి ఆయన అత్యంత బలమైన హిందూత్వ నినాదాన్ని తన అస్త్రంగా ఎంచుకోవడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. హిందూ సనాతన ధర్మానికి, దేశానికి ద్రోహం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని, అలాంటి చర్యలకు పాల్పడే వారికి యావజ్జీవ కారావాసం లేదా మరణశిక్ష విధించినా తప్పులేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. కులమతాలకు అతీతంగా ఎవరైనా హిందూ మతాన్ని, దేవతలను దూషిస్తే చట్టం, సమాజం రెండూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
సరిగ్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు మద్దతు ఇస్తోందనే విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలోనే సాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉపా (UAPA) చట్టం కింద అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రశ్న రావణ్, అలాగే నటుడు ప్రకాష్ రాజ్‌లను వైసీపీ నేరుగా సమర్థించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ముమ్మాటికీ హిందూ ధర్మంపై జరుగుతున్న దాడేనని ఆరోపిస్తూ.. అసలు వీరి వెనుక ఉండి నడిపిస్తున్న శక్తులు ఎవరో తెలుగు ప్రజలు ఆలోచించాలని నిలదీశారు. అంతేకాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ మత మార్పిళ్ల వెనుక రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన కొందరు పాస్టర్లు ఉంటూ ఆర్థిక, రాజకీయ లాభాలు పొందుతున్నారనే సంచలన కోణాన్ని కూడా ఆయన తెరపైకి తెచ్చారు.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఒకప్పుడు వైఎస్ జగన్‌కు అత్యంత నమ్మినబంటుగా ఉండి, రాజ్యసభ సభ్యత్వానికి మరియు వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి పునరాగమనం చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఆయనపై ఉన్న పాత అక్రమాస్తుల కేసులతో పాటు రూ.3,500 కోట్ల ఏపీ మద్యం కుంభకోణం, కాకినాడ పోర్టు అక్రమాల్లో ఈడీ, సీఐడీ దర్యాప్తు వేడి పెరుగుతోంది. ఈ కేసుల భయం వల్లేనా లేక వ్యూహాత్మకంగానే ఆయన తీవ్ర హిందూత్వ లైన్ తీసుకుని బీజేపీ వైపు చూపు చూస్తున్నారా అనే చర్చ నడుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిని రహస్యంగా కలిశారనే సమాచారం కూడా ఉండటంతో, భవిష్యత్తులో సాయిరెడ్డి కాషాయ కండువా కప్పుకోవడం ద్వారా ఏపీ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మారబోతున్నాయనేది స్పష్టమవుతోంది.
Next Story

