
పవన్ కల్యాణ్ ’త్యాగం‘ వెనుక అసలు కథ ఇదేనా?
రాజకీయ వ్యూహమా.. లేక చంద్రబాబుకు పరోక్ష హెచ్చరికా?
కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో తిరుపతి వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ’త్యాగం‘ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపాయి. విమర్శకుల కోణం నుండి చూస్తే.. పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత ఆస్తులను, కుటుంబాన్ని లేదా వ్యాపారాలను త్యాగం చేయలేదు. కేవలం వైఎస్ జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఏకైక రాజకీయ వ్యూహంతోనే కూటమితో జతకట్టారు. కేవలం 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకే పరిమితం కావడం వెనుక త్యాగం కంటే కూడా, ఎక్కువ సీట్లు తీసుకుంటే ఓట్లు చీలి మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందనే ముందస్తు భయమే ప్రధాన కారణం. అందువల్ల, పూర్తిగా అధికారం దక్కించుకోవడానికి , గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి పరస్పర ప్రయోజనాల కోసం చేసుకున్న ఒక ముందస్తు సీట్ల సర్దుబాటును ’త్యాగం‘ అనే పెద్ద పదంతో అభివర్ణించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నాయి.
అయితే, ఈ ’త్యాగం‘ అనే పదాన్ని పవన్ కల్యాణ్ పదే పదే ప్రస్తావించడం వెనుక ఒక లోతైన రాజకీయ వ్యూహంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడికి ఒక పరోక్ష హెచ్చరిక కూడా దాగి ఉందనే విశ్లేషణలు నడుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జనసేనకు మంచి బలమున్నా, కేవలం కూటమి ధర్మం కోసం తాము తగ్గడం వల్లే ఈరోజు కూటమి అధికారంలోకి రాగలిగిందని, కాబట్టి తమను తక్కువ అంచనా వేయవద్దని చంద్రబాబుకు, టీడీపీ పెద్దలకు ఆయన ఒక స్పష్టమైన పొలిటికల్ సిగ్నల్ ఇచ్చారు. అదే సమయంలో, తక్కువ సీట్లకు ఒప్పుకోవడంపై గత ఎన్నికల నుండి తీవ్ర అసంతృప్తితో ఉంటూ, ప్రభుత్వంలో ఆశించిన ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న తన కేడర్, జనసేన కార్యకర్తలలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం ఇది. మనం అధికార దాహంతో తగ్గలేదు.. రాష్ట్రం కోసం త్యాగం చేశాం.. ఈ ప్రభుత్వ ఏర్పాటులో మనదే అప్పర్ హ్యాండ్ అనే భావనను జనసైనికుల్లో ఇంజెక్ట్ చేయడం ద్వారా అటు కేడర్ బలాన్ని కాపాడుకుంటూనే, ఇటు ప్రభుత్వంలో తన పట్టును మరింత పెంచుకునేలా పవన్ ఈ వ్యూహాత్మక వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు.

