తెలంగాణపై పవన్ కల్యాణ్ బీజేపీ వదిలిన బాణమా?
x

తెలంగాణపై పవన్ కల్యాణ్ బీజేపీ వదిలిన బాణమా?

తెలంగాణలో జనసేన పోటీ చేసి తీరుతుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక కూడా పవన్ కల్యాణ్ హఠాత్తుగా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెంచడం వెనుక ఢిల్లీ బీజేపీ పెద్దల వ్యూహాత్మక హస్తం ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తయినా ఎన్నడూ లేని విధంగా, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో ‘నవనిర్మాణ సంకల్ప సభ’కు సిద్ధమవ్వడం, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి గతంలో నేరుగా మద్దతు ఇవ్వని పవన్, హైదరాబాద్‌ను కేవలం ఏపీ రాజకీయాలకు మాత్రమే వేదికగా వాడుకున్న చరిత్ర ఉంది. అయితే, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి భేటీ అయిన కొద్ది రోజుల్లోనే ఈ పరిణామాలు వేగంగా మారడం గమనార్హం. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గట్టిగా ఢీకొట్టడానికి చంద్రబాబు నాయుడినో లేదా నారా లోకేష్‌నో కాకుండా, బీజేపీ అగ్రనాయకత్వమే పవన్ కల్యాణ్‌ను ఒక పవర్‌ఫుల్ అస్త్రంగా తెలంగాణ మీదికి వదిలిందనే విశ్లేషణలకు ఈ టైమింగ్ బలాన్ని చేకూరుస్తోంది.



https://www.youtube.com/watch?v=yrxP-QnhMLw


ఈ వ్యూహం వెనుక బీజేపీకి స్పష్టమైన దీర్ఘకాలిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ (BRS) బలహీనపడిన తరుణంలో, ఆ స్థానాన్ని భర్తీ చేసి తామే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. అందుకోసం తెలంగాణలో విస్తృతమైన క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను, జనసేన ఓటు బ్యాంకునే ఒక ఎత్తుగడగా వాడుకోవాలని చూస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణపై జనసేన శ్రేణుల కేసులు, దానికి కౌంటర్‌గా తెలంగాణ మేధావుల తిరుగుబాటు వంటి ప్రాంతీయ సెంటిమెంట్లను కూడా పవన్ తన ప్రెస్ మీట్ ద్వారా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పవన్ విసిరిన ఓపెన్ ఛాలెంజ్ 2029 ఎన్నికల్లో ఒంటరిగానైనా పోటీ చేస్తామన్న ప్రకటన.. పరోక్షంగా తెలంగాణలో కాంగ్రెస్ వ్యతిరేక ఓటును చీల్చడానికో లేదా బీజేపీకి అనుకూలంగా మార్చడానికో వేసిన పెద్ద స్కెచ్‌గా అర్థమవుతోంది. మొత్తానికి ఏపీలో సక్సెస్ అయిన కూటమి ఫార్ములాను పక్కన పెట్టి, తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి బీజేపీ పవన్‌ను ఒక పొలిటికల్ బాణంగా ప్రయోగించిందనేది ఈ తాజా పరిణామాల ద్వారా స్పష్టమవుతోంది.
Read More
Next Story