కేరళ కాంగ్రెస్ కూటమిదేనా?
x

కేరళ కాంగ్రెస్ కూటమిదేనా?

ముఖ్యమంత్రి పినరయి విజయన్ తొలుత వెనుకంజలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం 2,800 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో పోరాడుతున్నారు.


కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. మధ్యాహ్నం 1:30 గంటల వరకు అందిన ట్రెండ్స్ ప్రకారం, మొత్తం 140 స్థానాలకు గానూ UDF ఏకంగా 96 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో ఉంది. 2001 తర్వాత ఆ కూటమి సాధించబోతున్న అతిపెద్ద విజయమిదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి ఐదేళ్లకోసారి అధికారాన్ని మార్చే సంప్రదాయాన్ని (Alternating Government) కేరళ ఓటర్లు మళ్ళీ పునరావృతం చేస్తూ కాంగ్రెస్ కూటమికి బ్రహ్మరథం పట్టారు.

చతికిలపడ్డ వామపక్ష కూటమి ..మంత్రుల వెనుకంజ
వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకుని రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ (LDF) ఈసారి గట్టి ఎదురుదెబ్బ తింది. అధికార కూటమి కేవలం 39-42 స్థానాలకే పరిమితమై భారీ వెనుకంజలో ఉంది. ముఖ్యంగా పినరయి కేబినెట్‌లోని కీలక మంత్రులు ఆర్. బిందు, పి. రాజీవ్ వంటి వారు ఓటమి దిశగా సాగుతుండటం గమనార్హం. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సొంత నియోజకవర్గమైన ధర్మదంలో తొలుత వెనుకంజలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం 2,800 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో పోరాడుతున్నారు.
జిల్లాల వారీగా UDF క్లీన్ స్వీప్
ఈ ఎన్నికల్లో కేరళలోని అన్ని ప్రాంతాల్లోనూ UDF హవా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇడుక్కి జిల్లాలోని మొత్తం 5 స్థానాలను UDF కైవసం చేసుకునే దిశగా ఉండగా, కోజికోడ్ జిల్లాలోని 13 స్థానాలకు గానూ 12 చోట్ల కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితాల హరిపాడ్ నియోజకవర్గంలో 23,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
ఎన్డీయే పరిస్థితి .. తుది ఫలితం దిశగా
మరోవైపు, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కేవలం 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యాన్ని ప్రదర్శించగలిగింది. కేరళ ఓటర్లు ప్రధానంగా కాంగ్రెస్ , వామపక్షాల మధ్యే తమ మొగ్గును చూపినట్లు ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, UDF మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటేయడంతో కేరళలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైపోయింది.
Read More
Next Story