
70 మంది జర్నలిస్టులపై అక్రమ కేసులు: విడదల రజిని ఫైర్
హైకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరు
చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజినిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆదివారం ఆమె చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.
మీడియా గొంతు నొక్కుతున్నారు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని రజిని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతున్న దాదాపు 70 మందికి పైగా జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం నిరంకుశత్వానికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు. ప్రతిపక్షం గొంతు వినిపించకూడదనే కుట్రతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
పడిపోతున్న పోలీస్ ర్యాంకు
రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యాంగం కాకుండా రెడ్‌బుక్ పాలన సాగుతోందని రజిని వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు ఐఏఎస్ అధికారులను కూడా ఈ రెడ్‌బుక్ పేరుతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ కేవలం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడంపైనే దృష్టి పెట్టిందని, దీనివల్ల నేరాల నియంత్రణలో రాష్ట్ర పోలీసుల ర్యాంకు పడిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు.
ప్రజా సమస్యలపై పోరాడితే వేధింపులేనా?
విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టినందుకు తనపై కేసు పెట్టారని రజిని గుర్తుచేశారు. చివరకు గుడికి వెళ్లి వస్తుంటే తనపై దాడి చేసి, తిరిగి తనపైనే కేసు కట్టడం ఎంతవరకు ధర్మమని ఆమె ప్రశ్నించారు. అక్రమ కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
విష విత్తనాలపై హెచ్చరిక
ప్రభుత్వం ఇప్పుడు నాటుతున్న ఈ కక్షపూరిత విష విత్తనాలు రేపు వృక్షాలైతే, భవిష్యత్తులో అది ఎవరికి ప్రమాదకరమో ఆలోచించుకోవాలని ఆమె ఘాటుగా స్పష్టం చేశారు. అక్రమ కేసులు, వేధింపులతో ప్రతిపక్షాన్ని అణచలేరని ఆమె తన ప్రసంగం ద్వారా కూటమి సర్కార్‌కు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
Next Story

