
యువ ఓటర్ల కోసం మారిన తమిళనాడు ఎన్నికల స్టైల్..
వైరల్ రీల్స్, రోడ్‌షోలు; 2026 ప్రచారం దిశ మార్చిన యువ ఓటర్లు
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈసారి పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఇది కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా, ఒక ప్రదర్శనగా మారింది. వైరల్ క్షణాలు, సోషల్ మీడియా కోసం ప్రత్యేకంగా రూపొందించిన సన్నివేశాలు ప్రధానంగా కనిపించాయి.
విజయ్ ప్రభావం..
ఈ మార్పుకు కేంద్రబిందువుగా నిలిచారు టీవీకే చీఫ్ విజయ్ (Vijay). ఆయన రాజకీయాల్లోకి రావడం ప్రచారానికి కొత్త శైలి తీసుకొచ్చింది. ఆయన ర్యాలీలు సినిమా ఈవెంట్లను తలపించాయి. పదునైన డైలాగులు, నాటకీయ హావభావాలు, సోషల్ మీడియాలో పంచుకునే క్షణాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
కంటెంట్ ఆధారిత రాజకీయాలు..
రాజకీయాలు ఇప్పుడు కేవలం నాయకుల ప్రసంగాల గురించి కాకుండా, సోషల్ మీడియోలో కంటెంట్ ఆధారిత రాజకీయాలు దర్శనమిస్తున్నాయి.
సంప్రదాయ నేతల తీరులో మార్పు..
ఈ ధోరణి ఇతర నాయకుల శైలిలో మార్పు తెచ్చి పెట్టింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన ప్రచారంలో సాధారణ జీవనశైలిని చూపించే దృశ్యాలను చేర్చారు. ఆటోలో ప్రయాణించడం, చెరకు నలపడం, ప్రజలతో మమేకమయ్యే క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రచార వేదికలు ఇప్పుడు వినోద కార్యక్రమాలను తలపిస్తున్నాయి. సంగీతం, ప్రదర్శనలు, ఇంటరాక్షన్‌తో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు బాగా పెరిగాయి. సీమాన్ (Seeman) వంటి నేతలు పాటలు పాడగా, ఇతర నాయకులు సంగీతంతో సరిపెట్టారు.
సెల్ఫీ రాజకీయాలు..
సెల్ఫీలు, వీడియోలు ప్రచారంలో కీలకంగా మారాయి. ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) వంటి నేతలు ప్రజలతో సెల్ఫీలు తీసుకుంటూ ప్రచారాన్ని మరింత దగ్గరగా తీసుకెళ్లారు. ప్రత్యేక వీడియో టీమ్‌లు ప్రచారాన్ని చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పంచుతున్నాయి.
సైకిల్ రైడ్‌లు, ఆటో ప్రయాణాలు, బైక్ ర్యాలీలు.. ఇవన్నీ ప్రజలకు దగ్గరగా ఉన్నామనే సంకేతాలను పంపాయి. తమిళసై (Tamilisai Soundararajan), వనతి శ్రీనివాసన్ (Vanathi Srinivasan) వంటి నేతలు కూడా ఈ శైలిని అనుసరించారు.
యువ ఓటర్లపై ఫోకస్..
ఈ సారి జెన్ జెడ్ ఓటర్లను ఆకర్షించడం ప్రధాన లక్ష్యంగా మారింది. మొదటిసారి ఓటు వేయబోయే వారిని దృష్టిలో పెట్టుకుని ప్రచారాన్ని రూపొందించారు. K. ఫళని స్వామి (Edappadi K. Palaniswami)వంటి నేతలు తమ విధానాలను యువతకు అర్థమయ్యేలా వివరించారు.
మొత్తం మీద ఈ ఎన్నికలు ఒక కీలక ప్రశ్నను ముందుకు తెచ్చాయి. ఓటర్లు వైరల్ కంటెంట్‌ను చూసి నిర్ణయం తీసుకుంటారా? లేక విధానాలు, అభివృద్ధి ఆధారంగా ఓటేస్తారా? అన్నది త్వరలో తేలనుంది.

