ఏపీలో జెన్ Z కలవరం
డిజిటల్ యువశక్తిగా ఎగిసిపడే అవకాశం. అధికార, ప్రతిపక్షాలకు పట్టుకున్న బొద్దింకల భయం.
దేశవ్యాప్తంగా నిరుద్యోగానికి వ్యతిరేకంగా జెన్ Z తరం యువత సృష్టించిన కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) అనే వ్యంగ్య డిజిటల్ నిరసన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తీవ్రంగా కుదిపేస్తోంది. సుప్రీం కోర్టు విచారణల నేపథ్యంలో నిరుద్యోగ సోషల్ మీడియా యాక్టివిస్టులను ఉద్దేశించి వచ్చిన కొన్ని వ్యాఖ్యలకు ప్రతిచర్యగా ఎగిసిన ఈ యువత ఆగ్రహం, ప్రస్తుతం ఒక బలమైన సామాజిక శక్తీగా రూపాంతరం చెందింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పేదలు, నిరుద్యోగులు ఒకరోజు బొద్దింకల మాదిరిగా వీధుల్లోకి రావడం ఖాయమనే సంకేతాన్ని ఇస్తూ సాగుతున్న ఈ మూవ్‌మెంట్.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ వంటి అగ్ర నేతలను సైతం తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. సాంప్రదాయ నిరసనలకు భిన్నంగా.. సోషల్ మీడియా ట్రెండ్స్, మీమ్స్ ద్వారా వేగంగా విస్తరిస్తున్న ఈ డిజిటల్ యువశక్తి, ఏపీలోని స్థిరపడిన ప్రాంతీయ పార్టీలలో మునుపెన్నడూ లేని కలవరాన్ని, రాజకీయ అప్రమత్తతను రేకెత్తిస్తోంది.

