యుద్ధం లేని మిత్రులు..శాంతి లేని శత్రువులు
x

యుద్ధం లేని మిత్రులు..శాంతి లేని శత్రువులు

ఏపీ రాజకీయంలో తెరవెనుక సాగుతున్న మైండ్ గేమ్


ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో పైకి కనిపిస్తున్న సమీకరణాల కంటే, తెరవెనుక సాగుతున్న మైండ్ గేమ్స్ అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీ బీజేపీ పెద్దల సీక్రెట్ గేమ్ ఎలా ఉందంటే.. ప్రస్తుతం ఎన్డీఏలో అధికారిక భాగస్వామిగా ఉన్న చంద్రబాబుతో దోస్తీ నడుపుతూనే, అంతర్గతంగా మాత్రం వైఎస్ జగన్‌పై ఒకరకమైన నమ్మకాన్ని, సానుకూలతను బీజేపీ కొనసాగిస్తోంది. వీరిద్దరి బంధాన్ని యుద్దం లేని మిత్రులు.. శాంతి లేని శత్రువులు అని చెప్పవచ్చు. ఒకే కూటమిలో లేకపోయినా వీరి మధ్య అప్రకటిత స్నేహం సాగింది. జాతీయ స్థాయిలో ఎప్పుడూ ఒకరినొకరు ఢీకొనలేదు. పార్లమెంట్‌లో కేంద్రానికి అవసరమైన ప్రతిసారీ, వివాదాస్పద బిల్లుల విషయంలో సైతం వైసీపీ బేషరతుగా మద్దతు ఇస్తూ కేంద్రానికి బలమైన భరోసాగా నిలిచింది. దీనికి తోడు, ఏపీలో కమలం పార్టీ ఎదుగుదలను జగన్ ఎప్పుడూ వ్యూహాత్మకంగా తొక్కేయాలని చూడలేదు. అందుకే, అధికారిక మిత్రపక్షం కంటే అంతర్గతంగా జగన్‌కే ఢిల్లీ పెద్దలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.



మరోవైపు, చంద్రబాబుపై ఢిల్లీ పెద్దల్లో పూర్తి నమ్మకం కుదరకపోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. గతంలో మా వల్లే ఏపీలో బీజేపీ నేతలు గెలిచారు అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ నాయకత్వం ఇప్పటికీ గుర్రుగానే ఉంది. పైగా, ఏపీలో బీజేపీ కనుక బలపడితే అది తమ సొంత ఓటు బ్యాంకును చీల్చుతుందనే భయం టీడీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఓటు బ్యాంకు భయంతోనే చంద్రబాబు కమలాన్ని ఒక పరిధి దాటి ఎదగనివ్వరనేది ఢిల్లీ అంచనా. ఈ సమీకరణాలను బ్యాలెన్స్ చేయడానికి, చంద్రబాబుకు చెక్ పెడుతూనే దక్షిణాదిలో పాగా వేయడానికి బీజేపీకి పవన్ కల్యాణ్ ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ అస్త్రంగా దొరికారు. పవన్ కి ఉన్న సినీ గ్లామర్, విపరీతమైన మీడియా అటెన్షన్‌ను వాడుకుంటూ జాతీయవాదం పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారు ఢిల్లీ బీజేపీ పెద్దలు. అంతిమంగా, అవసరాలే రాజకీయ బాంధాలను శాసిస్తాయి అనే సూత్రం ప్రకారం.. ఏపీ కూటమి ప్రభుత్వంలో పైకి నవ్వులు కనిపిస్తున్నా, తెరవెనుక మాత్రం ఎవరి వ్యూహాల్లో వారు మునిగితేలుతున్నారు.

Read More
Next Story