x

టీడీపీ తరహాలో వైసీపీ... సోషల్ మీడియో ఇన్‌ఫ్లూయర్లకు ప్రాధాన్యం..

సోషల్ మీడియా వారియర్లకు భాషపై సజ్జల పరివర్తన పాఠాలు..


సోషల్ మీడియా అనేది ఓ వ్యవస్థగా పరిమితం కాకూడదు. పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే బలీయమైన శక్తిగా మారాలని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యేక సూచనలు చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రత్యేక కర్తవ్య బోధ చేశారు.

టీడీపీ కూటమి తరహాలోనే ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా వారియర్లకు తోడుగా స్థానిక ఇన్‌ఫ్లూయర్లకు వైసీపీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. వారితో వీడియోలు, టెస్టిమోనియల్స్ రూపొందించాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. అలాంటి వారిని జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా పరిచయం చేసి వారి రీచ్ పెంచడం ద్వారా పార్టీకి ఉపయోగపడే బలమైన లోకల్ వాయిస్‌లను తయారు చేయాలని సజ్జల సూచించారు.

భాషపై జాగ్రత్త...

సోషల్ మీడియా పోస్టుల్లో ఆవేశానికి లోనై వ్యక్తిగత దూషణలకు వెళ్లవద్దు. మనం ఎవరికి సమాధానం చెబుతున్నామనేది కాదు. మనం కమ్యూనికేట్ చేసేది ప్రజలకు.భాష హుందాగా ఉండాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఆచితూచి స్పందించాలి. ప్రత్యర్థి చేసే వ్యాఖ్యాలపై తీవ్ర స్థాయిలో స్పందించడం అంటే కష్టాలు తెచ్చుకోవడమే. పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టే అవకాశం ఉంటుంది అని హెచ్చరిస్తూ, సజ్జల ప్రత్యేకంగా సూచించారు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీలో సాక్షాత్తూ మంత్రులు బూతులు మాట్లాడడం. అధికారం కోల్పోయిన తరువాత కూడా మీడియా ముందు పరుషపదజాలాన్ని వదలకపోవడం. ఈ తరహా మాటలు వైసీపీకి నష్టం కలిగించాయని ఆలస్యం గ్రహించారా? ఎదురైన పరిణామాలతో అధికారానికి దూరం అయ్యామనే పరివర్తన సజ్జల మాటల్లో ప్రతిధ్వనించినట్లు భావిస్తున్నారు
స్థానిక ఎన్నికలకు మాత్రమే ఈ ఆత్మావలోకనం పరిమితం అవుతుందా? అనేది వైసీపీలో నంబర్ 2గా ఉన్న సజ్జల చేసిన సూచనలు చర్చకు ఆస్కారం కల్పించాయి.
సోషల్ మీడియా వారియర్ల మీట్ లో సజ్జల ఇంకా ఏమన్నారంటే..
"సోషల్ మీడియా విభాగంలో బాధ్యతలు నిర్వహించే వారు సాధారణ కార్యకర్తల కంటే భిన్నంగా కంటెంట్‌ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే ఆర్గనైజర్లుగా పనిచేయాలి. కంటెంట్ క్రియేట్ చేయడం ఒక్కటే కాకుండా, పార్టీ నుంచి వచ్చే మెసేజ్‌ను వెయ్యి మందికా, పదివేల మందికా, లక్ష మందికా ఎంత వేగంగా తీసుకెళ్లగలుగుతున్నామన్నదే అసలు సామర్థ్యం. సోషల్ మీడియా ప్రస్తుతం పార్టీ వ్యవస్థకు శరీరంలో రక్తప్రసరణలాంటి పాత్ర పోషిస్తోంది. ప్రజాభిప్రాయాన్ని చేరుకోవడం, పార్టీ వాదనను ప్రజల ముందు ఉంచడంలో దాని పాత్ర అత్యంత కీలకం. సోషల్ మీడియా విభాగం అన్ని అనుబంధ విభాగాలతో అనుసంధానమై పనిచేయాలి" అని సజ్జల దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తున్నది.

నెట్‌వర్క్ పెంచాలి

రాష్ట్రంలోని ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గంలో సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని సజ్జల సూచించారు. ప్రతి కార్యకర్త తనకు అందిన పార్టీ సందేశాన్ని ఎంతమందికి చేరవేయగలుగుతున్నాడో స్పష్టంగా గుర్తించుకోవాలని చెప్పారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఉన్న సోషల్ మీడియా కమిటీలను ఉపయోగించి, ప్రతి ప్రాంతానికి ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలు, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫాంలతో పార్టీ కంటెంట్‌ను నేరుగా గ్రౌండ్ లెవెల్‌కు తీసుకెళ్లాలని సూచించారు.

లోకల్ కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం

రాష్ట్రస్థాయి సాధారణ రాజకీయ సందేశాలతో పాటు స్థానిక సమస్యలే ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపుతాయని సజ్జల చెప్పారు. ఒక గ్రామంలో పెన్షన్లు తొలగించడం, స్థానికంగా సంక్షేమ ప్రయోజనాలు అందకపోవడం, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థుల ఫీజులు, రైతుల ఇబ్బందులు, ధరల పెరుగుదల, స్థానిక నాయకులపై ఉన్న ఆరోపణలు వంటి అంశాలను వాస్తవ ఉదాహరణలు, గణాంకాలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
మహిళా విభాగం మహిళల సమస్యలపై, యువజన విభాగం నిరుద్యోగం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై, రైతు విభాగం రైతు సమస్యలపై కంటెంట్ రూపొందిస్తే, సోషల్ మీడియా విభాగం ఆ కంటెంట్‌ను విస్తృతంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పారు.

స్థానికంగా మాట్లాడగలిగే వారిని గుర్తించాలి

గ్రామం, మండలం, నియోజకవర్గ స్థాయిలో మంచి విషయ పరిజ్ఞానం ఉండి, స్పష్టంగా మాట్లాడగలిగే వారిని గుర్తించి ప్రోత్సహించాలని సజ్జల సూచించారు. పార్టీ విభాగాలకు చెందిన వారితో పాటు, ప్రజా సమస్యలపై మాట్లాడగలిగే రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, స్థానిక ఇన్‌ఫ్లూయన్సర్లను గుర్తించి వారి ద్వారా వీడియోలు, టెస్టిమోనియల్స్ రూపొందించాలని చెప్పారు. అలాంటి వారిని జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా పరిచయం చేసి వారి రీచ్ పెంచడం ద్వారా పార్టీకి ఉపయోగపడే బలమైన లోకల్ వాయిస్‌లను తయారు చేయాలని అన్నారు.

విజువల్ ఎవిడెన్స్ కీలకం

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు ఎక్కడైనా అడ్డంకులు, అధికారుల దుర్వినియోగం, పోలీసుల జోక్యం లేదా ప్రత్యర్థుల దౌర్జన్యాలు జరిగితే వాటిని తప్పనిసరిగా వీడియో రూపంలో రికార్డు చేయాలని సజ్జల సూచించారు.
ఈ విజువల్ ఎవిడెన్స్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు, కోర్టుల్లో న్యాయపరమైన చర్యలకు కూడా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. గ్రామస్థాయి కార్యకర్త వరకు ఎక్కడ ఏ ఘటన జరిగినా దాన్ని వెంటనే రికార్డు చేసి సోషల్ మీడియా నెట్‌వర్క్‌కు చేరవేసే వ్యవస్థ ఉండాలని సూచించారు.

అభ్యర్థికి అండగా ఉండాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో సోషల్ మీడియా కార్యకర్తలు కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కాకుండా, నామినేషన్ నుంచి పోలింగ్ ఫలితాల వరకు పార్టీ అభ్యర్థులకు అండగా ఉండాలని సమావేశంలో పిలుపునిచ్చారు. అభ్యర్థి పేరు, గుర్తు, స్థానిక సమస్యలు, ప్రచార కార్యక్రమాలను సోషల్ మీడియాలో విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల్లో సోషల్ మీడియా పనితీరును వచ్చే సాధారణ ఎన్నికలకు ఒక డ్రెస్ రిహార్సల్‌గా తీసుకోవాలని సజ్జల పేర్కొన్నారు.

విమర్శలో విషయం, భాష హుందాగా ఉండాలి

సోషల్ మీడియా పోస్టుల్లో ఆవేశానికి లోనై వ్యక్తిగత దూషణలకు వెళ్లవద్దని సజ్జల ప్రత్యేకంగా సూచించారు. “మనం ఎవరికి సమాధానం చెబుతున్నామనేది కాదు. మనం కమ్యూనికేట్ చేసేది ప్రజలకు” అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. విమర్శలో విషయం, ఆధారాలు ఉండాలని, ఉపయోగించే భాష హుందాగా ఉండాలని స్పష్టం చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు అదే స్థాయిలో స్పందించడం వల్ల పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు అవకాశం కల్పించకూడదని సూచించారు.
సోషల్ మీడియా అనేది కార్యకర్తలకు పార్టీ అండగా నిలిచిందని వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి చెప్పారు.
"రెండేళ్లలో సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదైన సందర్భాల్లో పార్టీ నాయకత్వం, లీగల్ సెల్ వారికి న్యాయపరంగా అండగా నిలిచింది. పార్టీ నాయకత్వం సోషల్ మీడియాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ నుంచి ఫలితాల వరకు అభ్యర్థులకు సోషల్ మీడియా విభాగం అండగా నిలవాలి" అని దొడ్డా అంజిరెడ్డి ప్రత్యేక సూచనలు చేశార.
సోషల్ మీడియా వారియర్లు ఆవేశానికి లోనుకావద్దని వైసీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి ప్రత్యేక సూచనలు చేశారు.
"రెచ్చగొట్టే పోస్టులు, వ్యాఖ్యలకు స్పందించే సమయంలో సహనం పాటించండి. ఆవేశంలో చేసే వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. స్తవాలు, ఆధారాలతో పద్ధతిగా ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలి" అని లీగన్ సెల్ నేత సుదర్శనరెడ్డి ముందస్తు హెచ్చరికలతో సూచనలు చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
"గత ప్రభుత్వంలో జరిగిన మంచి. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆధారాలతో ప్రజల్లోకి తీసుకెళ్లండి" అని కూడా సుదర్శనరెడ్డి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సోషల్ మీడియా విభాగం తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశంగా తీసుకుని, నెట్‌వర్క్ విస్తరణ, లోకల్ కంటెంట్, వేగవంతమైన డిస్ట్రిబ్యూషన్, విజువల్ ఎవిడెన్స్, అభ్యర్థులకు డిజిటల్ సపోర్ట్ అనే అంశాలపై కార్యాచరణ ప్రారంభించాలని సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, పూడి శ్రీహరి కూడా పాల్గొన్నారు.
Read More
Next Story