చంద్రబాబు డైరెక్టుగా యుద్ధం చెయ్..నీచపు రాతలతో కాదు: సతీష్ రెడ్డి ఫైర్
x

చంద్రబాబు డైరెక్టుగా యుద్ధం చెయ్..నీచపు రాతలతో కాదు: సతీష్ రెడ్డి ఫైర్

సీఎం చంద్రబాబుపైన సతీష్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశంగా మారాయి.


టీడీపీ నాయకులు, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం వేంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు తన రాజకీయ లబ్ధి కోసం తప్పుడు అజెండాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే చంద్రబాబు నైజం అర్థమవుతోందని ఆయన విమర్శించారు.

ఎల్లో పత్రికల తీరుపై నిప్పులు
పెద్ద దస్తగిరి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదును కూడా లెక్కచేయకుండా ఈనాడు పత్రిక నీచమైన కథనాలను ప్రచురిస్తోందని సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ’చంద్రబాబు ఆపదలో ఉన్నప్పుడల్లా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తప్పుడు రాతలు రాయడం అలవాటుగా మార్చుకున్నాయి. వైఎస్సార్సీపీకి, వైఎస్ జగన్‌కు లేనిపోని లింకులు పెడుతూ కథనాలు అల్లుతున్నారు. ఆంధ్రజ్యోతి అంటే చంద్రబాబు, ఆంధ్రజ్యోతి అంటే టీడీపీ అని అందరికీ తెలుసు‘ అని ఆయన ఎద్దేవా చేశారు.
దమ్ముంటే జగన్‌తో నేరుగా తలపడు
తప్పుడు వార్తా కథనాల వెనుక దాక్కుని రాజకీయాలు చేయడం మానుకోవాలని సతీష్ రెడ్డి చంద్రబాబుకు సవాల్ విసిరారు. ’తప్పుడు రాతల ద్వారా కాకుండా దమ్ముంటే వైఎస్ జగన్ మీద నేరుగా యుద్ధం చేయగలవా చంద్రబాబు?‘ అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబు ఇలాంటి నీచపు రాజకీయాలకు తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు.
హత్యలపై కేసుల గురించి సంచలన వ్యాఖ్యలు
మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఒకరినొకరు చంపుకుంటే, ఆ హత్యలతో ఎలాంటి సంబంధం లేక పోయినా ఆ నెపం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద నెట్టి కేసులు పెట్టారని సతీష్ రెడ్డి విమర్శించారు. ఇటీవల జరిగిన దస్తగిరి హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. ’దస్తగిరిని హత్య చేయాల్సిన అవసరం నిత్యానింద రెడ్డికి ఏముంది? రాష్ట్రంలో జరిగే ప్రతి హత్యకు ఏ1 నిందితుడిగా చంద్రబాబు నాయుడిపైనే కేసులు పెట్టాలి‘ అని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు చేస్తున్న తప్పులను దేవుడు లెక్కిస్తున్నాడని, సరైన సమయంలో ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుపైన సతీష్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశంగా మారాయి.
Read More
Next Story