అబ్బాకొడుకులవన్నీ అబద్ధాలే, బస్తీమే సవాలన్న జగన్
x

'అబ్బాకొడుకుల'వన్నీ అబద్ధాలే, బస్తీమే సవాలన్న జగన్

372 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్ని అమ్ముకున్నారు, మెగా డీఎస్సీ, గ్రూప్-1 పై సీబీఐ విచారణకు డిమాండ్


వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. అబ్బాకొడుకులు అబద్ధాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ముఖ్యమైన అంశాలు ఇవి.

మెగా డీఎస్సీ అవకతవకలు, ఆరోపణలు

మా హయాంలో నిర్వహించిన 2018 గ్రూప్‌-1పై సీబీఐ దర్యాప్తునకు నేను రెడీ.. మీ హయాంలో జరిగిన 2025 డీఎస్సీపై సీబీఐ దర్యాప్తునకు మీరు సిద్ధమా? అని చంద్రబాబుకి వైఎస్‌ జగన్‌ ఓపెన్‌ చాలెంజ్‌ విసిరారు.
తప్పు చేయలేదు కాబట్టే తల ఎత్తుకుని అడుగుతున్నాం. ఫస్ట్‌ ర్యాంకర్‌ నవీన్‌కు ఎందుకు ఉద్యోగం రాలేదు?. విద్యాశాఖ మంత్రి ఆదేశాలు లేకుండా జీవోలు ఇవ్వగలరా?. బేరసారాల ఆడియో, వీడియో టేపులపై చర్యలేవీ?. సీబీఐ విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి లేఖ రాశాం. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశాం. సీబీఐ విచారణ చేయించాలని కోర్టును కూడా ఆశ్రయించాం. సవాల్‌కు సిద్ధమైతే.. విచారణకు సిద్ధమైతే దర్యాప్తు సంస్థకు లేఖ రాయండి అని వైఎస్‌ జగన్‌ అన్నారు.
స్పోర్ట్స్‌కోటాలో ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నాలు జరిగాయన్నది వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వమే ఒప్పుకుందని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పులు బయటకు వచ్చాయని.. కేసు కూడా నమోదైందని ఆయన గుర్తు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
జీవోలిచ్చే స్థాయికి డీఎస్సీ స్కాం వెళ్లింది. మంత్రి ఆమోదం లేకుండా జీవోలు ఇస్తారా?. డీఎస్సీ స్కాంపై ఆడియో, వీడియో టేపులు బయటకు వచ్చాయి. టేపులు బయటకు వచ్చినట్లు బాబు, లోకేశ్‌లు ఒప్పుకున్నారు. ఎంతో సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్నట్లు బిల్డప్‌ ఇచ్చారు. కానీ, జరిగింది ఏంటో తెలుసా?..
ఎఫ్‌ఐఆర్‌ కాపీలో నిందితుడిని సస్పెక్టెడ్‌ అని రాశారు. అరెస్ట్‌ శిక్ష సంగతి పక్కన పెడితే.. ఆ వ్యక్తికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించేశారు. అసలు వెంటనే ఎఫ్‌ఐఆర్‌ రాయకుండా ఉన్నతాధికారులతో ఎందుకు మాట్లాడారు?. ఆడియో, వీడియో టేపుల్లో ఆ వ్యక్తి ఫోన్‌ నెంబర్‌ బయటకు వచ్చింది. ఆ నెంబర్‌ ఎవరిదనేది కనుక్కోవడం పోలీసులకు ఎంత సేపు పని?. దారుణంగా అబద్దాలు ఆడుతున్నారు.. నిందితులను కాపాడుతున్నారు అని వైఎస్‌ జగన్‌ అన్నారు.
పరీక్ష లేకుండా నియామకాలు: డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్‌ కోటా కింద 372 మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారని జగన్‌ ప్రశ్నించారు. పీవీ సింధు పేరు చెప్పి సాధారణ నియామక ప్రక్రియను పక్కనపెట్టి అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు.
తమవారికి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రత్యేక జీవోలు ఇచ్చి, రిక్రూట్‌మెంట్‌ ముగిశాక వాటిని వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు.
ఉద్యోగాల అమ్మకాలు, బేరసారాలకు సంబంధించి ఆడియో, వీడియో ఆధారాలు బయటకు వచ్చినా నిందితులపై సరైన చర్యలు తీసుకోకుండా కాపాడుతున్నారని విమర్శించారు. బాధితులు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు.

గ్రూప్‌-1 వివాదంపై వివరణ, చంద్రబాబుకు సవాల్

2018 గ్రూప్‌-1 నోటిఫికేషన్: గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ చంద్రబాబు హయాంలోనే వచ్చిందని, ప్రిలిమ్స్‌ కూడా తమ ప్రభుత్వం రాకముందే జరిగిందని స్పష్టం చేశారు.
కోర్టు & సిట్ తీర్పులు: కోర్టు ఆదేశాల ప్రకారమే మాన్యువల్‌ వాల్యూయేషన్‌ నిర్వహించామని, చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్‌ కూడా వాల్యూయేషన్‌లో ఎలాంటి తప్పులు జరగలేదని అఫిడవిట్ ఇచ్చిందని పేర్కొన్నారు.
సీబీఐ దర్యాప్తు సవాల్:
తమ హయాంలో నిర్వహించిన 2018 గ్రూప్‌-1పై సీబీఐ దర్యాప్తునకు తాను సిద్ధమని ప్రకటిస్తూ, కూటమి హయాంలో జరిగిన డీఎస్సీపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా అని ఓపెన్‌ చాలెంజ్‌ విసిరారు.
రాజీనామాకు డిమాండ్, న్యాయ పోరాటం
డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.
డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ప్రధాని మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు లేఖలు రాశామని, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించామని జగన్‌ తెలిపారు.
Read More
Next Story