
నేటితో ముగిసిన ఎన్నికల ప్రచారం..
చెన్నైలో తెలుగు ఓటర్లే లక్ష్యంగా రంగంలోకి ఏపీ సీఎం చంద్రబాబు..పశ్చిమ బెంగాల్ కుల్టీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కేంద్రం హోం మంత్రి అమిత్ షా..
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరితో పాటు అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ (తొలిదశ) అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ప్రధాన పార్టీల అగ్రనేతలంతా రోడ్ షోలు, భారీ ర్యాలీలతో ముగింపు పర్వానికి సిద్ధమయ్యారు. దీంతో 48 గంటల పాటు “సైలెన్స్ పీరియడ్” అమల్లోకి రానుంది.
ఎవరు, ఎవరితో పోటీ..
తమిళనాడులో ప్రధాన పోటీ ఎం.కే. స్టాలిన్ నేతృత్వంలోని (DMK) కూటమి, ఎడప్పాడి కె. పళనిస్వామి నేతృత్వంలోని (AIADMK) మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. కేరళలో త్రిముఖ పోటీ నెలకొంది. పినరయి విజయన్ నేతృత్వంలోని LDF, వి.డి. సతీశన్ నేతృత్వంలోని UDF, BJP మధ్య ఎన్నికల పోరు ఉండబోతుంది. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని BJP, కాంగ్రెస్ + ప్రాంతీయ కూటములు తలపడనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని TMC, BJP,వామపక్షాలు + కాంగ్రెస్ మధ్య పోటీ ఉండబోతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు..23వ తేదీ ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లో అవసరమైన చర్యలను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. కేంద్ర పోలీసు బలగాలను ఇప్పటికే మోహరించింది. “సెన్సిటివ్” & “హైపర్ సెన్సిటివ్” కేంద్రాలను గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ ప్రాంతాల్లో డ్రోన్లు, వెబ్‌కాస్టింగ్ వినియోగించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో 24×7 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, వీడియో సర్వైలెన్స్ టీమ్స్ అందుబాటులో ఉంచారు. డబ్బు, మద్యం పంపిణీపై కఠిన ఆంక్షలు విధించారు. వేసవి దృష్ట్యా ఓటర్ల కోసం తాగునీటి సౌకర్యం, షేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులకు వీల్‌చైర్, ర్యాంపులు సమకూర్చారు. మహిళల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు.
అధికారంలోకి వస్తే యూసీసీ అమల్లోకి..
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేయడం ద్వారా ఒకే వ్యక్తి బహుళ వివాహాలు చేసుకునే పద్ధతిని నిషేధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మంగళవారం (ఏప్రిల్ 21) ఆయన పశ్చిమ బర్ధమాన్‌లోని పారిశ్రామిక కేంద్రాలైన అసన్‌సోల్, బరకర్‌ల శివార్లలోని కుల్టీలో జరిగిన ఒక ర్యాలీలో షా ప్రసంగించి ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. టీఎంసీపై దాడి..మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) బెంగాల్ పారిశ్రామిక అవకాశాలను నాశనం చేస్తోందని షా ఆరోపించారు. టీఎంసీ ప్రభుత్వం తన అవినీతి పద్ధతుల ద్వారా ఒకప్పుడు దేశంలో ఇనుప ఖనిజ ఉత్పత్తికి కేంద్రంగా ఉన్న కుల్టీని మోకరిల్లేలా చేసిందని పేర్కొన్నారు.ఉద్యోగాలు, శాంతిభద్రతలకు హామీ..అర్హులైన అభ్యర్థుల నుంచి ఉద్యోగాలు దొంగిలించి, అనర్హులకు అమ్ముకున్నారని" టీఎంసీ ప్రభుత్వంపై షా ధ్వజమెత్తారు. "తమను అధికారంలోకి తీసుకువస్తే బెంగాల్‌లో ఏటా లక్ష మంది యువతకు మెరిట్ ఆధారిత ఉపాధి కల్పిస్తామని బీజేపీ హామీ ఇస్తోంది" అని కేంద్ర మంత్రి అన్నారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే "చొరబాటు రహిత బెంగాల్" ఉంటుందని షా హామీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అప్పుడే పుట్టుకొస్తున్న సిండికేట్, మాఫియా, గూండా రాజ్‌లకు కూడా ముగింపు పలుకుతుందని ఆయన అన్నారు.
తమిళనాడులో..
రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు బహిరంగ ప్రచారం ముగిసింది. సీఎం స్టాలిన్ చెన్నైలోని తన కొలత్తూరు నియోజకవర్గంలో భారీ రోడ్ షోతో ప్రచారాన్ని ముగించారు. అటు ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి తన సొంత నియోజకవర్గమైన ఎడప్పాడిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం ముగించారు. హీరో విజయ్ తన నియోజకవర్గం పెరంబూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెన్నైలోని తెలుగు ఓటర్లే లక్ష్యంగా రంగంలోకి దిగారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ టినగర్, ఆవడి పరిసరాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రోడ్ షో నిర్వహించారు. గత నెల రోజులుగా రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. అధికార డీఎంకే, విపక్ష ఏఐఏడీఎంకే, బీజేపీ కూటములు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించాయి.
అత్యధికంగా స్టాలిన్..
తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ దాదాపు 120కి పైగా బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. అటు విపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి కూడా వెనక్కి తగ్గకుండా 100 ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తన ‘ఎన్‌మన్‌ఎన్ మక్కల్’ యాత్రతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. విజయ్ తన పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు.
ద్విచక్రవాహనాల రాకపోకలపై ఆంక్షలు..
పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి హింసకు తావులేకుండా స్వేచ్ఛగా, సజావుగా సాగేందుకు బైక్ ర్యాలీలపై నిషేధం, పిలియన్ రైడింగ్స్‌పై ఆంక్షలు అమల్లోకి తెచ్చింది.ఈ ఆంక్షలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈనెల 23న మొదటి విడత పోలింగ్ జరిగే 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసీ విధించిన ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈసీ ఆదేశాల ప్రకారం ఈ రోజు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకూ రోడ్లపై బైకులు, వాహనాలను అనుమతించరు. వైద్యం, కుటుంబ ఫంక్షన్ల వంటి ఎమర్జెనీ అవసరాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి బెదిరింపులు, అడ్డంకులకు వీల్లేకుండా బైక్ ర్యాలీలపై పూర్తిగా నిషేధం విధించినట్టు ఈసీ తెలిపింది.

