
పంజాబ్‌లో ఈడీ దాడులు: కేంద్రంపై భగవంత్ మాన్ తీవ్ర విమర్శలు
పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరాపై ఈడీ దాడులపై సీఎం భగవంత్ మాన్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ కేంద్రం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు.
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వానికి చెందిన కీలక మంత్రి సంజీవ్ అరోరాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ పరిణామంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని “హత్య” చేస్తున్నారని, కేవలం బీజేపీయేతర ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు.
లుధియానా, జలంధర్ ప్రాంతాల్లో మంత్రి సంజీవ్ అరోరాకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాలు, ఆయన కుమారుడు, అనుచరులతో సంబంధం ఉన్న ప్రదేశాలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. భద్రతా దృష్ట్యా కేంద్ర బలగాలను కూడా మోహరించారు.
ఈ దాడుల నేపథ్యంలో స్పందించిన అరోరా, ఒక బాధ్యతగల పౌరుడిగా తాను దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. “నా ప్రాంగణంలో ఈడీ చర్యలు చేపట్టింది. నేను పూర్తిగా సహకరిస్తాను. సత్యమే గెలుస్తుంది” అని ఆయన సోషల్ మీడియా వేదికలో పేర్కొన్నారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఇదే మంత్రి అరోరాపై 2024లో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. ఆయనకు సంబంధించిన కంపెనీలు, ఇతర సంస్థలు నివాస ప్రాజెక్టుల కోసం పారిశ్రామిక భూమిని దుర్వినియోగం చేశాయని, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగించాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
ఇటీవలే ఆప్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ నివాసాలు, విద్యాసంస్థలపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫెమా కింద సోదాలు నిర్వహించాయి. మిట్టల్ ఫగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ ఛాన్సలర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ సీఎం మాన్ మాట్లాడారు. “మిట్టల్ AAP నుంచి రాజ్యసభ ఎంపీ అయిన వెంటనే ఆయనపై మచ్చ వేసే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు సంజీవ్ అరోరాపై కూడా అదే జరుగుతోంది. ఆయన విద్యుత్, స్థానిక సంస్థలు, పరిశ్రమల శాఖలను చూసే కీలక మంత్రి. ఇప్పుడు ఆయనను కూడా లక్ష్యంగా చేసుకున్నారు” అని విమర్శించారు.
ఇంకా ఆయన తీవ్రంగా స్పందిస్తూ.. ఈ దాడులు 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు సన్నాహాలే అని ఆరోపించారు. “పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు బీజేపీకి సరైన అభ్యర్థులు లేరు. అందుకే ఈడీ, ఆదాయపు పన్ను నోటీసులు, బెదిరింపులు వంటి మార్గాలను ఉపయోగించి ప్రత్యర్థులను బలహీనపర్చాలని చూస్తోంది” అని అన్నారు.
అలాగే, “ఈడీని పంపి నాయకులను భయపెడితే, వారు పోటీ చేయకుండా ఉంటారని లేదా తమ ‘వాషింగ్ మెషీన్’లోకి వచ్చి బీజేపీలో చేరతారని భావిస్తున్నారు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
చివరగా, “ప్రజాస్వామ్య హత్య జరుగుతోంది. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీయేతర ప్రభుత్వాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు” అంటూ మాన్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ ఘటనతో పంజాబ్ రాజకీయాల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థల వినియోగంపై మళ్లీ జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది.

