x

వైసీపీ గడప గడప v/s ఇంటింటికీ టీడీపీ.. ఏపీలో మళ్లీ డోర్ టు డోర్ వార్

రెండేళ్లలో పథకాలన్నీ ఇచ్చినా టీడీపీ ప్రజల్లోకి ఎందుకు వెళుతోంది?


ముంచుకు వస్తున్న స్థానిక ఎన్నికలు

వైసీపీ బాటలోనే ఇంటింటికీ టీడీపీ

ప్రజల నాడి తెలుసుకునేందుకు ఆయుధమే: విశ్లేషకుల అంచనా

స్థానిక సమస్యలపై వీధి పోరాటాలకు దిగుతున్న వైసీపీ నుంచి అధికార టీడీపీకి సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటికి కౌంటర్ ఇస్తూనే, వైసీపీ తరహాలోనే "ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమం ప్రారంభించడంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావడంతో "ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో వైసీపీ "గడప గడపకు వైసీపీ" పేరుతో ప్రజల్లోకి వెళ్లిన రీతిలోనే, ఇప్పుడు టీడీపీ కూడా ప్రతి ఇంటికీ వెళ్తోంది. ఈ కార్యక్రమం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం ఏంటి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థలు ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ క్షేత్రస్థాయిలో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది. ఈ కార్యక్రమం వెనుక..
గడప గడపకు టీడీపీ వెనుక క్యాడర్‌ను యాక్టివేట్ చేయడం. గ్రౌండ్ లెవల్ ఫీడ్‌బ్యాక్ తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. దీని వల్ల ప్రజల నాడి తెలుసుకుని, భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది.
తద్వారా రాబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు వ్యూహ రచన చేయవచ్చు అనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో ప్రతిపక్షంలో, ఆ తరువాత అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వేసిన ఎత్తులు ఇలాగే సాగాయని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.

సూపర్-6 సక్సెస్ కదా..!?

టీడీపీ ప్రారంభించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించే నేపథ్యంలో ఇక్కడొక పెద్ద ప్రశ్న ఉదయిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 'సూపర్ 6' హామీలను పెద్ద ఎత్తున అమలు చేసింది. ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ల పెంపుతో పాటు, 'తల్లికి వందనం' ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ప్రతి ఒక్కరికీ రూ.13,000 చొప్పున జమ చేశారు. ఇంత భారీ సంక్షేమం అమలు చేసినా ప్రజల్లోకి ఎందుకు వెళ్లాల్సి వస్తోంది? అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ విషయాన్ని కాస్త పక్కకు ఉంచి, వెనక్కి తరిచి చూద్దాం..

2016లో వైసీపీ ఎంచుకున్న బాట ఏమిటి?

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మూడేళ్ల పాలన సాగించింది. నవరత్న పథకాలు అందించిన తీరుపై 2021 మే 11వ తేదీ నుంచి ఆ పార్టీ గడపగడపకూ వైసీపీ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. వైసీసీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జీలు గ్రామ సచివాలయ పరిధిలో రెండు రొజుల పాతు విస్తృతంగా నవరత్న పథకాల కరపత్రాలు పంపిణీ చేస్తూ, విస్తృతంగా పర్యటించారు. అంతకుముందు
2016లో విపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ ఇదే కార్యక్రమంతో జనంలోకి వెళ్లింది. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించింది. అందులో ప్రధానంగా నిరుద్యోగ భృతి ఇస్తానని మాట మార్చిన తీరుపై ఎండగట్టారు. అదే సమయంలో నవరత్న పథకాలపై జనంలోకి వెళ్లారు. ఇది గతం. జనంలోకి వెళ్లడం, వారికి నమ్మకం కలిగించడం అనేది మనం చెప్పే మాటలు, నాయకుడి విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. కానీ, నవరత్న పథకాలు, నగదు బదిలీ పథకాలకు పరిమితం కావడం, ప్రత్యర్థులపై రాజకీయ కక్ష్య సాధింపు చర్యలు, ఉద్యోగ వర్గాల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంస్థలను నిర్వీర్యం చేయడం ఏకపక్ష ధోరణితో జగన్ వ్యవహరించిన తీరు, ఆయన చుట్టూ చేరిన కోటరీ వైసీపీని దెబ్బతీయడం వల్లే 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోవడానికి దారితీసిన పరిస్థితి అనేది రాజకీయ విశ్లేషకులు వేసిన అంచనాలు.

ఇంటింటికీ టీడీపీ.. వెనుక ఆంతర్యం ఏమిటి?

అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు చేరువకావడానికి డోర్-టు-డోర్ ప్రచారం చేయడం ఒక శక్తివంతమైన సాధనం. అయితే, టీడీపీ కూటమి ఏర్పడిన రెండేళ్లకే ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండేళ్లలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చాం అని ధైర్యంగా చెబుతున్న టీడీపీ రెండేళ్లకే ఈ కార్యక్రమం వెనుక ఆంతర్యం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.
"ఇంటింటికీ టీడీపీ కేవలం ప్రచారం మాత్రమే కాదు. దీని వెనుక భవిష్యత్ కార్యాచరణ ఉంది. రాబోయే స్థానిక సంస్థలకు పార్టీ యంత్రాంగాన్ని, ప్రజలను సమాయత్తం చేయడమే" అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పకనే చెప్పారు.

ప్రజల నాడి తెలుసుకునే కార్యక్రమం

వైసీపీ హయాంలో గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కేడర్‌ను సమాయత్తం చేసేందుకు ‘గడప గడపకు’ ఉపయోగపడింది. ఇప్పుడు టీడీపీ కూడా క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్‌ను యాక్టివేట్ చేయడం, గ్రౌండ్ లెవల్ ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం ద్వారా రాబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తోంది అనే మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.
ప్రతిపక్ష వైసీపీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం.ప్రభుత్వ పథకాల సమాచారం: లబ్ధిదారులకు పథకాల ఫలాలు నేరుగా అందుతున్నాయా లేదా అనే గ్రౌండ్ రిపోర్ట్ సేకరించడం. ఆశల నెరవేర్పు, ప్రజల అంచనాలు, మిగిలిన సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం దిశగా అడుగులు వేయడం వంటి అంశాలపై అంచనా వేయడానికే ఈ కార్యక్రమం అనేది టీడీపీ వర్గాలు చెబుతున్న మాట.
"ఇంటింటా పంపిణీ చేసే పాంప్లెట్‌లో ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల సంపూర్ణ సమాచారం ఉంటుంది" అని నెల్లూరులో జరిగిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పాంప్లెట్ తయారీకి అనేక సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయని కూడా ఆయన చెప్పారు.
"ప్రతి లబ్ధిదారుడికి జరిగిన లబ్ధి, లెక్కలతో సహా అన్ని వివరాలు ఉన్నాయి" అని కూడా రాంనారాయణరెడ్డి స్పష్టం చేశారు. మనం ఏమి చేశామో ప్రజలకు ధైర్యంగా చెప్పే సత్తా కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈ 45 రోజుల కార్యక్రమంలో ప్రతి కార్యకర్త బాధ్యతగా ప్రతి ఇంటికి వెళ్లి, ప్రభుత్వ పనితీరును వివరిస్తూ ఆశీస్సులు పొందడమే దీని ప్రధాన ఉద్దేశం అని ఆనం రాంనారాయణరెడ్డి వెల్లడించారు.
మొత్తానికి, 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం అనేది కేవలం ఒక ప్రచార కార్యక్రమం మాత్రమే కాదు! ప్రతిపక్ష సవాళ్లను దాటుకుని, క్షేత్రస్థాయిలో కేడర్‌కు దిశానిర్దేశం చేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికలకు బాటలు పరిచేందుకు చంద్రబాబు వేసిన ఒక వ్యూహాత్మక అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ రూట్ మరోలా సాగుతోంది.స్థానిక సమస్యలు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్రాలు సాగిస్తోంది. మెగా డీఎస్సీ, రాయలసీమ ఎత్తిపోతల పథకం, నిరుద్యోగ భృతి అజెండాగా వైసీపీ సమరానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి.
Read More
Next Story