LIVE అర్థరాత్రి దాటినా ఆగని చర్చ.. చేయాల్సింది ఇంకా మిగిలే ఉందన్న స్పీకర్!
x
లోక్ సభలో ప్రసంగిస్తున్న నరేంద్ర మోదీ

అర్థరాత్రి దాటినా ఆగని చర్చ.. చేయాల్సింది ఇంకా మిగిలే ఉందన్న స్పీకర్!

దక్షిణాదికి అన్యాయమేనన్న నేతలు, అమిత్ షాపై ఒవైసీ నిప్పులు, రాష్ట్ర విభజనపై మంటలు, ఆవలింతలు, కళ్ల మూతలతో ఎంపీల ఆపసోపాలు..


పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు తొలిరోజే వాదోపవాదాలతో దద్దరిల్లుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియమ్), నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు-2026 సభ ముందుకు రావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును, డీలిమిటేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును హోం మంత్రి అమిత్ షా టేబుల్ చేశారు.
ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయన్నారు. తెలంగాణలో 17 నుంచి 26కు పెరుగుతాయని చెప్పారు. కర్ణాటకలో 28 నుంచి 42కు, తమిళనాడులో 39 నుంచి 59కి, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెరుగుతాయని చెప్పారు. దక్షిణాది జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారు.
రూల్ 66 సస్పెన్షన్: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను ఏకకాలంలో ఆమోదించేందుకు వీలుగా 'రూల్ 66'ను సస్పెండ్ చేయాలని న్యాయశాఖ మంత్రి ప్రతిపాదించారు.
సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఇది వివక్ష లేని నిర్ణయం అన్నారు. "ఈ నిర్ణయం ఎవరిపట్ల వివక్ష చూపదు లేదా ఎవరికీ అన్యాయం చేయదు. గత ప్రభుత్వాలు అందించిన దామాషా వాటా కూడా అలాగే కొనసాగుతుంది. దీని కోసం నేను 'హామీ' లేదా 'వాగ్దానం' అనే పదాన్ని లేదా దానికి సమానమైన తమిళ పదాన్ని వాడాలని మీరు కోరుకుంటే, నేను దానికి కూడా సిద్ధమే. ఎందుకంటే మన ఉద్దేశం స్వచ్ఛంగా ఉన్నప్పుడు, పదాలకు ప్రాముఖ్యత ఉండదు."

మహిళా సాధికారతపై:

"మేము మహిళలకు ఏదో ఉపకారం చేయడం లేదు. వారికి దక్కాల్సిన వాటాను మేము వారికి అందిస్తున్నాము. ఇది ఒక తపస్సు లాంటిది. గతంలో జరిగిన పొరపాట్ల నుండి మనల్ని మనం విముక్తం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము."

"మూడు దశాబ్దాల పాటు, ప్రజలు రకరకాల ఎత్తుగడలతో దీనిని అడ్డుకున్నారు. వారు ప్రసంగాల్లో మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇస్తారు, కానీ ఆ తర్వాత షరతులు విధిస్తారు. అలా మూడు దశాబ్దాల సమయం వృధా అయింది. ఇప్పుడు మేము అలా జరగనివ్వము. ఇది (మహిళా రిజర్వేషన్) వాస్తవం కావాల్సిందే."

"దీని వల్ల మోదీకి లాభం కలుగుతుందని కొందరు భావిస్తున్నారు. ఒకవేళ వారు దీనిని వ్యతిరేకిస్తే, సహజంగానే మోదీకి లాభం చేకూరుతుంది. దాని గురించి నేనేమీ చేయలేను. నేను దీనిని కీర్తి కోసం చేయడం లేదు. మీకు ఆ కీర్తి గురించి ఆందోళన ఉంటే, ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఒక ప్రకటన (Add) ఇచ్చి, అందులో అందరి (వివిధ రాజకీయ పార్టీల నాయకుల) ఫోటోలు వేసి, ధన్యవాదాలు చెప్పడానికి కూడా నేను సిద్ధమే. ఆ క్రెడిట్ కోసం నేను మీకు 'బ్లాంక్ చెక్' ఇస్తున్నాను. నాకు దీనిపై ఎలాంటి క్రెడిట్ అవసరం లేదు."

DMK ఎంపీలపై వ్యంగ్యాస్త్రం

తమ నిరసనలో భాగంగా నల్ల దుస్తులు ధరించి వచ్చిన DMK ఎంపీలపై మోదీ చమత్కరిస్తూ ఇలా ముగించారు. "మనం ఏదైనా మంచి పని చేయబోయేటప్పుడు, అది నిర్విఘ్నంగా సాగాలని మన సంప్రదాయం ప్రకారం 'కాటుక చుక్క' (నల్లని తిలకం) పెడతాం. మీరు నల్ల దుస్తుల్లో వచ్చి మాకు ఆ దిష్టి చుక్కను పెట్టారు, అందుకు మీకు ధన్యవాదాలు."


కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం..
అంతకుముందు ఈ బిల్లుల ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. గతంలో ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజపేయి వంటి నేతలు జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలకు (ముఖ్యంగా దక్షిణాదికి) రక్షణగా నియోజకవర్గాల పెంపుపై విధించిన మారటోరియంను మోదీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు గళమెత్తాయి.
ముస్లిం రిజర్వేషన్లపై రిజిజు అభ్యంతరం:
చర్చ సందర్భంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌పై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు. భారత రాజ్యాంగం ప్రకారం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని, అది రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
దేశ రాజధానిలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల సంఖ్య పెంపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ పరిణామాలపై అటు విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, ఇటు ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపిస్తోంది.
సభ ముందుకు వచ్చిన 3 కీలక బిల్లులు:
నేడు కేంద్ర మంత్రులు లోక్‌సభలో ఈ క్రింది బిల్లులను ప్రతిపాదించారు.
131వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026: మహిళా రిజర్వేషన్ల (నారీ శక్తి వందన్ అధినియమ్) అమలుకు మార్గం సుగమం చేసేందుకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దీనిని ప్రవేశపెట్టారు.
నియోజకవర్గాల డీలిమిటేషన్ బిల్లు-2026: లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును కూడా మేఘ్వాల్ ప్రతిపాదించారు.
కేంద్ర పాలిత ప్రాంతాల పునర్విభజన బిల్లు-2026: దీనిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు.
సీట్ల పెంపు: లోక్‌సభ స్థానాలను ప్రస్తుత 543 నుంచి 850కి పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రతి రాష్ట్రంలో 50% మేర సీట్లు పెరుగుతాయని, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.
నల్లచొక్కాలతో సభకు వచ్చిన డీఎంకే సభ్యులు
ఈ మూడు బిల్లులను డీఎంకే సభ్యులు తిరస్కరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాల మేరకు డీఎంకే సభ్యులు నల్లచొక్కాలు ధరించి వచ్చారు. ఈ బిల్లులను నిరసించారు.

Live Updates

  • 16 April 2026 11:53 AM IST

    బిల్లుల ప్రవేశంపై ఓటింగ్ జరుగుతోంది..

    విపక్ష పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించడంతో సభలో ప్రవేశపెట్టాలా వద్దా అనే అంశంపై ఓటింగ్ జరుగుతోంది. ఆటోమ్యాటిక్ సిస్టమ్ ద్వారా ఓటింగ్ జరుగుతోంది.

Read More
Next Story