
రెక్కలు తెగిన టీడీపీ, వైసీపీ నేతల ఊహలు...
డీలిమిటేషన్ బిల్లు: జై కొట్టిన నేతల ముఖచిత్రం ఏమిటి?
రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం వల్ల ఎవరికి నష్టం? ముగ్గురు దిగ్గజాల ఏకపక్ష నిర్ణయంపై ఆసక్తికర చర్చకు తెర తీసింది.
మహిళా రిజర్వేషన్ మాటున డీలిమిటేషన్, కేంద్ర పాలిత రాష్ట్రాలు, జన గణన వంటి మూడు బిల్లులతో అయిదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దెబ్బతీయాలని ఎత్తు వేశారు. ప్రధాని మోదీకి మద్దతు ఇచ్చిన టీడీపీ కూటమి, వైసీపీ నేతలు భంగ పడ్డారు. ఏపీలో ఎవరికి వారు బలం పెంచుకోవాలనే ఆశల రెక్కలు తెగాయి.
రాజ్యంగా సవరణతో మహిళా రిజర్వేషన్ పేరుతో డీలిమిటేషన్ కు ముడిపెట్టిన ఎన్ఢీఏ ప్రభుత్వం భంగపడింది. దీనికి దక్షిణాది రాష్ట్రాలతో విభేదించి, ఏపీ కీలక నేతలు కేంద్రానికి జై కొట్టి, ఏకాకి అయినా, ఐక్యతను చాటుకున్నారు. మహిళల సానుభూతి దక్కుతుందా? అనేది చర్చకు దారితీసింది. ఎవరి రాజకీయ లెక్కలు, ప్రయోజనాలు వారికి ఉన్నా, ఆ బిల్లు వీగిపోవడం వల్ల ఎవరికి నష్టం. క్యాడర్ కు ఎలాంటి సందేశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ పరిణామాలపై పీసీపీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలా రెడ్డి స్పందించారు.
"మహిళా రిజర్వేషన్ పేరిట బీజేపీ మాయోపాయం పారలేదు" అని షర్మిలా రెడ్డి వ్యాఖ్యానించారు. అక్రమ చట్టాలకు అవనిని అడ్డుపెట్టి ఆమోదించాలనే కుతంత్రం నిలబడ లేదనీ, సాధికారిత పేరుతో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయాలనే బీజేపీ కుయుక్తులు చెల్లలేదని కూడా షర్మిల అన్నారు.
"ఎన్డీఏ అధర్మంపై INDIA కూటమి ధర్మయుద్ధం గెలిచింది. ప్రజాస్వామ్యం నిలబడింది. ఇది భారత దేశ ప్రజల విజయం. " అని అభివర్ణించారు.
అందరిదీ ఓ దారి...
తమిళనాడు, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాబల్యం తగ్గుతుందని భయపడుతుంటే, ఏపీ నేతలు మాత్రం భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు. దక్షిణాది రాష్ట్రాల సీఎంలు కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నా, ఈ బిల్లుకు ఏకపక్షంగా మద్దతు పలికిన ఎన్డీఏలోని కీలక భాగస్వామ్య పార్టీల్లో టీడీపీ ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, భవిష్యత్తుపై ఆశతో మద్దుతు తెలిపిన వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్. జగన్ క్యాడర్ కు సమాధానం చెప్పుకోలేని స్థితిలో పడిపోయారు.
"చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచాలనే మా అంచనాలకు ప్రతిపక్షాలు అడ్డంకిగా మారాయి" అనే మాటలు విశ్వసిస్తారా? అనేది కూడా చర్చకు ఆస్కారం కల్పించింది.
పార్లమెంటులో శుక్రవారం రాత్రి ఓటింగ్ ప్రారంభానికి ముందే ఏపీ మహిళా సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు ఖమర్ బేగం మాట్లాడుతూ,
"ఈ బిల్లుకు ఆమోదం దక్కడం కష్టం. జరగనివ్వరు" అని వ్యాఖ్యానించారు. దశాబ్దాల కాలంగా సాగుతున్న తీరు రిపీట్ అవుతుందని ఆమె వ్యక్తం చేసిన సందేహం నిజమైంది.
"కుల గణన పూర్తి చేయకుండా, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించడానికి సాధ్యం కాదు" అనే మాటలను కూడా ఖమర్ బేగం అభ్యంతరం వ్యక్తం చేశారు.
"జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరిగితే, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది" అని డీఎంకే, కేరళ, తెలంగాణా రాష్ట్రాల సీఎంలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవేమి పట్టని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఏకపక్షంగా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
ఇక్కడ ప్రతిపక్షం లేదు..
దక్షిణాదిలో మిగతా పార్టీల పరిస్థితి వేరు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఏపీ నేతలు మద్దతు తెలపడం వెనుక భవిష్యత్తు రాజకీయ పరిస్థితిని ఊహించుకున్నట్లు కనిపించింది. దీనికోసం అధికార టీడీపీ కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. డీలిమిటేషన్ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ ఒకే తాటిపైకి రావడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయనేది రాజకీయ పరిశీలకుల అంచనా.
రెక్కలు తెగిన ఊహలు..
రాజ్యంగ సవరణ బిల్లుపై మూడు రోజుల పార్లమెంటు సమావేశాల్లో శుక్రవారం కీలకంగా నిలిచింది. రెండో రోజుల్లో దాదాపు 19 గంటల పాటు సాగిన చర్చ తరువాత ఓటింగ్ జరిగింది.
రాజ్యాంగ సవరణ బిల్లుపై 489 మంది ఎంపీలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ లో పొల్గొన్నారు. 278 మంది అనుకూలంగా, 214 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఓటింగ్‌కు కావాల్సిన సభ్యుల సంఖ్యా బలం 326 కాగా, బిల్లుకు లభించని 2/3 సభ్యుల మెజారిటీ లభించని స్థితిలో వీగిపోయింది.దీనివల్ల ఎన్డీఏ తోపాటు ప్రధానంగా దక్షిణాదిలో ఏపీ నుంచి ఏకపక్షంగా మద్దతు పలికిన కూటిమితో టీడీపీ, జనసేన, బీజేపీ తోపాటు వైసీపీ నేతలు భంగపడ్డారు.
"ఈ బిల్లుకు ఆమోదం దొరికితే, ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225 వరకు పెరుగుతాయి. తద్వారా ఔత్సాహిలకు అవకాశాలు కల్పించవచ్చు" అని టీడీపీ కూటిమి నేతలతో సహా, వైసీపీ కూడా భవిష్యత్తును ఊహించింది. తద్వారా నియోజకవర్గాలు పెరిగితే ఆశావహుల సంఖ్యకు అనుగుణంగా సీట్లు సర్దుబాటు చేయడం సులభమవుతుందని అధికార కూటమి (TDP-JSP-BJP) భవిష్యత్తును ఊహించుకుంది. వైసీపీ కూడా భవిష్యత్తులో తమ బలం పెంచుకోవడానికి ఇది అవకాశమని భావించింది.
మహిళలు నమ్ముతారా?
రాష్ట్రంలో మహిళల ఆర్థిక సమృద్ది సాధించడానికి ఎన్నో పథకాలతో టీడీపీ అండగా నిలిచిన విషయాన్ని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వివరిస్తున్నారు. అదే విధంగానే చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత పెంచడానికి ఎన్డీఏ కూటమి మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకు రావాలని ప్రయత్నిస్తే,
"ప్రతిపక్షాలు ఏకపక్షంగా అడ్డుపడి, మహిళా శక్తిని అడ్డుకుంది" అని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కూటమి నేతల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ క్యాడర్ కు చెప్పినా, సాధారణ మహిళలు, ఔత్సాహిక నేతలు విశ్వసిస్తారా? అనేది కూడా ప్రధాన అంశంగా మారింది.
"రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాగుదాం. బిల్లు వీగినా, విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన 225 అసెంబ్లీ స్థానాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తాం. నామినేటెడ్ పోస్టులతో బుజ్జగించడం" వల్ల క్యాడర్ స్థైర్యం పెరుగుతుందా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
"డీలిమిటేషన్ బిల్లు నిలిచిపోతే మహిళా కోటా బిల్లు నిలిచిపోతుందా?" అనే చర్చ నడుస్తున్న తరుణంలో, మహిళల హక్కుల కోసం తాము నిలబడ్డామని పవన్ గట్టిగా వినిపించడానికి యత్నిస్తారని ఆ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
ఏది జరిగినా మేలే...
పార్లమెంటులో బిల్లు ఆమోదం లభించి ఉంటే వైసీపీ తీరు ఓ రకంగా ఉండేది. దేశ ప్రయోజనాలు, మహిళల కోసం అండగా నిలవడానికి మడం తిప్పలేదు అని చెప్పకునే వారు. ప్రస్తుతం బిల్లు వీగిపోయింది. వైసీపీ దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
"కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉండి కూడా, సాధించలేకపోయింది" అని అధికార పక్షంపై దాడికి దిగే అవకాశం లేకపోలేదు.
Next Story

