
డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ తుపాన్: దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు?
543 నుంచి 850 సీట్లు; కేంద్ర నిర్ణయంపై ప్రతిపక్షాల ఘాటు విమర్శలు
లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 850కి పెంచే రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ డీలిమిటేషన్ చర్య, దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించి ఉత్తర రాష్ట్రాలకు లాభం చేకూరుస్తుందనే ఆరోపణలతో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఈ బిల్లును ఎదుర్కొనే వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ప్రతిపక్ష భారత కూటమి నాయకులు సమావేశమయ్యారు. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
నాయకుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి..
ఎంకే స్టాలిన్:
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “దక్షిణ రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విజయవంతమయ్యాయి. ఇప్పుడు అదే కారణంగా వారికి శిక్ష విధిస్తున్నారా?” అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యం, రాష్ట్రాల హక్కులపై దాడి అని వ్యాఖ్యానించారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి:
లోక్‌సభ సీట్ల పెంపు దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా రిజర్వేషన్‌ను ప్రస్తుత 543 సీట్లతోనే అమలు చేయవచ్చని, సీట్ల పెంపుతో దాన్ని ముడిపెట్టడం అవసరం లేదని చెప్పారు. దక్షిణ రాష్ట్రాల వాణి తగ్గిపోతుందని హెచ్చరించారు.
సిద్దరామయ్య:
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ వేర్వేరు అంశాలని కర్ణాటక సీఎం సిద్ధరామ య్య స్పష్టం చేశారు. “ప్రాతినిధ్యాన్ని మార్చే అశాస్త్రీయ, ఏకపక్ష విధానంతో దీనిని కలపడం ఆందోళన కలిగిస్తుంది” అని వ్యాఖ్యానించారు.
మమతా బెనర్జీ:
ఈ బిల్లు దేశాన్ని విభజించే కుట్రగా అభివర్ణించారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కేంద్రం పూర్తి మెజారిటీ లేకపోయినా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమని అన్నారు.
జైరాం రమేష్:
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ప్రధాని ఇచ్చిన హామీలు అన్నీ విరుద్ధంగా ఉన్నాయి. దక్షిణ రాష్ట్రాలు తమ బలాన్ని కోల్పోతాయి” అని అన్నారు.
కేసీ వేణుగోపాల్:
ఈ బిల్లును రాజ్యాంగ విరుద్ధం, సమాఖ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. మహిళా రిజర్వేషన్ పేరుతో ఈ ప్రక్రియను బలవంతంగా అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
భగవంత్ మాన్:
గెలవలేని రాష్ట్రాల్లో సీట్లు తగ్గించి, గెలిచే రాష్ట్రాల్లో పెంచే రాజకీయ ఎత్తుగడ అని పంజాజ్ సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు.
అఖిలేష్ యాదవ్:
మహిళా రిజర్వేషన్‌కు మద్దతు ఇస్తామని చెప్పినా, బీజేపీ రహస్య అజెండాతో దీన్ని ముందుకు తీసుకువస్తోందని ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేస్ యాదవ్ విమర్శించారు. ముఖ్యంగా ఓబీసీ మహిళలకు న్యాయం చేయడం లేదని అన్నారు.
జాన్ బ్రిట్టాస్:
ఈ బిల్లు దక్షిణ రాష్ట్రాలను మరింత వెనుకకు నెట్టేస్తుందని, దేశ సమాఖ్య వ్యవస్థకు ముప్పు అని సీపీఐ (ఎం) కేరళ ఎంపీ జాన్ బ్రిట్టాస్ పేర్కొన్నారు.
శశి థరూర్:
“డిగ్రెసివ్ ప్రపోర్షనాలిటీ” విధానాన్ని ప్రతిపాదిస్తూ, చిన్న రాష్ట్రాలకు న్యాయం చేసే విధంగా ప్రాతినిధ్యం ఉండాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలు దేశానికి హానికరమని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు.
సోనియా గాంధీ:
మహిళా రిజర్వేషన్ అసలు సమస్య కాదని, డీలిమిటేషన్ అసలు అంశమని స్పష్టం చేశారు. “ఈ తొందరపాటు వెనుక రాజకీయ లాభం మాత్రమే ఉంది” అని ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ విమర్శించారు.
మొత్తంగా, డీలిమిటేషన్ బిల్లు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే భయం, సమాఖ్య వ్యవస్థపై ప్రభావం, రాజకీయ ప్రయోజనాల ఆరోపణలు ఈ వివాదాన్ని మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయి. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై హోరాహోరీ చర్చలు జరిగే అవకాశం ఉంది.

