
ఈ ఇద్దరు తమిళ ఎమ్మెల్యేల ఆస్తులెంతో తెలిస్తే మతి పోవాల్సిందే!
5 ఏళ్లలో ఎమ్మెల్యేల సగటు సంపద 4 రెట్లు పెరిగింది.. ఈసారి గెలిచిన 233 మంది ఎమ్మెల్యేల మొత్తం సంపద విలువ ₹11,265 కోట్లు.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. వెండితెరపై తన నటనతో కోట్లాది మందిని అలరించిన 'దళపతి' విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాజకీయ రణరంగంలో తన ముద్ర వేస్తున్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తాజాగా విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం, తమిళనాడు కొత్త శాసనసభలోని ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వేళ, ఎన్నికల అఫిడవిట్ల ద్వారా ఆయన ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 233 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించిన ADR (Association for Democratic Reforms) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
కుబేరుల జాబితాలో సీఎం విజయ్...
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ రాష్ట్రంలోనే రెండో అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు.
మొత్తం ఆస్తులు: ₹648 కోట్లు.
చరాస్తులు: ₹426.20 కోట్లు.
స్థిరాస్తులు: ₹222.65 కోట్లు.
వార్షిక ఆదాయం: గత ఆర్థిక సంవత్సరంలో ఆయన ₹184 కోట్ల ఆదాయాన్ని ప్రకటించారు. ఆదాయం పరంగా చూస్తే, కొత్త ఎమ్మెల్యేలందరిలోనూ ఆయనే ప్రథమ స్థానంలో ఉన్నారు.
రాష్ట్రంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యే ఎవరు?
ముఖ్యమంత్రి విజయ్ కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన వ్యక్తిగా AIADMK ఎమ్మెల్యే లీమారోస్ మార్టిన్ నిలిచారు. లాల్గుడి నియోజకవర్గం నుండి గెలుపొందిన ఈమె సుమారు ₹5,863 కోట్ల ఆస్తులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
పార్టీల వారీగా సగటు ఆస్తుల వివరాలు...
తమిళనాడు ఎన్నికల వాచ్ నివేదిక ప్రకారం, ప్రధాన పార్టీల ఎమ్మెల్యేల సగటు ఆస్తులు ఈ విధంగా ఉన్నాయి.
AIADMKలో 47 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తులు ₹152.89 కోట్లు
TVK (విజయ్ పార్టీ)లో 107 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తులు ₹27.09 కోట్లు
Congressకి చెందిన 5 ఎమ్మెల్యేల సగటు ఆస్తులు ₹17.81 కోట్లు
DMKకి చెందిన 59 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తులు ₹14.34 కోట్లు
నాలుగు రెట్లు పెరిగిన ఎమ్మెల్యేల సంపద
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి గెలిచిన ఎమ్మెల్యేల సగటు సంపద భారీగా పెరిగింది.
2021లో: ఎమ్మెల్యేల సగటు ఆస్తి ₹12.27 కోట్లు.
2026లో: సగటు ఆస్తి ₹48.35 కోట్లు అయింది.
అంటే గత ఐదేళ్లలో ఎమ్మెల్యేల సగటు సంపద దాదాపు నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. ఈసారి గెలిచిన 233 మంది ఎమ్మెల్యేల మొత్తం సంపద విలువ ₹11,265 కోట్లు.
"నేనే ఏకైక పవర్ సెంటర్ "- సీఎం విజయ్
అనేక రాజకీయ మలుపుల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, తన తొలి ప్రసంగంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. "రాష్ట్రంలో నాకంటే మరో పవర్ సెంటర్ ఉండదు.. నేనే ఏకైక పవర్ సెంటర్ గా ఉంటాను" అని ప్రకటించడం ద్వారా పాలనలో తనదైన పట్టు ఉంటుందని సంకేతాలిచ్చారు.
మరోవైపు, విజయ్ క్యాబినెట్‌లో అతిపిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా S. కీర్తన నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. స్టాలిన్ వర్సెస్ విజయ్ మధ్య సాగుతున్న "₹10 లక్షల కోట్ల అప్పుల" వివాదం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచుతోంది.
ఎవరీ లీమారోస్ మార్టిన్...
లీమారోస్ మార్టిన్ (Leema Rose Martin) తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు, వ్యాపారవేత్త. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆమె పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోతోంది.
ఆమె AIADMK పార్టీ తరపున తిరుచిరాపల్లి జిల్లాలోని లాల్గుడి (Lalgudi) నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. ఈమె తన సమీప ప్రత్యర్థి, TVK అభ్యర్థి కేపీ కృష్ణన్‌పై 2,739 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2026 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, ఈమె తమిళనాడులోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక ప్రకారం, ఆమె కుటుంబ మొత్తం ఆస్తుల విలువ సుమారు ₹5,863 కోట్లు.
కుటుంబ నేపథ్యం...
ఈమె భారతదేశపు "లాటరీ కింగ్"గా పిలవబడే శాంటియాగో మార్టిన్ (Santiago Martin) భార్య. వీరి స్వస్థలం కోయంబత్తూర్. రాజకీయాల్లోకి రాకముందు ఆమె 'మార్టిన్ ఫౌండేషన్' ద్వారా విద్యా, ఆరోగ్య రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. హోమియోపతి మెడికల్ కాలేజీకి కరస్పాండెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, ముఖ్యమంత్రి విజయ్ స్థాపించిన TVK పార్టీలో కీలక నేతగా ఉన్న ఆధవ్ అర్జున (Aadhav Arjuna) ఈమెకు అల్లుడు అవుతారు.
తమిళనాడు శాసనసభలో ఆస్తుల పరంగా ముఖ్యమంత్రి విజయ్ కంటే (₹648 కోట్లు) లీమారోస్ మార్టిన్ సంపద దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
Next Story

