
కూటమిలో ’క్రెడిట్‘ వివాదం..పవన్ కూటమి ధర్మం తప్పారా?
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహం?
కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంబరాల వేళ పవన్ కల్యాణ్ పదే పదే తన త్యాగాన్ని, జనసేన వల్లే కూటమికి విజయం దక్కిందనే భావనను ప్రస్తావించడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందనేది స్పష్టమౌతోంది. కేవలం వైఎస్ జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా, ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతోనే 21 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన సీట్ల సర్దుబాటును త్యాగం అనే పెద్ద పదంతో అభివర్ణించడంపై విమర్శలు వస్తున్నప్పటికీ.. పవన్ ఈ మైండ్ గేమ్‌ను వాంటెడ్‌గానే నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో తక్కువ సీట్లకు ఒప్పుకోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ, ప్రభుత్వంలో తమకు ఆశించిన ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న జనసేన క్యాడర్‌లో ఈ వ్యాఖ్యలు ఒక కొత్త ఉత్సాహాన్ని, మనం తగ్గడం వల్లే ఈరోజు కూటమి అధికారంలో ఉంది అనే అప్పర్ హ్యాండ్ ఫీలింగ్‌ను కలిగిస్తున్నాయి. అదే సమయంలో, క్షేత్రస్థాయిలో తనకు బలం ఉన్నా రాష్ట్ర శ్రేయస్సు కోసం తగ్గానని పదే పదే చెప్పడం ద్వారా.. తమను తక్కువ అంచనా వేయవద్దని సీఎం చంద్రబాబు నాయుడికి, టీడీపీ పెద్దలకు ఆయన పరోక్షంగా ఒక గట్టి పొలిటికల్ సిగ్నల్ ఇస్తున్నట్లు భావించవచ్చు.

