అంతర్జాతీయ చమురు సంక్షోభం సెగ తగులుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొదుపు మంత్రాన్ని గట్టిగానే పఠిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు స్పందిస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని యంత్రాంగం తమ అధికారిక విలాసాలను, భద్రతా హంగులను తగ్గించుకునే పనిలో పడింది. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం తమ కాన్వాయ్‌లలోని వాహనాలను 50 శాతం కుదించుకుని క్షేత్రస్థాయిలో పొదుపు సంకేతాలు పంపినప్పటికీ, ఈ చర్యలు కేవలం రోడ్లకే పరిమితమా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంధన ఆదా కోసం భద్రతా వాహనాల శ్రేణిని తగ్గించిన ప్రభుత్వం, అత్యంత ఖరీదైన విమాన ప్రయాణాలు, హెలికాప్టర్ల వినియోగం విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రగతి చక్రాల వేగాన్ని తగ్గించకుండా, గగన విహారాల ఖర్చును నియంత్రించగలరా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
సగానికి సగం కాన్వాయ్ కోత
రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఇంధన ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన అధికారిక కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తక్షణమే 50 శాతం తగ్గించాలని డీజీపీ ఇంటెలిజెన్స్ అధికారులను ఆదేశించారు. సీఎం బాటలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కూడా తమ భద్రతా వాహనాల శ్రేణిని సగానికి కుదించుకుని పొదుపు దిశగా తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు.
మంత్రుల ఉత్సాహం.. ఎస్కార్ట్ లేకుండానే పర్యటనలు
ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కేబినెట్‌లోని ఇతర మంత్రులపై కూడా గట్టి ప్రభావం చూపింది. సీఎం, డిప్యూటీ సీఎంల నిర్ణయంతో స్ఫూర్తి పొందిన పలువురు మంత్రులు తమ కాన్వాయ్‌లను స్వచ్ఛందంగా తగ్గించుకుంటున్నారు. కొందరు మంత్రులైతే ఏకంగా ఎస్కార్ట్ వాహనాలు లేకుండానే, కేవలం ఒకటి లేదా రెండు వాహనాలతో అధికారిక కార్యక్రమాలకు హాజరవుతూ కొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఇది ప్రభుత్వ నిర్వహణ ఖర్చులను తగ్గించడమే కాకుండా, ప్రజల్లోనూ సానుకూల సంకేతాలను పంపింది.
రోడ్డుపై పొదుపు సరే.. గగన విహారాల సంగతేంటి?
అయితే, ఈ పొదుపు చర్యలపై ఒక ఆసక్తికరమైన విశ్లేషణ కూడా మొదలైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ 50 శాతం కోత నిర్ణయం కేవలం రోడ్డు రవాణా వాహనాలకు మాత్రమే పరిమితమైంది. అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో విమాన ఇంధనం (ATF) ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కానీ, ఇతర ప్రముఖులు కానీ తమ విమాన ప్రయాణాలను లేదా హెలికాప్టర్ల వినియోగాన్ని కుదించుకున్నట్లు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.