
ఢిల్లీకి చేరిన కూటమి పంచాయితీ?
బాబు, పవన్‌ల ముందస్తు పర్యటన వెనుక అసలు వ్యూహం ఇదే!
జాతీయ రాజకీయాల్లో శరవేగంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భేటీకి ప్రతివ్యూహంగా బీజేపీ తన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అయితే, జూన్ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగబోయే ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల అధికారిక సమావేశానికంటే ఒక రోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పయనం కావడం వెనుక కేవలం జాతీయ రాజకీయాలే కాకుండా, రాష్ట్ర స్థాయి అంతర్గత లొసుగులు కూడా ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అధికారిక భేటీకి ముందే వీరిద్దరూ బీజేపీ అగ్రనేతలను విడివిడిగా కలవనుండటం, ఏపీ కూటమి ప్రభుత్వంలో అంతర్గతంగా నడుస్తున్న సరికొత్త పొలిటికల్ సస్పెన్స్‌కు అద్దం పడుతోంది.
https://www.youtube.com/watch?v=7GOzni0gM80
ఈ ముందస్తు పర్యటనకు ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో మూడు పార్టీల (టీడీపీ, జనసేన, బీజేపీ) ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య పెరుగుతున్న అసంతృప్తి, సమన్వయ లోపమేనని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఇటీవల ఏపీ బీజేపీ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై, సొంత కేడర్‌కు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేశారనే ఊహాగానాలు కూటమిలో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో, ఢిల్లీ పెద్దలు చంద్రబాబు, పవన్‌లకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, క్షేత్రస్థాయి అసమ్మతిని చల్లార్చేందుకు ఎలాంటి రూట్ మ్యాప్ ఇవ్వనున్నారు అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ వేదికగా జరగబోయే ఈ సంప్రదింపులు ఏపీలో కూటమి భవిష్యత్తును, మూడు పార్టీల బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి కీలక మైలురాయిగా మారనున్నాయి.
Next Story

