టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంగ్ గా నారా లోకేష్
పొలిట్ బ్యూరో సంఖ్య పెంపు
క్లస్టర్ నేతలకు చోటు
క్యాడర్ కు స్పష్టమైన సంకేతమే..
ఇదీ విశ్లేషకుల అభిప్రాయం
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికారం చేతిలో ఉందని విశ్రాంతి కాకుండా, టీడీపీ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పునాదులు వేసింది. పార్టీ పునర్వ్యవస్ధీకరణలో టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మార్కు రాజకీయ చాతుర్యం ప్రదర్శించారు. బుధవారం ప్రకటించిన టీడీపీ కమిటీలు కేవలం పదవుల పంపకం మాత్రమే కాదు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే, క్షేత్రస్థాయిలో కేడర్‌ను ఎన్నికల యంత్రంలా సిద్ధం చేసే 'ముందస్తు మాస్టర్ ప్లాన్'గా కనిపిస్తోంది. పార్టీలో సోషల్ ఇంజినీరింగ్ ( Social Engineering) ప్రస్ఫుటంగా కనిపిస్తోందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అటు పాలన, ఇటు పార్టీని సమన్వయం చేస్తూ 2029 లక్ష్యంగా బాబు వేసిన ఈ ఎత్తుగడ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ, 33 శాతం మహిళా రిజర్వేషన్లు" ప్రధాన అంశాలుగా టీడీపీ కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు పెద్ద పీట వేశారు.
యువ నాయకత్వానికి ప్రాధాన్యం..
మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జమిలీ ఎన్నికల వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసే రీతిలో టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించిన కమిటీల్లో సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాదు. గతంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య క్లస్టర్ స్థాయి నేతకు పార్టీలో అత్యున్నత పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
"పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ పొలిట్ బ్యూరోలో గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్ కి స్థానం" కల్పించడం ద్వారా విధేయత, పనిచేసే వారికి ప్రాధాన్యత ఇస్తారనే విషయాన్ని సార్థకం చేశారని పార్టీ నేతలు అంటున్నారు.
సరైన సమయంలో
టీడీపీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేష్ కు బాధ్యతలు అప్పగించడం వెనుక కూడా చంద్రబాబు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారనే వ్యాఖ్యాలు టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత..
2025 జనవరి 18న కడప జిల్లా మైదుకూరులో జరిగిన సభలో "నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయండి" అని పార్టీ నేత ఆర్. శ్రీనివాసులురెడ్డి కోరడం చర్చకు తెరతీసింది. ఆ తరవాత ఈ డిమాండ్ రాష్ట్రంలోని టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాత్రం ఎక్కడ తొణకలేదు.
నాయకత్వంపై క్యాడర్ కు స్పష్టత..
టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్ కు పార్టీలో పదోన్నతి కల్పించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టడం ద్వారా లోకేష్ క్యాడర్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో నారా లోకేష్ జట్టును సిద్ధం చేయడంలో కూడా ప్రాధాన్యత ఇచ్చారనడానికి యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. వారికి దిక్సూచిగా నిలవడానికి అనుభవజ్ఞులైన నేతలను పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల్లో నియమించారు. తద్వారా వారంతా యువ నాయకత్వానికి మార్గదర్శకులుగా భావించాలని చెప్పకనే చెప్పడం ద్వారా సమతుల్యతను పాటించడంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మఖ్యమంత్రి నారా చంద్రబాబు
ఆపరేషన్ 2029
రాష్ట్రంలో అనేక సమస్యలపై వైసీపీ నుంచి నిరసనల సవాళ్లు ఎదురవుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరి పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. అనేక సభల్లో ఆయన మాటలే ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను మళ్లీ అదే పదవిలో కానసాగిస్తూ, టీడీపీలో యువకులు, సీనియర్లతో కూడిన కమిటీలకు మరింత జవసత్వాలు నింపడం ద్వారా 2029 ఎన్నికలకు ఆపరేషన్ ప్రారంభించినట్లు కనిపిస్తోంది. విపక్షాలు కోలుకోకముందే పార్టీని సెట్ చేయడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా ఎదగడమే బాబు అసలు వ్యూహంగా కనిపిస్తోంది.
"సీనియర్లకు గౌరవం. కొత్తవారికి అవకాశాలు. సామాజిక కోణం కోణంలో నూతన కమిటీల కూర్పు" జరిగిందని పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పదోన్నతి పొందిన కడప జిల్లా పులివెందులకు చెందిన ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పార్టీ పదవులతో ప్రాధాన్యం
కూటమిలో జనసేన, బీజేపీ నేతలకు కూడా పదవులు ఇవ్వాల్సి రావడం వల్ల టీడీపీలో చాలా మంది నేతలకు నామినేటెడ్ పదవులు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో వారికి పార్టీలో కీలక పదవులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
"విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి పదవులు ఇచ్చినట్లే ఉంది" అని పార్టీ శ్రేణులు కూడా అభిప్రాయపడ్డాయి.
పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు
టీడీపీ ఆవిర్భావం తరువాత పొలిట్ బ్యూరోలో సీనియర్లకు ప్రాధాన్యత ఉండేది. సంఖ్య కూడా 25 మంది మాత్రమే ఉండేవారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బుధవారం ప్రకటించిన జాబితాలో క్షేత్ర స్థాయి నేతలకు కూడా పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడంతో పాటు ఆ సంఖ్య 29 మందికి పెంచడం వెనుక కూడా క్లస్టర్ స్థాయి నేతలకు కూడా సముచితం కల్పించారనే సంకేతం అందించారు. తాజాగా ప్రకటించిన రాష్ట్ర కమిటీలోని 185 మందిలో 50 మందికి స్థానం ఇచ్చారు.
పొలిట్ బ్యూరో 29
జాతీయ కమిటీ 31
రాష్ట్ర కమిటీ 185
రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు-7, రాష్ట్ర ఉపాధ్యక్షులు-16, రాష్ట్ర అధికార ప్రతినిధులు-14, రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్ల-10, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు-59, రాష్ట్ర కార్యదర్శులు-77.
జనాభా దామాషా పద్దతిన, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పు.
185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది బడుగులకు స్థానం కల్పించిన టీడీపీ అధిష్టానం
బీసీ-77, ఎస్సీ-25, ఎస్టీ-7, మైనార్టీ-13 మందికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించిన చంద్రబాబు.
బీసీలకు 40 శాతం, ఎస్సీలకు 25 శాతం, ఎస్టీలకు 3.8 శాతం, మైనార్టీలకు 7 శాంత చొప్పున కమిటీలో స్థానం
"పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు దూరదృష్టితో ఉంటాయి. మైనారిటి వర్గానికి చెందిన నాకు మూడు కమిటీల నుంచి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పదవిలో సముచిత స్థానం కల్పించారు" అని తంబళ్లపల్లె నియోజకవర్గం బీ.కొత్తకోటకు చెందిన మమిళా నాయకురాలు పర్వీన్ తాజ్ వ్యఖ్యానించారు.
ఆలోచనలు పంచడం...
కేవలం రాజకీయ వ్యవహారాలే కాకుండా, పార్టీలో మార్పులు గమనించడం, భవిష్యత్తు కార్యాచరణ కోసం నాలెడ్జి కమిటీ తోపాటు హెచ్ఆర్డీ కమిటీల్లో ఒక్కొక్కరు చొప్పున నియమించారు. పార్టీ కమిటీల నిర్ణయంలో సామాజిక సమీకరణలతో పాటు గతానికి భిన్నంగా కమిటీల కూర్పులో జాగ్రత్తలు తీసుకున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు.