2029 లక్ష్యంగా చంద్రబాబు క్యాబినెట్ సర్జరీ
x

2029 లక్ష్యంగా చంద్రబాబు క్యాబినెట్ సర్జరీ

ఐదుగురు మంత్రులపై వేటుకు కసరత్తు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐవీఆర్ఎస్ (IVRS) కాల్స్, క్షేత్రస్థాయి నివేదికలు, ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగా మంత్రుల ప్రోగ్రెస్ కార్డులను సిద్ధం చేశారు. పనితీరును మెరుగు పరచడంలోను, ప్రభుత్వ ఇమేజ్ పెంచడంలో, ఫైళ్ల క్లియరెన్స్‌లో వెనుకబడిన ఐదుగురు మంత్రులను తప్పించేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందులో పేలవమైన ప్రదర్శన కనబరిచిన ముగ్గురు టీడీపీ మంత్రులతో పాటు, జనసేనకు చెందిన ఇద్దరు, బీజేపీకి చెందిన ఏకైక మంత్రి స్థానంలో కొత్త ముఖాన్ని తీసుకురావాలని సీఎం భావిస్తున్నారు. మొదటి నుంచీ ఖాళీగా ఉంచిన ఒక సాంకేతిక స్థానంతో కలిపి, మొత్తం ఆరుగురు కొత్త నేతలకు కేబినెట్‌లోకి ఎంట్రీ కల్పించడం ద్వారా అసమర్థులకు ఉద్వాసన తప్పదనే బలమైన సంకేతాన్ని చంద్రబాబు పంపుతున్నారు.



175 స్థానాల ఏపీ అసెంబ్లీలో గరిష్టంగా 26 మందికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉండగా, ప్రస్తుతం సీఎం సహా 25 మందితో (టీడీపీ-21, జనసేన-3, బీజేపీ-1) కూటమి కేబినెట్ నడుస్తోంది. ఈ ప్రక్షాళన కేవలం మంత్రుల తొలగింపుకే పరిమితం కాకుండా, కీలక శాఖల మార్పులకు కూడా వేదిక కానుంది. యాక్టివ్‌గా ఉంటూ దూసుకుపోతున్న యువ మంత్రులకు మరింత ప్రాధాన్యత ఉన్న పోర్ట్‌ఫోలియోలు అప్పగించి, సీనియర్ల శాఖల్లో మార్పులు చేయనున్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హెచ్చరికలను బేఖాతరు చేసిన వారికి చెక్ పెడుతూ, రాబోయే 2029 ఎన్నికల్లో మళ్లీ కూటమి జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఈ భారీ వ్యూహాత్మక మార్పులు ఊపందుకున్నట్టు కూటమి వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. ఎవరికి మంత్రి పదవులు పోనున్నాయి, ఎవరికి మంత్రి పదవులు దక్కనున్నాయి అనేది ఉత్కంఠ భరితంగా మారింది.
Read More
Next Story