అమరావతిపై కుల ముద్ర వేసింది చంద్రబాబే
x

అమరావతిపై కుల ముద్ర వేసింది చంద్రబాబే

సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన విమర్శలు.


భారీగా అప్పులు చేస్తూ అమరావతి రాజధాని నిర్మాణాన్నిసీఎం చంద్రబాబు పూనకం వచ్చినట్లు రీస్టార్ట్ చేశారని వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పాత అబద్ధాలనే పదేపదే చెబుతూ రాష్ట్రంపై మోయలేని భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా రాజధాని చుట్టూ జరుగుతున్న రాజకీయాలపై సజ్జల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కమ్మరావతి వ్యాఖ్యలు.. లోకేష్ చప్పట్లు
రాజధానిపై కుల ముద్ర వేసింది వైఎస్సార్‌సీపీ కాదని, చంద్రబాబు అండ్ కోనే అని సజ్జల స్పష్టం చేశారు. పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అమరావతిని కమ్మరావతి అని సంబోధిస్తే, పక్కనే ఉన్న లోకేష్ చప్పట్లు కొట్టారు. ఆ వ్యాఖ్యలను టీడీపీ ఎంపీలు ఎందుకు ఖండించలేదు? అని ఆయన ప్రశ్నించారు. అమరావతికి కులం రంగు పులిమింది వారేనని, ఇప్పుడు ఆ తప్పును తమపైకి నెట్టడం సరికాదని విమర్శించారు.
రూ. 2 లక్షల కోట్ల అప్పు.. సాధ్యమేనా?
ఆర్థికంగా సాధ్యంకాని ప్రాజెక్టును కేవలం దోపిడీ కోసమే చంద్రబాబు తెరపైకి తెచ్చారని సజ్జల ఆరోపించారు. రూ. 2 లక్షల కోట్ల అప్పులతో అమరావతిని నిర్మించడం రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరం. దీనివల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు అన్యాయం జరుగుతోంది. సంబరాలు చేసుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చినా ప్రజలు, ఉద్యోగులు దానిని తిరస్కరించారు అని ఆయన పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం ప్రజల మీద భారం కాకూడదన్నదే జగన్ మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశమని ఆయన వెల్లడించారు.
సొంత ఇల్లు ఎక్కడ? సజ్జల లాజిక్
రాజధానిపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధిని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పటివరకు రాజధాని ప్రాంతంలో సొంత ఇల్లు కట్టుకోలేదు. కానీ వైఎస్ జగన్ మాత్రం తన ఇల్లు, పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఇక్కడే నిర్మించుకున్నారు అని గుర్తుచేశారు. రాజధానిని కేవలం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా వాడుకుంటూ, అవినీతికి పాల్పడటమే చంద్రబాబు లక్ష్యమని ఆయన దుయ్యబట్టారు. గతంలో ప్రధాని మోదీని ఉద్దేశించి మట్టి, నీళ్లు ఇచ్చి నెత్తిమీద చేయి పెట్టారు అన్న చంద్రబాబు మాటలను ఈ సందర్భంగా సజ్జల గుర్తుచేశారు.
అవగాహన లేని మాటలు..
చట్టాల తయారీ, పార్లమెంటు అధికారాలపై చంద్రబాబు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయనకు అసలు అవగాహన ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందని సజ్జల ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారో అర్థం కావడం లేదన్నారు. నేల మీద నిలబడి ఆలోచించండి అని జగన్ ఇచ్చిన సలహాను పక్కన పెట్టి, కేవలం ఎదురుదాడి చేయడమే పనిగా పెట్టుకున్నారని సజ్జల విమర్శించారు.
Read More
Next Story