
లోకేశ్ చేత ప్రమాణం చేయించిన చంద్రబాబు
పార్టీ అధినాయకత్వం ఈసారి కమిటీలను అత్యంత వ్యూహాత్మకంగా రూపొందించింది.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా తనయుడు నారా లోకేశ్ చేత పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (Working President) ప్రమాణస్వీకారం చేయించారు. ఒక పక్క తండ్రిగా గర్వం, మరోపక్క అధినేతగా క్రమశిక్షణ ఉట్టిపడేలా సాగిన ఈ ప్రక్రియ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. లోకేశ్ బాధ్యతలు స్వీకరించిన తీరు టీడీపీ భవిష్యత్ నాయకత్వంపై కార్యకర్తలకు బలమైన భరోసాను ఇచ్చింది.
పొలిట్ బ్యూరోలో సామాన్యులకు అగ్రతాంబూలం
టీడీపీ 44 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఈసారి కమిటీల నియామకంలో చంద్రబాబు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కార్యకర్తే అధినేత అనే మాటను అక్షరాలా నిజం చేస్తూ, క్షేత్రస్థాయి నేతలను అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్ బ్యూరోలోకి ఆహ్వానించారు. మంగళగిరి క్లస్టర్ ఇన్‌ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్, గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి వంటి సామాన్య కార్యకర్తలు పొలిట్ బ్యూరో సభ్యులుగా ప్రమాణం చేయడం ఈ కార్యక్రమానికి హైలైట్‌గా నిలిచింది.
అనుభవం.. ఉత్సాహం.. మేళవింపు
పార్టీ అధినాయకత్వం ఈసారి కమిటీలను అత్యంత వ్యూహాత్మకంగా రూపొందించింది. సీనియర్ నాయకుల అపార అనుభవాన్ని గౌరవిస్తూనే, యువ నాయకుల దూకుడుకు పెద్దపీట వేసింది. దాదాపు 250 మంది సభ్యులతో కూడిన జాతీయ, రాష్ట్ర కమిటీలు పాత-కొత్త కలయికతో ఒక సంపూర్ణ శక్తిలా కనిపిస్తున్నాయి. సీనియారిటీ, సిన్సియారిటీ ఉన్న ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభించడంతో కార్యాలయం అంతా పండుగ వాతావరణం నెలకొంది.
తగ్గని పౌరుషం.. లక్ష్యం 2029
ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం చంద్రబాబు ప్రసంగిస్తూ, గెలుపోటములకు కుంగిపోని ఏకైక పార్టీ టీడీపీ అని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీల కుట్రలను చీల్చి చెండాడుతూ, రాబోయే ఐదేళ్లలో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించాలని కార్యవర్గానికి పిలుపునిచ్చారు. 2024 విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, 2029లో అంతకు మించిన మెజారిటీ సాధించడమే మన తదుపరి లక్ష్యమని ఉద్ఘాటించారు.
Next Story

