
కూటమిని కుదిపేస్తున్న మంత్రివర్గ విస్తరణ
చంద్రబాబు మార్క్ సర్ప్రైజ్ ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఏపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టబోయే మంత్రివర్గ ప్రక్షాళన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈసారి కేబినెట్ విస్తరణకు కేవలం సామాజిక , రాజకీయ సమీకరణాలే కాకుండా, మంత్రుల పనితీరు, ఫైల్ క్లియరెన్స్ రేటింగ్‌లను ప్రధాన ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. పనితీరులో వెనుకబడిన హోం మంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వసంశెట్టి సుభాష్ వంటి వారి పదవులపై గండం పొంచి ఉందనే ప్రచారం కూటమి వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది.
మరోవైపు కూటమి ధర్మాన్ని నిలబెట్టుకుంటూ రాజకీయ సమతుల్యతను సాధించడం ఈ మార్పుల్లో కీలకమైన అంశం కానుంది. ఇందులో భాగంగా జనసేనకు అదనంగా రెండు మంత్రి పదవులు, బీజేపీకి మరొకటి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన పార్టీ సీనియర్ల జాబితాను సిద్ధం చేయగా, బీజేపీ సైతం ఒక బలమైన నేతను కేబినెట్‌లోకి పంపేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇది కూటమి భాగస్వామ్య పక్షాల బలాన్ని మరింత పెంచేలా కనిపిస్తోంది.
నారా లోకేష్ మార్క్ రాజకీయాల ప్రభావం కూడా ఈసారి కేబినెట్ కూర్పుపై స్పష్టంగా కనిపించనుంది. చదువుకున్న వారికి, యువ నాయకత్వానికి పెద్దపీట వేయాలనే ఆలోచనతో పాటు, గత రెండేళ్లుగా నిరీక్షిస్తున్న గంటా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర వంటి సీనియర్లకు ఈసారి బెర్త్ ఖాయమనే ప్రచారం సాగుతోంది. సామాజిక సమీకరణాలు, మహిళా కోటాలో మార్పుల ద్వారా మంత్రివర్గానికి సరికొత్త రూపునివ్వాలని అధిష్ఠానం భావిస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో అమరావతి, ఉండవల్లి పరిసర ప్రాంతాలు రాజకీయంగా వేడెక్కాయి. పదవులు కాపాడుకోవాలని కొందరు, కొత్తగా రేసులోకి రావాలని మరికొందరు ఆశావాహులు లోకేష్ ద్వారా రూట్ క్లియర్ చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఎలాంటి సిఫార్సులకు లొంగకుండా చంద్రబాబు కేవలం పనితీరు, ప్రజాదరణ, సామాజిక సమీకరణలకే మొగ్గు చూపుతారని టాక్ నడుస్తుండటంతో, జూన్ 12 తర్వాత రాబోయే బాబు మార్క్ సర్ప్రైజ్ ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Next Story

