వైఎస్‌ను తలచుకుని భోరుమన్న బొత్స!
x
వైఎస్‌ను తలచుకుని విలపిస్తున్న బొత్స సత్యనారాయణ

వైఎస్‌ను తలచుకుని భోరుమన్న బొత్స!

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ భోరున విలపించారు.


ఆయన రాజకీయాల్లో తలపండిన నేత. నిబ్బరానికి మారుపేరు ఆయన. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా తట్టుకునే స్థైర్యం ఆయన సొంతం. రాజకీయాల్లో క్లిష్ట సమయాల్లోనూ తొణకని, బెణకని నైజం బొత్స సత్యనారాయణది. అలాంటి బొత్స విశాఖలో గురువారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో తొలిసారిగా భోరున విలపించారు. ఎందుకంటే?

అచ్చెన్నాయుడి వ్యాఖ్యల దుమారం..
ఉత్తరాంధ్రకే చెందిన వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం బొత్స సత్యనారాయణను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణం వెనక ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ఉన్నాడన్న విషయాన్ని బొత్స సత్యనారాయణే చెప్పారని మీడియాకు చెప్పారు. ఈ సంగతి తెలిసిన వెంటనే విశాఖలో ఉన్న బొత్స అత్యవసర మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బొత్స ఏమన్నారంటే?
వైఎస్‌ పాదయాత్ర రోజున అవాకులా?
‘మహానేత వైఎస్‌ పాదయాత్ర ప్రారంభించి ఈ రోజుకి 23 ఏళ్లయింది. ఊరూవాడా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నేత. అలాంటి మహానుభావులను రాష్ట్రంలో వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఆయన పాదయాత్ర చేసిన రోజున మేమంతా ఆయన్ను ఆరాధించుకుంటున్నాం. అలాంటి వేళ వైఎస్‌ మరణంపై తప్పుడు మాటలు మాట్లాడతావా? వైఎస్‌ మరణం వెనక ఆయన కొడుకు జగన్‌ ఉన్నాడని, ఆ విషయాన్ని నేనే చెప్పానని పనికి మాలిన మాటలు మాట్లాడతావా? నేనెప్పుడైనా చెప్పానా? రెండు పేపర్లు, ఛానల్స్‌ మీ చేతిలో ఉన్నంతమాత్రాన ఇలా మాట్లాడతావా? పార్టీలో నీ ఉనికిని కాపాడుకోవడానికి ఇంత దిగజారిపోతావా? నువ్వు (అచ్చెన్నాయుడు) పొడవుగా ఉన్నావు. నీ మెదడు బుర్రలో ఉంటుందనుకున్నాను. కానీ మోకాల్లోనూ కాదు.. పాదాల్లోకి వచ్చేసింది.
వైఎస్‌ను తలచుకుని భోరున విలపించి..
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన రోజు జగన్మోహన్‌రెడ్డి విదేశాల్లో ఉన్నాడా? ఆరోజు నేను పావురాల గుట్టకు వెళ్లాను. ప్రమాదం అనంతరం పరిణామాలకు నేనే ప్రత్యక్ష సాక్షిని. కేంద్రంతో సంప్రదింపులు చేసి, ఆ బాడీ ఎక్కడుందో ట్రేస్‌ చేశాం. వైఎస్‌ పార్థివదేహానికి కర్నూలులో పోస్టుమార్టం అనంతరం పెరేడ్‌ గ్రౌండ్‌లో ఉంచి క్యాంప్‌ ఆఫీసుకు వచ్చాను. నా వెనకే వైఎస్‌ పార్ధివ దేహాన్నీ తెచ్చారు. నేను, నా భార్య ఝాన్సీ.. అంటూ భోరున విలపించారు. వైఎస్‌ను తలచుకుంటూ కొన్ని నిమిషాల పాటు బొత్స అలా విలపిస్తూనే ఉన్నారు. కాసేపటి తర్వాత తేరుకుని ‘అందుకే ఎప్పుడూ ఆయన (వైఎస్‌) పేరెత్తలేను. మా అనుబంధం అలాంటిది అంటూ మరోసారి కన్నీరు పెట్టుకున్నారు. ఆరోజు జగన్‌ను మా భార్యాభర్తలం వైఎస్‌ పార్ధివదేహం వద్దకు తోడ్కొని వాచ్చాం. ఆరోజు మంత్రులు రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, మరికొందరు ఉన్నారు.
ఆ సమయంలో నేను అక్కడ లేను. వీళ్లే జగన్‌ను సీఎంగా ప్రతిపాదించారు. వాస్తవం ఇలా ఉంటే ఇలాంటి పనికి మాలిన మాటలెందుకు? చంద్రబాబు ఎన్టీఆర్‌ అల్లుడు కాకపోతే నాలుగుసార్లు సీఎం అవుతాడా? వెన్నుపోటంటే.. ఎన్టీఆర్‌ను చంద్రబాబు కత్తితో పొడిచి చంపాడనా?ఎన్టీఆర్‌ను మనసికంగా బాధపెట్టి చనిపోవడానికి కారణమయ్యారని.
ఇంతలా దిగజారతావనుకోలేదు..
నేను రాజకీయాల కోసం బతకండం లేదు. రాజశేఖర్‌రెడ్డి గారి గురించి మాట్లాడటానికే వచ్చాను. నీలాంటి తుచ్ఛ రాజకీయాలు చేయను. పదవుల కోసం నువ్వు (అచ్చెన్నాయుడు) ఇంత నీచంగా దిగజారుతావనుకోలేదు. నిన్నో మొన్నో పేపర్లో చూశాను. ఆయన్ను మారుస్తారని చదివాను. బాబు మెప్పు కోసం ఇలా మాట్లాడుతున్నాడు. నన్ను ఏమన్నా ఫర్వాలేదు. రాజశేఖర్‌రెడ్డి గారిని అంటే ఊరుకుంటానా? నేను ఈరోజే రాజకీయాల్లోకి వచ్చావనుకుంటున్నావా? గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం రాజకీయాల్లో మంచిది. రాజకీయంగా జగన్‌తో పోరాటం చెయ్‌. అంతేగాని చనిపోయిన వైఎస్‌ గురించి తప్పుగా మాట్లాడకు. రేణుకా చౌదరిలా నువ్వూ అమరావతిని కమరావతి అనుకో. అచ్చెన్న ఆలోచన అరికాలిలో కాకుండా బుర్రలో ఉంటే క్షమాపణ చెబుతాడు. లేదంటే లేదు.
సభ్యతా సంస్కారాలు లేవు..
రాష్ట్ర రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే.. సభ్యత సంస్కారం ఏమీ లేవు. ఆ పదవుల కోసం ఎంత మాటైనా మాట్లాడతారు. ఎలాంటి రాతలైనా రాస్తారు. అమరావతిలో చేస్తున్న దురాగతానికి మీరు చేసిన అవినీతికి చేయబోతున్న అవినీతికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రత్యామ్నాయం ఆలోచించుకోమని జగన్‌ చెప్పారు. ఒక్కసారైనా సమాధానం చెప్పారా? నలభై ఏళ్ల ఇండస్ట్రీ అంటే ఇదా చంద్రబాబు? మీకు సిగ్గని పించలేదా? మావిగన్‌ అంటే ఎందుకు ఉలికిపడుతున్నారు. మావిగన్‌ వల్ల వైసీపీకే నష్టమనుకుంటే మీకెందుకు బాధ? మా పార్టీలో ఉన్న భార్యలు, మహిళలు పైనా చౌకబారు విమర్శలు చేస్తున్నారు’ అని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు.
బొత్స కంట కన్నీరు ఇదే తొలిసారి..
నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న బొత్స సత్యనారాయణ కంట కన్నీరొలకడం ఇదే తొలిసారని రాజకీయాలకతీతంగా పలువురు విశేషంగా చర్చించుకుంటున్నారు. బొత్స ఎప్పడూ గంభీరంగానే కనిపిస్తారు. ఎలాంటి విమర్శలనైనా తిప్పికొడతారు. రాజకీయ నాయకులకు తనదైన శైలిలో చురకలంటిస్తారు. అంతేగాని ఎక్కడా, ఎప్పుడూ కన్నీరు పెట్టుకున్న సందర్భాలు లేవని ఆయన గురించి తెలిసిన వారు చెప్పుకుంటున్నారు. తానెంతగానో అభిమానించే వైఎస్‌పై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు మనస్తాపానికి గురయ్యారు బొత్స. తాను కన్నీరు పెట్టుకున్న అనంతరం మాట్లాడుతూ వైఎస్‌ గుర్తుకొస్తే తట్టుకోలేనని, ఆయనతో తనకున్న అనుబంధం అలాంటిదని చెప్పారు.
Read More
Next Story