
మహిళా బిల్లు అడ్డుకోవడం జాతి విద్రోహం: చంద్రబాబు
విపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కకూడదని సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అడ్డుకున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే జాతి ఆకాంక్షను విపక్షాలు కాలరాశాయని, ఇది దేశ చరిత్రలో ఒక బ్లాక్ డే అని ఆయన అభివర్ణించారు. శనివారం నిడదవోలులో ఎన్డీఏ (TDP-JSP-BJP) భాగస్వామ్య పక్షాలు చేపట్టిన భారీ నిరసన ర్యాలీలో సీఎం పాల్గొన్నారు.
మహిళా లోకానికి తీరని ద్రోహం
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, మహిళా సాధికారత కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో చిత్తశుద్ధితో బిల్లును తీసుకువస్తే, ప్రతిపక్షాలు వక్రభాష్యాలు చెబుతూ అడ్డుకున్నాయని మండిపడ్డారు. మూడు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాం. సాధించుకునే సమయంలో విపక్షాలు కుంటిసాకులు చెప్పి అడ్డుకోవడం క్షమించరాని నేరం అని ధ్వజమెత్తారు. మహిళలను గౌరవించడం మన సంస్కృతి అని, దానికి భిన్నంగా వ్యవహరించడం జాతి విద్రోహం కిందకే వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
చిన్న రాష్ట్రాల సాకుతో మోసం
దక్షిణాది, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విపక్షాల ఆరోపణలను సీఎం తిప్పికొట్టారు. ఈ విషయంలో కేంద్రం ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు ఇలాంటి వాదనలు తెరపైకి తెచ్చాయని విమర్శించారు. ఏ మొహం పెట్టుకుని రేపు ఆడబిడ్డలను ఓట్లు అడుగుతారు? అని ఆయన ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించారు.
ఇది ఆరంభం మాత్రమే.. ఊరూరా నిరసనలు
నిడదవోలులో ప్రారంభమైన ఈ నిరసన ఇక్కడితో ఆగదని సీఎం స్పష్టం చేశారు. రేపటి నుంచి దేశంలోని, రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి విపక్షాల ద్రోహాన్ని వివరిస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మహిళలకు అన్యాయం చేసిన పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో కూటమి నేతలు సోము వీర్రాజు, కందుల దుర్గేశ్, మాధవ్ తదితరులు పాల్గొని మహిళా బిల్లుకు మద్దతుగా, విపక్షాల తీరుకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. మహిళా లోకమంతా ఏకమై ఈ అన్యాయాన్ని ఎదిరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Next Story

