విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ సపోర్ట్..
x

విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ సపోర్ట్..

మద్దతుపై పేలిన బీజేపీ, డీఎంకే నేతల మాటల తూటాలు..


Click the Play button to hear this message in audio format

తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. డీఎంకే‌కు కాంగ్రెస్ "ద్రోహం" చేసిందని ఆరోపించింది. ప్రతిపక్ష ఇండియా(I.N.D.I.A) కూటమి “పేకకట్టలా విచ్ఛిన్నమవుతోందని”, దానికి ఒక సిద్ధాంతం, దార్శనికత అంటూ ఏమి లేవని కాషాయ పార్టీ కాంగ్రెస్‌పై మాటలదాడి మొదలుపెట్టింది.

టీవీకేకు షరతుతో కూడిన మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించిన నేపథ్యంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందించారు. "కాంగ్రెస్‌తో మోసపోని వారు లేరు. డీఎంకేకే ఇలా చేసినప్పుడు, సమాజ్‌వాదీ పార్టీకి వాళ్ళు ఏం చేస్తారో ఊహించండి," అని X లో పోస్ట్‌ చేశారు.

కేవలం వ్యక్తిగత ఆశయాల కారణంగానే ప్రతిపక్ష కూటమి ఏర్పడిందని పూనావాలా ఆరోపించారు. "ఇండీ అలయన్స్‌కు ఒక గోల్ అంటూ లేదు. దార్శనికతా లేదు. కేవలం పదవిపై ఆశ, కమీషన్లు, మోదీజీపై ఉన్న కక్షతోనే వారంతా ఏకమయ్యారు. కానీ ఇప్పుడు అదంతా పేకముక్కల్లా కూలిపోతోంది," అని అన్నారు.

కాంగ్రెస్ 'వెన్నుపోటు'ను ఖండించిన డీఎంకే..

టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడాన్ని డీఎంకే తప్పబట్టింది. “వెన్నుపోటు” చర్యగా అభివర్ణించింది. “టీవీకేతో పొత్తు పెట్టుకోవడం తమిళులను వెన్నుపోటు పొడవడమే,” అని డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ ఆనందురై అన్నారు.

ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియకముందే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. "విజయ గెలుపు పత్రంపై రిటర్నింగ్ అధికారి సంతకంలోని సిరా ఆరకముందే, వారు పొత్తుకు తహతహలాడారు," అని శరవణన్ విమర్శించారు.

పార్టీల సంఖ్యాబలం..

234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలను గెలుచుకుని, మెజార్టీ మార్కుకు కొద్ది దూరంలో నిలిచింది. సాధారణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయనకు 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఫలితాలు సోమవారం మాత్రమే వెలువడ్డాయి. కాంగ్రెస్ ఐదు స్థానాలను గెలుచుకోగా, పీఎంకే నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. సీపీఐ, సీపీఐ-ఎం చెరో రెండు స్థానాలను గెలుచుకున్నాయి. అధికారంలో ఉన్న డీఎంకే 59 స్థానాలను గెలుచుకోగా, ఏఐఏడీఎంకే 47 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ ఒక సీటు మాత్రమే గెలుచుకోగా, డీఎండీకే, ఏఎంఎంకేలు కూడా ఒక్కో సీటు గెలుచుకున్నాయి. కాగా, వీసీకే రెండు సీట్లు గెలుచుకుంది.

కాంగ్రెస్ డీఎంకేతో కలిపి పోటీచేయగా, బీజేపీ ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.

Read More
Next Story