
తమిళనాడులో బీజేపీ మ్యానిఫెస్టో విడుదల
మహిళలకు రూ.2వేలు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి ఇంటికి రూ. 10వేల ఆర్థిక మద్దతు, రైల్వే రంగానికి అధిక ప్రాధాన్యం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. సంక్షేమం, అభివృద్ధి, భద్రతకు హామీలిచ్చింది. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మహిళల కోసం ఆర్థిక సాయం, ఉచిత ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ చేస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలోని ప్రతి మహిళా కుటుంబ పెద్దకు నెలకు రూ. 2వేలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదనంగా, ప్రతి ఇంటికి ఒకేసారి రూ. 10వేల ఆర్థిక మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే పొంగల్, తమిళ పుత్తాండు, దీపావళి పండుగల సందర్భంగా ప్రతి కుటుంబానికి మూడు ఎల్‌పీజీ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
27 స్థానాల్లో పోటీ..
బీజేపీ, ఏఐఏడీఎంకేతో కలిసి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)లో భాగంగా తమిళనాడులో 27 స్థానాల్లో పోటీ చేస్తోంది. మురుగన్ స్వామికి గౌరవంగా తైపూసాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని తెలిపింది. అలాగే తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే సంప్రదాయాన్ని పునరుద్ధరించనున్నట్లు పేర్కొంది.
రైల్వేకు అధిక ప్రాధాన్యం..
మేనిఫెస్టోలో రైల్వే రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. చెన్నై–బెంగళూరు, చెన్నై–హైదరాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కోయంబత్తూరు–తిరుప్పూర్–సేలం మధ్య RRTS లైన్, విల్లుపురం–చెన్నై సెమీ అర్బన్ రైలు మార్గం నిర్మాణానికి కూడా హామీ ఇచ్చారు. ఇక చెన్నైను ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలతో కలిపే స్లీపర్ వందే భారత్ రైళ్లు ప్రవేశపెడతామని ప్రకటించింది. జల విద్యుత్ ఆధారిత రైలు ప్రాజెక్టులను కూడా తీసుకురానున్నట్లు తెలిపింది.
మహిళల భద్రత కోసం జీరో ఎఫ్‌ఐఆర్ విధానం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, బాధితులకు రక్షణ చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. బస్సులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
మహిళల స్వయం సహాయక బృందాలు, సహకార సంఘాలు, ఎంఎస్ఎంఈలకు రూ. 50 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కొనుగోళ్లలో 20 శాతం రిజర్వేషన్ కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
డీఎంకేపై నాగేంద్రన్ విమర్శలు..
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ డీఎంకేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “బీజేపీ తరఫున అందరికీ తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తమిళనాడులో ఫాసిస్ట్, ప్రజా వ్యతిరేక, కుటుంబ పాలన కొనసాగుతోంది. రాబోయే ఎన్నికల్లో డీఎంకేను ఓడించేందుకు వివిధ వ్యూహాలతో ఎన్డీఏ నేతృత్వంలోని మెగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది,” అని పేర్కొన్నారు. అలాగే నాగేంద్రన్ డీఎంకే పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
“డీఎంకే ఒక్క హామీని కూడా సరిగా నెరవేర్చలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. మహిళలపై నేరాలు పెరిగాయి. ఏఐఏడీఎంకే ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసింది. ఇప్పుడు మేము మా ప్రణాళికను ప్రకటించాం. ఎన్డీఏ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది,” అని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఏఐఏడీఎంకే..
బీజేపీ హామీలు, దాని మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే ఇప్పటికే ప్రకటించిన సంక్షేమ పథకాలతో జనంలోకి వెళ్తున్నారు. ఆ పార్టీ కూడా మహిళలకు నెలకు రూ. 2వేలు సహాయం, ఉచిత సిలిండర్లు ఇస్తామని ప్రకటించింది.
మొత్తంగా, బీజేపీ మేనిఫెస్టో సంక్షేమం, మౌలిక సదుపాయాలు, భద్రత అంశాల ఆధారంగా రూపొందించారు. ఎన్నికలలో ఓటర్లను ఆకర్షించేందుకు ఈ హామీలు కీలక పాత్ర పోషించే అవకాశముంది.

