
బెంగళూరు టూ హైదరాబాద్..జగన్ వ్యూహం ఇదేనా?
కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ కూడా వారాంతాల్లో హైదరాబాద్‌కు వెళ్తుంటారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఇప్పుడు ఒకటే ఉత్కంఠ.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ మకాంను మారుస్తున్నారా? గత కొంతకాలంగా బెంగళూరులోని యలహంక నివాసానికే పరిమితమై, అప్పుడప్పుడు తాడేపల్లి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మళ్లీ బెంగుళూరుకు వెళ్లిపోతున్నారని ప్రత్యర్థుల విమర్శలకు కేంద్రబిందువుగా మారిన ఆయన.. ఇప్పుడు మళ్ళీ తన పాత అడ్డా, వైఎస్సార్ రాజకీయ వారసత్వానికి వేదికైన లోటస్ పాండ్ కు రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ మకాం మార్పు కేవలం నివాసానికి సంబంధించిన నిర్ణయం మాత్రమే కాదు.. 2029 లక్ష్యంగా పక్కా స్కెచ్‌తో, ప్రత్యర్థుల విమర్శల కోటలను బద్ధలు కొట్టేందుకు సిద్ధం చేసిన ఒక బలమైన రాజకీయ వ్యూహమన్న విశ్లేషణలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హీట్ పుట్టిస్తున్నాయి.
కేరాఫ్ బెంగళూరు విమర్శలకు చెక్
గత కొంతకాలంగా తెలుగుదేశం, జనసేన నేతలు జగన్ లక్ష్యంగా ఎక్కుపెట్టిన ప్రధాన అస్త్రం.. ఆయన బెంగళూరు మకాం. ఏపీలో రాజకీయం చేస్తూ.. బెంగళూరు ప్యాలెస్‌లో సేదతీరుతున్నారా? అంటూ కూటమి నేతలు చేస్తున్న ఘాటైన విమర్శలు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం కేరాఫ్ బెంగళూరు అంటూ జరుగుతున్న ప్రచారం వైసీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో, ఆ విమర్శల వేళ్లను నరికేయడమే లక్ష్యంగా జగన్ తన మకాంను హైదరాబాద్‌కు మారుస్తున్నట్లు కనిపిస్తోంది.
దూరాన్ని తగ్గించే వ్యూహం
హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌కు రీ-ఎంట్రీ ఇవ్వడం ద్వారా తాను రాజకీయాలకు దూరంగా లేననే బలమైన సంకేతాన్ని పంపాలని జగన్ భావిస్తున్నారు. బెంగళూరు అనేది ఒక ప్రైవేట్ నివాసంగా ముద్రపడగా, లోటస్ పాండ్ మాత్రం దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ రాజకీయ పోరాటాలకు చిరునామాగా ఉంది. ఇక్కడికి మారడం ద్వారా అటు ప్రజలకు, ఇటు పార్టీ వ్యవహారాలకు తాను నిరంతరం అందుబాటులో ఉంటాననే భరోసాను కేడర్‌లో నింపడమే కాకుండా, ప్రత్యర్థుల విమర్శల నోటికి తాళం వేయవచ్చని వైసీపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు.
రాజకీయ కేంద్రం మార్పు
కేవలం మకాం మార్చడమే కాదు, తన రాజకీయ కేంద్రాన్ని మళ్ళీ పాత అడ్డాకు మార్చడం ద్వారా ప్రత్యర్థుల ఎత్తుగడలకు పైఎత్తు వేస్తున్నారు జగన్. తాడేపల్లి నివాసంతో పాటు హైదరాబాద్‌ను తన రాజకీయ వేదికగా చేసుకోవడం ద్వారా, అటు ఏపీలోనూ ఇటు జాతీయ స్థాయిలోనూ తన వాయిస్‌ను మరింత బలంగా వినిపించే అవకాశం ఉంటుందని ఆయన నమ్ముతున్నారు. ఈ హైదరాబాద్ షిఫ్టింగ్ కూటమి నేతలకు ఏ రకమైన కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.
కేడర్‌లో భరోసా.. అందుబాటులో నాయకత్వం
బెంగళూరు నివాసం అత్యంత ప్రైవేట్ ప్రదేశం కావడంతో సాధారణ కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు అక్కడ జగన్‌ను కలవడం గగనమైపోయింది. ఇది క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు సడలేలా చేస్తోందన్న భావన జగన్‌లో కలిగింది. లోటస్ పాండ్ నివాసం మొదటి నుంచి రాజకీయ కార్యకలాపాలకు నిలయం. అక్కడ మకాం పెడితే నేతలకు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చని జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు.
సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
జగన్ రాజకీయ ప్రస్థానంలో లోటస్ పాండ్‌కు ఒక ప్రత్యేక సెంటిమెంట్ ఉంది. 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నేతగా ఆయన ఇక్కడి నుంచే యుద్ధం ప్రకటించారు. ఇక్కడే వ్యూహాలు రచించి, పాదయాత్రకు శ్రీకారం చుట్టి, రికార్డు స్థాయి మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయిన తరుణంలో, అదే సెంటిమెంట్‌ను నమ్ముకుని 2029 ఎన్నికల కోసం లోటస్ పాండ్ వేదికగా సమరశంఖం పూరించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
మీడియా హబ్‌లో ఉంటేనే మైలేజ్
హైదరాబాద్ ప్రధాన మీడియా కేంద్రం కావడంతో, అక్కడ ఉంటే పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం సులభమవుతుంది. పార్టీ గొంతుక వినిపించాలన్నా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నా మీడియా సమన్వయం అత్యంత కీలకం. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో రాజకీయ పరంగా జాతీయ స్థాయి నేతలతో సమన్వయం చేసుకోవడం, మీడియా సమావేశాలు నిర్వహించడం జగన్‌కు కలిసి వచ్చే అంశం.
అదే వ్యూహం.. అదే బాట
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ కూడా వారాంతాల్లో హైదరాబాద్‌కు వెళ్తుంటారనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాను కూడా హైదరాబాద్‌లోనే ఉంటే, ఇకపై వారు తనను ప్రశ్నించే నైతిక హక్కును కోల్పోతారని జగన్ భావిస్తున్నారనే చర్చ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ప్రత్యర్థుల బాటలోనే పయనిస్తూ వారి విమర్శలకే తూట్లు పొడవడం ఆయన వ్యూహంలో భాగంగా ఈ ఎత్తుగడ వేశారనే చర్చ కూడా ఉంది. ప్రస్తుతం లోటస్ పాండ్ నివాసంలో మరమ్మతులు వేగంగా జరుగుతుండటంతో, ఈ నెల చివరలో లేదా మే మొదటి వారంలో జగన్ మకాం మార్పు అధికారికం కానుందనే టాక్ వినిపిస్తోంది.
Next Story

