
మన నేతల 'కాన్వాయ్ కోతల్ని' జనం నమ్ముతారా?
ఎందుకీ మెరమెచ్చు మాటలు.. ఒక్కో మంత్రి ఇంట్లో ఉన్న కార్లు ఎన్నీ, సెక్రటేరియట్ కి ఒక కార్లో వచ్చామని చెబితే జనం నమ్ముతారా..
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ పాలకులకు 'పొదుపు' మంత్రం గుర్తొచ్చిందా? అంతర్జాతీయంగా చమురు ధరలు మండిపోతున్నా, రాష్ట్ర ఖజానాపై భారమున్నా ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న యంత్రాంగం.. ఒక్కసారిగా 'కాన్వాయ్' కోతలకు దిగడం వెనుక ఉన్నది నిజమైన చిత్తశుద్ధా లేక రాజకీయ ప్రచారమా? ఇప్పుడు ఇదే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
పిలుపు ఒకరిది.. అమలు మరొకరిదా?
మే 10న ప్రధాని మోదీ పొదుపు పాటించాలని సూచించిన వెంటనే, ఏపీలోని అగ్రనేతలంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. నారా చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్ వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని స్ఫూర్తితో తన భద్రతా వాహనాల విషయంలో పరిమితులు విధించుకున్నారు. నారా లోకేశ్ కేవలం రెండు వాహనాలకే పరిమితం కావాలని నిర్ణయించుకుంటే... ఇక చూస్కో మంత్రులంతా తామంటే తామంటూ పోటీ పడుతున్నారు.
అయితే, ఫిబ్రవరి నుంచి అంతర్జాతీయ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నా, అప్పట్లో లేని ఈ 'పొదుపు ఆరాటం' ఇప్పుడు కేవలం ప్రధాని మెప్పు కోసమేనా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అతివినయం.. అసలైన పొదుపా?
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మంత్రులు ఎస్కార్ట్ వాహనాలు లేకుండా రావడం, సింగిల్ వాహనాల్లో ప్రయాణించడం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
"విజయవాడ నుంచి ఢిల్లీ, హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాలు వాడే సంస్కృతికి స్వస్తి పలుకుతారా?"
"కేవలం వాహనాలు తగ్గిస్తే సరిపోతుందా? విలాసవంతమైన విదేశీ పర్యటనలు, భారీ బహిరంగ సభల ఖర్చు సంగతేంటి?"
"పొరుగు రాష్ట్రం తమిళనాడులో సీఎం విజయ్ అనుసరిస్తున్న నిరాడంబరతను ఇక్కడ ఎందుకు ఆదర్శంగా తీసుకోరు?"
అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
విదేశీ మోజు వర్సెస్ స్వదేశీ నిధులు
విదేశీ పర్యటనలకు బదులు అరకు, గండికోట వంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ, క్షేత్రస్థాయిలో సౌకర్యాలు మెరుగుపరచకుండా కేవలం ప్రకటనలకే పరిమితమైతే, పర్యాటకులు విదేశీ పర్యటనలనే ఎంచుకుంటారనే వాదన వినిపిస్తోంది. అరకు, పాపికొండలను అంతర్జాతీయ స్థాయికి చేర్చాలంటే భారీ పెట్టుబడులు అవసరం, మరి ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్నది ప్రశ్నార్థకం.
ఆచరణలో కనిపిస్తేనే గుర్తింపు!
కేవలం ప్రధాని చెప్పారని చేసే 'కాన్వాయ్ కోతలు' తాత్కాలికంగానే కనిపిస్తాయి. ప్రభుత్వం నిజంగా పొదుపు పాటించాలనుకుంటే.. ప్రభుత్వ ప్రకటనలకు అయ్యే కోట్లాది రూపాయల ఖర్చును తగ్గించాలి. అనవసరమైన విదేశీ పర్యటనలను రద్దు చేసుకోవాలి. ప్రజాప్రతినిధుల జీతభత్యాలు, విలాసాల కంటే ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యత ఇవ్వాలి.
త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం కేవలం 'తగ్గింపు' ప్రకటనలకే పరిమితం కాకుండా, దీర్ఘకాలిక ఆర్థిక క్రమశిక్షణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాల్సి ఉంది. లేదంటే, ఇవన్నీ కేవలం 'రాజకీయ విన్యాసాలు'గానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
దుబారాను తగ్గించడమంటే కేవలం వాహనాలు లేదా హెలికాప్టర్లకు పరిమితమైన అంశం కాదు. ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ కోసం ప్రభుత్వం వ్యవస్థాగతమైన మార్పులు చేయాల్సి ఉంటుంది.
పాలనాపరమైన సంస్కరణలు..
రాజకీయ నిరుద్యోగుల కోసం సృష్టించే 'సలహాదారుల' పదవులు, అనవసరమైన కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను తగ్గించాలి. వీరికి కేటాయించే బంగ్లాలు, సిబ్బంది, వాహనాల ఖర్చు ప్రభుత్వ ఖజానాపై భారీ భారం.
పేపర్ లెస్ గవర్నెన్స్: ఈ-ఆఫీస్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం ద్వారా స్టేషనరీ, ప్రింటింగ్, ఫైళ్ల నిర్వహణ ఖర్చును కోట్లలో ఆదా చేయవచ్చు.
భద్రతా ముప్పు లేని సమయాల్లో కూడా డజన్ల కొద్దీ వాహనాలు వెళ్లడం దుబారానే. కేవలం సెక్యూరిటీ నిబంధనలకు అవసరమైన వాహనాలను మాత్రమే వాడాలి.
ప్రతి సమీక్షా సమావేశానికి జిల్లాల నుంచి అధికారులను రాజధానికి పిలిపించడం వల్ల ట్రావెల్ అలవెన్సులు (TA/DA), ఇంధనం వృథా అవుతాయి. వీటిని వర్చువల్ మీటింగ్స్ ద్వారా నిర్వహించాలి.
ప్రకటనల నియంత్రణ: ప్రభుత్వ పథకాల ప్రచారం పేరుతో పత్రికలు, టీవీలలో ఇచ్చే భారీ స్థాయి అడ్వర్టైజ్‌మెంట్లను తగ్గించాలి. ముఖ్యంగా పాలకుల వ్యక్తిగత ప్రచారం కోసం ప్రజాధనం వాడకూడదు.
ప్రతి చిన్న కార్యక్రమానికి లక్షల రూపాయలు వెచ్చించి సభలు నిర్వహించడం కంటే, డిజిటల్ పద్ధతుల్లో ప్రారంభోత్సవాలు చేయడం ఉత్తమం.
ప్రాజెక్టుల నిర్వహణలో జవాబుదారీతనం
ఏ ప్రాజెక్టు అయినా ఆలస్యమైతే దాని అంచనా వ్యయం (Cost Escalation) పెరిగిపోతుంది. నిర్ణీత సమయంలో పూర్తి చేయడం ద్వారా వేల కోట్ల రూపాయలను ఆదా చేయవచ్చు.
సంక్షేమ పథకాల్లో పారదర్శకత
ఐటీ రిటర్నులు, విద్యుత్ బిల్లులు వంటి డేటాను ఉపయోగించి అనర్హులను తొలగించాలి. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అందరికీ పంపిణీ చేయడం వల్ల నిజమైన పేదలకు అందాల్సిన నిధులు వృథా అవుతాయి.
ప్రభుత్వాలు తరచుగా "పొదుపు" గురించి మాట్లాడినప్పుడు కేవలం టీ, బిస్కెట్ల ఖర్చును లేదా చిన్న వాహనాలను చూపిస్తుంటాయి. కానీ అసలైన దుబారా భారీ కాంట్రాక్టుల కేటాయింపులు, రాజకీయ నియామకాలు, అశాస్త్రీయమైన అప్పుల నిర్వహణలో ఉంటుంది.
నిజమైన పొదుపంటే అవసరమైన చోట ఖర్చు తగ్గించడం కాదు, ఖర్చు చేసిన ప్రతి రూపాయికి తగిన ప్రతిఫలం (Value for Money) వచ్చేలా చూడటం.
ప్రభుత్వ యంత్రాంగం 'స్వచ్ఛందంగా' ఈ చర్యలు తీసుకోనంత వరకు, సామాన్యుడిపై పన్నుల భారం పెరుగుతూనే ఉంటుంది. మరి, రాబోయే కేబినెట్ సమావేశంలో ఇలాంటి నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దామా?
అవినీతిని వదిలేసి కేవలం దుబారాను అరికట్టాలనుకోవడం... ఇంజిన్ పాడైపోయిన కారుకు పైన రంగులు వేసి వేగం పెంచాలనుకోవడమే అవుతుంది. నిజానికి, అవినీతి, దుబారా అనేవి ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు. అవినీతి తగ్గకుండా దుబారాను అరికట్టడం ఆచరణలో అసాధ్యం.
అవినీతిని అరికట్టలేని పాలకులు 'పొదుపు' గురించి మాట్లాడితే జనం నమ్మరు కాక నమ్మరు.
Next Story

