
తమిళనాడులో 3 గంటలకు 71 శాతం, బెంగాల్‌లో 78.77 శాతం పోలింగ్
తమిళనాడులో మొత్తం ఓటర్లు 5.73 కోట్లు. బరిలో అభ్యర్థులు 4,023 మంది. బెంగాల్‌లో తొలిదశ పోలింగ్ - 1,452 మంది అభ్యర్థులు. 3.60 కోట్ల మంది ఓటర్లు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన 4,023 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నేడు (ఏప్రిల్ 23) 5.73 కోట్లకుపైగా ఓటర్లు నిర్ణయించనున్నారు. అదే సమయంలో, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేడు జరగనుంది. ఇక్కడ సుమారు 3.60 కోట్ల మంది ఓటర్లు 1,452 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించడానికి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గుజరాత్‌లోని ఉమ్రేత్ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు, మహారాష్ట్రలోని బారామతి, రాహురి నియోజకవర్గాలకు కూడా ఈ రోజు ఉప ఎన్నిక జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
తమిళనాడులో డీఎంకే Vs ఎన్డీఏ..
తమిళనాడులో పోరు ప్రధానంగా డీఎంకే నేతృత్వంలోని ఎస్పీఏ, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏల మధ్య జరుగుతోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలని చూస్తుండగా, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి ఈ సారి అధికారంలోకి వచ్చేది తామేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినీనటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా ఈ సారి ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) అర్చన పట్నాయక్ విలేకరులతో మాట్లాడుతూ.. “మొత్తం ఓటర్ల సంఖ్య 5.73 కోట్లు కాగా.. ఇందులో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులు, 7,728 మంది థర్డ్ జెండర్ ఉన్నారు” అని వివరించారు. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లు 14,59,039 మంది ఉన్నారని తెలిపారు.
“33,133 ప్రాంతాల్లోని 75,064 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఇందుకోసం 1,06,418 బ్యాలెట్ యూనిట్లతో పాటు 75,064 కంట్రోల్ యూనిట్లు, వీవీపీఏటీ యంత్రాలను ఉపయోగించనుంది. సాంకేతిక ఇబ్బందులను నివారించడానికి, ఈవీఎంలను, వీవీపీఏటీలను రిజర్వ్‌లో ఉంటాం’’ అని పట్నాయక్ చెప్పారు.
వృద్ధ ఓటర్లు ఇంటి నుంచే..
పోస్టల్ బ్యాలెట్ల విషయానికి వస్తే, ఇప్పటివరకు 4,18,541 ఓట్లు అందాయి. కాగా పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బందికి 1,10,595 ఎన్నికల విధి ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. రాష్ట్రంలో 85 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 3,98,513 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో చాలామంది ఇప్పటికే ఇంటి వద్ద నుండే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా..
249 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 325 పోలింగ్ స్టేషన్లు పూర్తిగా మహిళలకే కేటాయించారు. దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేకంగా 71 స్టేషన్లు, యువత కోసం మరో 29 స్టేషన్లు ఏర్పాటు చేశారు.
భద్రతా చర్యల్లో భాగంగా 83,875 మంది స్థానిక పోలీసు సిబ్బందితో పాటు 300 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు.
మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 3,025 ప్రాంతాల్లోని 5,949 కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించినట్లు పట్నాయక్ తెలిపారు. వీటిల్లో శాంతియుత పోలింగ్ కోసం 83,875 మంది స్థానిక పోలింగ్ పోలీసు సిబ్బందితో కలిసి పనిచేయడానికి 300 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (CAPF) మోహరించారు.
బెంగాల్‌లో..
పశ్చిమ బెంగాల్‌లో 152 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అనంతరం రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య దాదాపు 12 శాతం తగ్గిన తర్వాత జరుగుతున్న ఎన్నికలివి. మొదటి దశలో 3.60 కోట్లకు పైగా ఓటర్లు ఓటువేసేందుకు అర్హులు కాగా.. వీరిలో సుమారు 1.75 కోట్ల మంది మహిళలు, 465 మంది థర్డ్ జెండర్ ఉన్నారు.
ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2,450 కంపెనీల కేంద్ర పారామిలిటరీ దళాలను, దాదాపు 2.5 లక్షల మంది సిబ్బందిని మోహరించారు. అలాగే 8,000కు పైగా పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించారు.
మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్, కూచ్ బెహార్, బీర్భూమ్, పూర్బ బర్ధమాన్ వంటి జిల్లాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా ఉంచింది.
ఉత్తర బెంగాల్‌లో మొత్తం 54 స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతమే 2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఎదుగుదలకు దోహదపడి, 2021 అసెంబ్లీ ఎన్నికలలో టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా ఎదగడానికి సహాయపడింది. అందుకే మొదటి దశలో ఉత్తర బెంగాల్ రాజకీయ ప్రాధాన్యం ఉంది.
2021లో జరిగిన 152 స్థానాలకు గాను, బీజేపీ 59 స్థానాలు గెలుచుకోగా, టీఎంసీ 93 స్థానాలు దక్కించుకుంది.
పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరగనుంది, ఆ రోజు కోల్‌కతా, దాని పరిసర ప్రాంతాల్లోని 142 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.

