"ప్రజల ముందు ముసాయిదా పెట్టకుండా బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం హడివిడి చేస్తోంది" అని సీపీఎం రాష్ట్ర నేత కందారపు మురళి విమర్శించారు.
"2024 ఎన్నికల తరువాత జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యాక 2029 వరకు కేంద్రం గడువు విధించింది. ప్రతిపక్షాలను లెక్క చేయకుండా, ఎలాంటి చర్చకు ఆస్కారం లేకుండా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల ద్వారా అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది" అని కందారపు మురళీ వ్యాఖ్యానించారు.
ఆశలు తలకిందులు
రాయలసీమలో 52, నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉంటే డీలిమిటేషన్ కారణంగా పురుషుల తలరాతలు మారే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఐదు జిల్లాల్లో 17 నుంచి 18 సీట్లు, రాష్ట్రంలోని 175 స్థానాలు 225కు పెరిగితే 75 అసెంబ్లీ సీట్లు మహిళలకు దక్కే అవకాశం ఉందని ప్రాథమిక అంచనా. 1.30 లక్షల నుంచి రెండు లక్షల మంది ఓటర్లు ఉన్న అసెంబ్లీ స్థానాలు మహిళలకు కేటాయిస్తారని భావిస్తున్నారు. 2009లో రద్దు అయిన కొన్ని అసెంబ్లీ స్థానాలు మళ్లీ జీవం పోసుకుంటాయని కూడా అంచనా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. డీలిమిటేషన్ వల్ల పునర్విభజనతో అసెంబ్లీలో మహిళ ప్రాతినిధ్యం మరింత పెరగడానికి ఆస్కారం ఉంది.
2014లో టీడీపీ తొమ్మిది మంది, వైసీపీ నుంచి ఏడుగురు ప్రాతినిధ్యం వహించారు.
2019లో వైసీపీ నుంచి 11, టీడీపీ నుంచి ముగ్గురు ఉన్నారు. ఈ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, కడప జిల్లాల నుంచి మహిళల ప్రాతినిధ్యమే లేదు.
2024 ఎన్నికల్లో 21 మంది టీడీపీ కూటమి నుంచి, ఒకరు మాత్రమే వైసీపీ మహిళా ఎమ్మెల్యే విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో చిత్తూరు, శ్రీకాకుళం, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి మహిళ అభ్యర్థులు విజయం సాధించలేదు.
రాష్ట్రంలో విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం 1,65,570 మంది మహిళా ఓటర్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత.. పాణ్యం (కర్నూలు జిల్లా): 1,54,460, చంద్రగిరి (చిత్తూరు జిల్లా): 1,47,522, మంగళగిరి: 1,41,514, తిరుపతి: 1,44,295, కర్నూలు: 1,36,672, కడప: 1,32,431 అసెంబ్లీ స్థానాలు నిలిచాయి.
రాజుల రాజ్యాల్లో రాణి వాసమే..
రాష్ట్రంలో ప్రధానంగా రాయలసీమలో పురుషులదే ఆధిపత్యం. మహిళా ఎమ్మెల్యేలు గెలిచినా, భర్తలు, తండ్రులదే పెత్తనంలా సాగేది. మహిళా రిజర్వేషన్ తో పాటు నియోజకవర్గాల పునర్విభజన కారణంగా మహిళలకు రాయలసీమలో (52 సీట్లు), నెల్లూరు (10 సీట్లు) కలిపి మొత్తం 62 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రిజర్వేషన్ అమలులోకి వస్తే పరిస్థితి ఇలా ఉండవచ్చు. కనీసంగా 21 సీట్లు కచ్చితంగా మహిళలకు కేటాయించాలి. ఆ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పురుష నేతలు సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పునర్విభజన తర్వాత అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225 వరకు పెరిగితే రాయలసీమ, నెల్లూరుతో కలిపి సీట్ల సంఖ్య దాదాపు 80కి చేరవచ్చు. అందులో 26 నుంచి 27 సీట్లు మహిళలకే దక్కుతాయి. సిట్టింగ్ పురుష ఎమ్మెల్యేలు, బలమైన ఆశావహులు రాజకీయ భవిష్యత్తు కోసం నియోజకవర్గాలు మారడమా? తప్పుకోవడమూ? అనే పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తున్నారు.
ముందే తెలిసింది..
అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల నుంచి నలుగురు మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పుట్టపర్తి నుంచి 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే పల్లె రఘనాథరెడ్డి స్థానంలో కోడలు పల్లె సింధూరారెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అయ్యే అవకాశం దక్కింది. ఈ జిల్లాలో రాప్తాడు నుంచి పరిటాల సునీత, పెనుగొండ నుంచి మంత్రి ఎస్. సవితమ్మ, సింగనమల నుంచి బండారు శ్రావణిశ్రీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారికి ఢోకా లేకున్నా.? పునర్విభజన తరువాత గత ఎన్నికల నాటికి ఓటర్లు, 2011 నాటి జనాభా లెక్కలు పరిగణలోకి తీసకుంటే, జిల్లాలో కొందరి ఆశలు గల్లంతయ్యే అవకాశం లేకపోలేదు. ఆ జాబితాలో..
అనంతపురం అర్బన్( 1,32,802), గుంతకల్లు ( 1,31,306), రాయదుర్గం (1,27,358), కదిరి (1,22,542), రాప్తాడు ( 1,22,296), తాడిపత్రి (1,19,334) మహిళా ఓటర్లను ప్రామాణికంగా తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఆ సీట్లలో వారసులను వెదుక్కోవాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నారు.
కొత్తగా నల్లమడ, నార్పల నియోజకవర్గాలు ఏర్పడేందుకు ఆస్కారం ఉంది.
అంతర్మథనం.. సీటు ఉంటే చాలనీ..
టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మహిళా బిల్లుకు పూర్తి మద్దతు ఇవ్వడంతో పార్టీలోని సీనియర్ పురుష నేతలు అయోమయంలో ఉన్నారు.
రాయలసీమలో దశాబ్దాలుగా పోటీ చేస్తున్న నేతలు, ఇప్పుడు తమ కోడళ్లు లేదా కుమార్తెలను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. "కుటుంబంలో సీటు ఉంటే చాలు" అనే ధోరణి కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. అసెంబ్లీ టికెట్ల విషయంలో ఫ్యాక్షన్, గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్న సీమ జిల్లాల్లో, మహిళలకు రిజర్వేషన్ వస్తే తమ పట్టు కోల్పోతామని పురుష నేతలు మథనపడుతున్నారు.
చిత్తూరు:కనిపించని మహిళా ఎమ్మెల్యేలు
చిత్తూరు జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉంది. గత ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాల్లో కూడా టీడీపీ 13, జనసేన తిరుపతి సీటును దక్కించుకున్నాయి. మహిళలకు ఏమాత్రం ప్రాతినిధ్యం దక్కలేదు. 2019లో నగరిలో వైసీపీ నుంచి మాజీ మంత్రి ఆర్కే. రోజా, జీడి నెల్లూరు నుంచి డిప్యూటీ మాజీ సీఎం కే. నారాయణస్వామి కూతురు కలత్తూరు కృపాలక్ష్మి పోటీ చేసి ఓటమి చెందారు. అంతకుముందు రాటకొండ శోభమ్మ (మదనపల్లె), లలితా థామస్ (పూతలపట్టు), డీకే. సత్యప్రభ (చిత్తూరు), ఏవీ. లక్ష్మీదేవమ్మ (తంబళ్లపల్లె), గల్లా అరుణకుమారి (చంద్రగిరి), సుగుణమ్మ (తిరుపతి), రద్దైన వేపంజేరి (ప్రస్తుతం పూతలపట్టు) నుంచి గుమ్మడి కుతూహలమ్మ (మరణించారు) వంటి సీనియర్లు ప్రాతినిధ్యం వహించారు. ఈ పరిస్థితుల్లో..
డీలిమిటేషన్ ( Delimitation) వల్ల జిల్లాలో ఈ సీట్లు మహిళలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అందులో చంద్రగిరి (1,47,522), తిరుపతి (1,44,295), పలమనేరు (1,30,413), మదనపల్లె (1,26,729), శ్రీకాళహస్తి ( 1,23,723) నియోజకవర్గాలు మహిళలకు దక్కడానికి ఆస్కారం ఉందనీ, కొత్తగా నగరి నియోజకవర్గంలో గతంలో రద్దు చేసిన పుత్తూరు పాత అసెంబ్లీ స్థానానికి జీవం వస్తుందని అంచనా వేస్తున్నారు.
జగన్ కోటలో.. వారసులే...
కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఐదు, జనసేన ఒకటి, వైసీపీ, బీజేపీ ఒక స్థానం మూడు స్థానాల్లో ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ పాగా వేయడంలో టీడీపీ కూటమి సక్సెస్ అయిందని చెప్పవచ్చు. చరిత్రలో మొదటి సారి కడప అసెంబ్లీ స్థానం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా రెడ్డెప్పగారి మాధవీరెడ్డి విజయం సాధించారు. డీలిమిటేషన్ వల్ల కడప (1,32,431 మహిళా ఓటర్లు) తోపాటు జమ్మలమడుగు (1,25,158). ప్రొద్దుటూరు (1,23,509), రాయచోటి (1,22,679) మహిళలకు కేటాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జమ్మలమడుగులో బీజేపీ నేత సీ. ఆదినారాయణరెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి (వైసీపీ ), ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తోపాటు టీడీపీ నేతలు కూడా వారసులను తెరపైకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ఏ సంహం గర్జిస్తుంది.?
రాయలసీమకు నెల్లూరు జిల్లా రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. పది అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ, 2024 ఎన్నికల్లో టీడీపీకి ఏకపక్షంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇక్కడ రాజకీయమంతా పెద్ద రెడ్లదే. ఈసారి ఎన్నికల నాటికి పరిస్థితి భిన్నంగా మారే వాతావరణం కనిపిస్తోంది. నెల్లూరు రూరల్ లేదా కొత్తగా ఏర్పడే స్థానంలో తమ్ముడు గిరిధర్ రెడ్డిని పోటీ చేయించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆరాటం ఫలిస్తుందా? అనే సందేహం తెరపైకి వచ్చింది. ఈ స్థానం రానున్న ఎన్నికలకు మహిళలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కావలిలో టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఊరట దక్కుతుందని, గూడూరు ఎస్సీ రిజర్వుడు స్థానం తోపాటు, గతంలో రద్దు చేసిన రాపూరు, అల్లూరు నియోజకవర్గాలకు జీవం పోసే అవకాశలు ఉన్నట్లు రాజకీయ పరిశీలకుల అంచనా వేస్తున్నారు.
కొత్త నియోజకవర్గాలు ?
నియోజకవర్గాల పునర్విభవన తరువాత కొత్తవే కాకుండా పాత నియోజకవర్గాలు మళ్లీ ఊపిరి పోసుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వస్తున్నారు. వాటిలో
తూర్పు గోదావరి: అల్లవరం, బురదపేట, కడియం, సంపర,
పశ్చిమ గోదావరి: కడియం, అత్తిలి, కృష్ణామల్లేశ్వరం, ముదినేపల్లి,
గుంటూరు: కూచినపూడి, దుగ్గిరాల
కర్నూలు: కోయిలకుంట్ల
విజయవాడ: శివారుల్లో పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు
విశాఖపట్నం: భీమిలి, గాజువాక వంటి పెద్ద నియోజకవర్గాలను విభజించి పరవాడ, చింతపల్లి స్థానాలను ఏర్పాటుకు అవకాశం ఉంది.
పెద్ద నియోజకవర్గాల్లో చంద్రగిరి, రాప్తాడు, డోన్ విభజించి కొత్తవి ఏర్పాటు చేస్తారని అంచనా వేస్తున్నారు. వాటితో పాటు మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలను పరిగణలోకి తీసుకుంటారని, దీని వల్ల ఈ స్థానాలు మహిళలకు కేటాయిస్తారని భావిస్తున్నారు.
కర్నూలు జిల్లా: పాణ్యం, కర్నూలు, నంద్యాల, ఆదోని, ఆలూరు, బనగానపల్లె
కృష్ణా జిల్లా: పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, గన్నవరం, మైలవరం, విజయవాడ వెస్ట్
గుంటూరు జిల్లా: గుంటూరు ఈస్ట్, మంగళగిరి, గురజాల, గుంటూరు వెస్ట్
తెనాలి: ప్రత్తిపాడు, మాచర్ల, వినుకొండ
విశాఖపట్నం: గాజువాక, పెందుర్తి, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం ఈస్ట్,
రాజమహేంద్రవరం: సిటీ, రూరల్, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, కొత్తపేట, పాయకరావుపేట (ఎస్సీ), రంపచోడవరం (ఎస్టీ), పశ్చిమ గోదావరి జిల్లా
చింతలపూడి, భీమవరం, పోలవరం (ఎస్టీ), శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, విజయనగరం, ఒంగోలు (ప్రకాశం) నియోజకవర్గాలు ఉన్నట్లు రాజకీయ నేతలు అంచనాలు వేస్తున్నారు. పార్లమెంటులో రేపు జరిగే ఓటింగ్ తరువాత డీలిమిటేషన్ కమిటీ అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చే వరకు ఈ ఉత్కంఠకు తెరపడదు.