Courtesy AI
x

అనంతపురం: తాడిపత్రి టు రాప్తాడు.. ఏం జరుగుతోంది?

టీడీపీ నేతలు వైసీపీ ట్రాప్ లో పడుతున్నారా? ఫ్యాక్షన్ మూలాలు ఉన్న నేతల మధ్య మాటల యుద్ధం.


అనంతపురం జిల్లా.. ఒకప్పుడు ఫ్యాక్షన్ రక్తం చిందిన నేల! దశాబ్దాల పాటు బాంబుల మోత, కత్తుల స్వైర విహారంతో గజగజలాడింది. కొన్నేళ్లుగా శాంతిభద్రతలు గాడియి. జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తోంది. అని అనుకుంటున్న తరుణంలో.. మళ్లీ పాత కక్షలు, కొత్త రాజకీయ యుద్ధాలు జిల్లాను వార్తల్లో నిలిపాయి. ఇక్కడ ఎవరి ట్రాప్ లో ఎవరు పడుతున్నారనేది చర్చకు తెరతీసింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీడీపీ, వైసీపీ ప్రధాన నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ ఆజ్యం ఆ రెండు పార్టీల్లోని దళిత నేతల మధ్య మాటల యుద్ధంగా మారింది.

ఒకవైపు తాడిపత్రిలో ముఠా కక్షల సెగలు.. ఇంకోవైపు రాప్తాడులో హత్య రాజకీయాల కుట్రల ఆరోపణలు.. వెరసి అనంతపురం జిల్లా ఇప్పుడు మళ్లీ రాజకీయ అశాంతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.

ఫ్యాక్షన్ ఈనాటిది కాదు...

అనంతపురం ఫ్యాక్షనిజంలో కేవలం ఒకే కులం కాకుండా, ప్రాంతీయంగా బలమైన సామాజిక వర్గాలు ఆధిపత్యం కోసం పోరాడాయి. ప్రధానంగా రెండు కులాల నేతలు ఇందులో కీలక పాత్ర పోషించారు. ఇవి ఈ నాటివి కాదు.
అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిజం మూలాలు స్వాతంత్య్రానికి ముందే.. గ్రామీణ ప్రాంతాల్లోని భూస్వామ్య వివాదాలతో మొదలయ్యాయి. ఇది 1970, 1980ల నాటికి తీవ్రరూపం దాల్చి, రాజకీయ రంగు పులుముకున్నాయి. అది కూడా జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు రెండు ప్రధాన వర్గాల (కుటుంబాల) చుట్టూ కేంద్రీకృతమయ్యయి.

బలైంది ఎవరు..?

ఫ్యాక్షన్ గొడవలు పైస్థాయిలో రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల నేతల మధ్య ఆధిపత్య పోరుగా కనిపించినప్పటికీ... క్షేత్రస్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పేద ప్రజలు, కార్యకర్తలు వీరి వర్గపోరులో బలయ్యారు. ప్రస్తుతం పాత తరం ఫ్యాక్షన్ నేతలు చాలామంది మరణించడం లేదా రాజకీయాలకు దూరం కావడంతో, అనంతపురం జిల్లాలో పూర్వపు స్థాయి పగలు, బాంబుల సంస్కృతి గణనీయంగా తగ్గింది. పంటల సాగు వైపు దృష్టి సారించారు. పిల్లలు వృద్ధిలోకి రావడంతో ఐటీ రంగం వైపు మళ్లడం వల్ల అనంతపురం జీవనవిధానంగా కూడా మార్పు వచ్చింది. అయితే, తాజాగా చోటుచేసుకున్న ఘటనలు, తరచూ వివాదంగా మారి, మళ్లీ పాతకాలం వర్గపోరు పురుడు పోసుకుంటుందా? అనే సందేహాలు తెరమీదకు వచ్చాయి.

తాడిపత్రిలో ఆరని చిచ్చు

దశాబ్దాల కాలంగా సాగుతున్న ఈ ఇద్దరు నేతల వ్యక్తిగత, రాజకీయ యుద్ధం.. జేసీ ప్రభాకరరెడ్డి అనంతపురం నుంచి తాడిపత్రిలోకి ప్రవేశించాలనుకోవడం, పోలీసులు నిలువరించడం, పెద్దారెడ్డిది కూడా అదే తీరు కావడం వల్ల తరచూ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. జేసీ ప్రభాకరరెడ్డి కొడుకు అస్మిత్ రోడ్డి తాడిపత్రి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తండ్రి ప్రభాకరరెడ్డి మీడియా సమావేశాలు, ఛాలెంజ్ విసరడం వంటి వ్యవహారం కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఇది చాలదన్నట్లుగా మరో వివాదం తెరమీదకు వచ్చింది.

రాప్తాడులో రగిలిన వివాదం..

"నన్ను చంపడానికి కుట్ర పన్నారు" అంటూ వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో కార్చిచ్చు రగిల్చాయి. మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజును మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి టార్గెట్ చేశారు. దీంతో దళితుల మధ్య చీలికకు బీజం వేసింది.
ఈ రెండు సంఘటనలు పాత రోజులు గుర్తుకు తెప్పిస్తున్నాయనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. పోలీసు అధికారులు కూడా వర్గపోరును అణచడంలో అధికార, విపక్ష పార్టీలు అనే తేడా లేకుండా ఉక్కుపాదం మోపడం వల్ల శాంతిభద్రతలు గాడిలో ఉన్నాయి.
తాడిపత్రిలో జేసీ కుటుంబానికి, కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య ఉన్న గొడవ ఈనాటిది కాదు. దశాబ్దాలుగా తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ (దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి) ఏకఛత్రాధిపత్యం నడిచింది. వారికి స్థానికంగా గట్టి పోటీ అనడం కంటే పాతకక్షలు వైసీపీ నుంచి కేతిరెడ్డి రూపంలో ఎదురయ్యాయి.

2020 డిసెంబర్ నెలలో ఏమి జరిగింది?

2020 డిసెంబర్‌లో. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి.. నేరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద చేసిన అలజడి రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఒక సోషల్ మీడియా పోస్ట్ వివాదం కారణంగా పెద్దారెడ్డి నేరుగా జేసీ ఇంటిపైకే వెళ్లడం ఫ్యాక్షన్ శకానికి మళ్లీ ఊతమిచ్చింది. ఆ దాడి జరిగినప్పటి నుంచి తాడిపత్రిలో నివురు గప్పిన నిప్పులాంటి వాతావరణం ఉంది. ఎన్నికల్లో ఎవరు గెలిచినా, ఓడినా.. మున్సిపల్ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం, పోలీసు కేసుల పర్వం సాగుతూనే ఉంది. తాడిపత్రిలో ఏ చిన్న గొడవ జరిగినా.. అది జిల్లాకు వ్యాపిస్తోంది.

తోపుదుర్తి వ్యాఖ్యలు – దళిత వర్గాల మధ్య చీలిక

తాడిపత్రి సెగలు ఇలా ఉంటే.. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాలను మరో వివాద మలుపు తిప్పాయి.
"నా హత్యకు కుట్ర పన్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు" అంటూ తోపుదుర్తి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో మాటల యుద్ధం ప్రారంభమైంది. తోపుదుర్తి వ్యాఖ్యలపై రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కొడుకు పరిటాల శ్రీరాం తోపాటు వారి వర్గీయుల తీవ్రంగా మండిపడ్డారు. ఈ రాజకీయ వివాదం కాస్తా కులాల రంగు పులుముకుంది. టీడీపీలోని దళిత నేతలకు, వైసీపీలోని దళిత వర్గాలకు మధ్య తీవ్రమైన చిచ్చు పెట్టింది.
మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్. రాజును ఉద్దేశించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ఎమ్మెల్యే రాజు, టీడీపీ దళిత సామాజికవర్గం భగ్గుమంది.
"అనంతపురంలో నాకు రూ. కోట్ల విలువైన భవనాలు, బెంగళూరులో ఆస్తులు ఉన్నట్లు నిరూపించకుంటే మాదిగ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తా" అని టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్. రాజు తీవ్ర పదజాలంతో హెచ్చరించడం, దీనికి వైసీపీలోని దళిత సంఘాలు రియాక్ట్ కావడం ఫ్యాక్షన్ మూలాలు ఉన్న నేతల మధ్య చెలరేగిన ఘర్షణ దళితుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. దీంతో అనంతపురం జిల్లాలో దళిత సామాజికవర్గాల మధ్య ఒక స్పష్టమైన చీలికకు, అంతర్గత ఘర్షణలకు ఇది దారితీసింది.

బాబు సీరియస్ హెచ్చరిక

ఈ తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులపై దృష్టి పెడుతుంటే.. అనంతపురం లాంటి కీలక జిల్లాలో నేతల వ్యక్తిగత పంతాలు, పాత కక్షల వల్ల అశాంతి నెలకొనడంపై ఆయన సీరియస్ అయ్యారనేది పార్టీ వర్గాల సమాచారం.
"వైసీపీ పన్నుతున్న ట్రాప్‌లో పడకండి" అంటూ చంద్రబాబు కూటమి నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పునాది రాళ్లు పడిన పరిశ్రమలను వేగవంతం చేయడం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంపైనే దృష్టి పెట్టాలని, అనవసర వివాదాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి సీనియర్ నేతల తీరుపై కూడా అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

జిల్లాపై ప్రభావం ఏమిటి?

అనంతపురం జిల్లా బెంగళూరుకు దగ్గరగా ఉండటం వల్ల పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. కానీ, ఇలాంటి రాజకీయ ఉద్రిక్తతలు ఉంటే పెట్టుబడిదారులు వెనకడుగు వేసే ప్రమాదం ఉంది. రాజకీయాల కోసం దళిత సామాజిక వర్గాల మధ్య చీలికలు తేవడం వల్ల భవిష్యత్తులో అది తీవ్రమైన సామాజిక అశాంతికి దారితీసే అవకాశం కూడా లేకపోలేదనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అభివృద్దికి బీజాలు పడి, రాష్ట్రం ప్రధానంగా రాయలసీమ పారిశ్రామికంగా పురోగమిస్తున్న వేళ, ప్రజలు కూడా వర్గపోరును పట్టించుకోవడం లేదు. తాడిపత్రి, రాప్తాడు ఘర్షణలు జిల్లా అంతటా విస్తరిస్తే.. మళ్లీ పాత ఫ్యాక్షన్ రోజులు గుర్తొచ్చి సామాన్య ప్రజలు భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉంది. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు విరుగుడు మంత్రం వేస్తున్నారు. అందుకు నిదర్శనం పోలీసుల అప్రమత్తతే.
Read More
Next Story