
అమరావతి పొలిటికల్ వార్
పాలకుల పంతాల మధ్య నలిగిపోతున్న అమరావతి
అమరావతి.. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ప్రతిరూపంగా నిలవాల్సిన ప్రాంతం. దురదృష్టవశాత్తూ రాజకీయ పంతాలకు, బాహాబాహీలకు వేదికగా మారింది. ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో జరిగిన ఉద్రిక్తతలు చూస్తుంటే, రాజధాని రక్షణ కంటే రాజకీయ లబ్ధే పరమావధిగా సాగుతున్న చదరంగం స్పష్టంగా కనిపిస్తోంది. 2014లో రాష్ట్ర భవిష్యత్తు కోసం నమ్మి, తమ గుండెకాయ లాంటి మూడు పంటలు పండే బంగారు భూములను త్యాగం చేసిన అమరావతి రైతుల నిరీక్షణకు నేటికీ సంపూర్ణ మోక్షం లభించలేదు. చట్టాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా.. క్షేత్రస్థాయిలో సామాన్య రైతు మాత్రం పరిహారం, ప్లాట్ల అభివృద్ధి, తమ పిల్లల ఉపాధి కోసం ఇప్పటికీ రోడ్లపైనే పోరాడాల్సిన దుస్థితి నెలకొంది.
ఈ సుదీర్ఘ సందిగ్ధతకు ప్రధాన కారణం.. అమరావతిని రెండు ప్రధాన పార్టీలు ఒక ఎలక్షన్ టూల్ గా మార్చుకోవడమే. ఒకవైపు అధికార కూటమి అమరావతిని తమ ఏకైక ప్రతిష్టాత్మక అజెండాగా చూపిస్తూ రాజకీయ పట్టు సాధించాలని చూస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష వైసీపీ వికేంద్రీకరణ పేరుతో ప్రాంతీయ సెంటిమెంట్లు రేకెత్తిస్తూ తన ఓటు బ్యాంక్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు పార్టీల వ్యూహాత్మక దాడులు, ప్రతిదాడుల మధ్య రైతుల నిజమైన భావోద్వేగాలు, వారి ఆర్థిక సమస్యలు కొట్టుకుపోతున్నాయి. ఫలితంగా అమరావతి కేవలం ఒక భూభాగంగా కాకుండా, ఓటర్లను చీల్చే ఒక రాజకీయ ఆయుధంగా మిగిలిపోతోంది.
అయితే, తరచూ జరుగుతున్న ఈ కొట్లాటలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు భవిష్యత్తులో రాష్ట్రానికి జరిగే కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని సూచిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థల నుండి వేల కోట్ల నిధులు వస్తున్న తరుణంలో .. ఇలాంటి అశాంతి వాతావరణం ఉంటే ఏ పెద్ద ఇన్వెస్టర్ కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాడు. పెట్టుబడిదారులు ఎప్పుడూ రాజకీయ స్థిరత్వం, ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటారు. ఇప్పటికైనా ఇరు పార్టీలు స్వార్థ రాజకీయాలు పక్కనపెట్టి, భూములివ్వని రైతులతో బలవంతపు సేకరణ కాకుండా స్నేహపూర్వక చర్చలు జరపాలి. రాజకీయ కక్షల కంటే రాష్ట్ర అభివృద్ధి, యువత ఉపాధి ముఖ్యం అని భావించినప్పుడే అమరావతికి, ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత ప్రశాంతత లభిస్తుంది.
Next Story

