ఏపీలో వ్యవసాయ సంక్షోభం..కుదేలవుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
x

ఏపీలో వ్యవసాయ సంక్షోభం..కుదేలవుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ

రాష్ట్రం ప్రస్తుతం తీవ్రమైన వ్యవసాయ సంక్షోభంలో ఉందని, ఇది మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తిరోగమనంలోకి నెట్టేస్తోందని ఎంవీఎస్ నాగిరెడ్డి ఆక్షేపించారు.


రాష్ట్ర ఖజానాకు వచ్చే పన్ను ఆదాయం పడిపోతోందని, అప్పుల కుప్ప మాత్రం అంతకంతకూ పెరుగుతోందని, సాగు విస్తీర్ణం పెరిగినా దిగుబడిలో మాత్రం తిరోగమనం కనిపిస్తోందని, ఇలా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం ప్రస్తుతం పెను సంక్షోభంలో కూరుకుపోయిందని, దీని ప్రభావంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి గణాంకాలతో సహా హెచ్చరించారు. బడ్జెట్ అంచనాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు అస్సలు పొంతన లేదని.. కేవలం మార్కెటింగ్ వైఫల్యం వల్లే అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఒకప్పుడు హార్టికల్చర్ హబ్ గా వెలుగొందిన రాయలసీమ సైతం నేడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వెనకబడిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

పడిపోతున్న ఆదాయం.. పెరుగుతున్న అప్పులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, వాస్తవ పరిస్థితి చూస్తే ఆదాయం గణనీయంగా పడిపోయిందని తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మాట్లాడుతూ ఎంవీఎస్ నాగిరెడ్డి గణాంకాలతో సహా ఎండగట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ వసూళ్లలో సుమారు రూ. 21,073 కోట్ల భారీ లోటు కనిపిస్తోందని, అంటే దాదాపు 6 శాతం మేర ఆదాయం తగ్గిపోయిందని ఆయన వివరించారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు అద్దం పట్టే పన్ను వసూళ్లలో పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ అంచనాల్లో పన్నుల ద్వారా రూ. 1,28,126 కోట్లు వస్తాయని ప్రభుత్వం ఆశ చూపినప్పటికీ, సవరించిన లెక్కల ప్రకారం అది రూ. 1,11,865 కోట్లకు పడిపోయింది. కేవలం తొమ్మిది నెలల కాలంలోనే పన్ను ఆదాయం 12.69 శాతం మేర క్షీణించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఆక్షేపించారు.
ఆదాయం లేకున్నా ఆగని అప్పుల వేట
మరోవైపు ఆదాయ వనరులు ఎండిపోతున్నా, ప్రభుత్వం అప్పులు చేయడంలో మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని నాగిరెడ్డి ధ్వజమెత్తారు. ఏడాది మొత్తానికి రూ. 78,205 కోట్లు అప్పు తీసుకుంటామని బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, కేవలం తొమ్మిది నెలల్లోనే ఆ పరిమితిని మించి ఏకంగా రూ. 79,456 కోట్లను అప్పుగా తెచ్చిందని విమర్శించారు. ఆదాయం తగ్గుతున్న తరుణంలో అప్పుల భారం ఈ స్థాయిలో పెరగడం వల్ల రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తోందని, ఇది నేరుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై , అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.
సాగు పెరిగినా.. దిగుబడి నిల్
కేంద్ర వ్యవసాయ శాఖ (Unified Portal for Statistics) డేటాను ఉటంకిస్తూ నాగిరెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం 1.65 లక్షల హెక్టార్లు పెరిగింది. సాగు పెరిగిన లెక్కన 9 లక్షల టన్నుల దిగుబడి పెరగాలి, కానీ ఉత్పత్తి మాత్రం లక్ష టన్ను కూడా పెరగలేదు. ఎరువుల ధరలు పెరగడం, యూరియా బ్లాక్ మార్కెట్ కావడం వల్ల రైతుకు ఖర్చు పెరిగింది తప్ప లాభం లేదని పేర్కొన్నారు. మొంథా తుపాను వల్ల పత్తి ఉత్పత్తి 4-5 క్వింటాళ్లకు పడిపోయింది. రూ. 8,110 మద్దతు ధర ఉండగా, క్వాలిటీ లేదని రూ. 5-6 వేలకే కొంటున్నారు. వేరుసెనగ సాగు విస్తీర్ణం 5.72 లక్షల హెక్టార్ల నుంచి 2.08 లక్షలకు ( 42%) పడిపోయిందన్నారు.
రైతు భరోసా కేంద్రాల (RBK) నిర్వీర్యం
గత ప్రభుత్వంలో రైతులకు అండగా ఉన్న RBKలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని నాగిరెడ్డి ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణ ప్రక్రియ అంతా మధ్యవర్తులు, మిల్లర్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. గతంలో రవాణా, కాటా కూలీ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో పడేవని, ఈసారి ఆ నిధులు కూడా అందడం లేదని తెలిపారు.
రాయలసీమ .. హార్టికల్చర్ హబ్
ప్రస్తుత ప్రభుత్వం సీమను హార్టికల్చర్ హబ్‌గా చేస్తామనడంపై ఆయన స్పందిస్తూ.. అది వైఎస్సార్, జగన్ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. వైఎస్సార్ ఇచ్చిన ఉచిత విద్యుత్, జగన్ ఇచ్చిన పగలు 9 గంటల విద్యుత్ వల్లే సీమలో ఉద్యానవన పంటలు పెరిగాయన్నారు. ప్రస్తుతం సమస్య ఉత్పత్తిలో లేదని, మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం వల్లే సంక్షోభం వస్తోందని విశ్లేషించారు. గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కార్మికుల దగ్గర డబ్బు ఉంటేనే చిన్న వ్యాపారాలు బాగుంటాయి. గత 20 నెలల్లో రాష్ట్రంలో ఎకరం భూమి ధర కూడా పెరగలేదంటేనే వ్యవసాయం ఎంత సంక్షోభంలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని నాగిరెడ్డి పేర్కొన్నారు.
Read More
Next Story