AAP ఎంపీల బీజేపీ చేరికపై వివాదం..
x
Sanjay Singh

AAP ఎంపీల బీజేపీ చేరికపై వివాదం..

“రాజ్యాంగ విరుద్ధం” అంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు


Click the Play button to hear this message in audio format

రాఘవ్ చద్దా (Raghav Chadha) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీలు బీజేపీలో విలీనమవుతున్నట్లు ప్రకటించిన వెంటనే రాజకీయ వివాదం చెలరేగింది. ఈ చర్యను AAP శనివారం (ఏప్రిల్ 25) “రాజ్యాంగ విరుద్ధం”గా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో ఆ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరనున్నట్లు పార్టీ తెలిపింది.

“ఫిరాయింపుల చట్టానికి విరుద్ధం”..

AAP సీనియర్ నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించారు. “రాజ్యసభ, లోక్‌సభలో ఎలాంటి చీలికలు లేదా వర్గపోరాటాలు చెల్లవని ఫిరాయింపుల నిరోధక చట్టం స్పష్టంగా చెబుతోంది. ఏడుగురు ఎంపీలు తీసుకున్న నిర్ణయం పూర్తిగా ‘రాజ్యాంగ విరుద్ధం’, ‘చట్టవిరుద్ధం’. వారిని అనర్హులుగా ప్రకటించాలని నేను ఉపరాష్ట్రపతికి, రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాస్తున్నాను,” అని సింగ్ వెల్లడించారు.

సంజయ్ సింగ్ ప్రకారం.. “పదవ షెడ్యూల్ గానీ, ఫిరాయింపుల నిరోధక చట్టం గానీ, శాసనసభల్లో ఎలాంటి విభజన లేదా వర్గాలను గుర్తించవు. కాబట్టి ఈ చర్య చెల్లుబాటు కాదు” అని ఆయన స్పష్టం చేశారు.

పదో షెడ్యూల్ ఏమి చెబుతోంది?

అయితే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం, కొన్ని పరిస్థితుల్లో పార్టీ విలీనాన్ని చెల్లుబాటు చేయవచ్చు. సంబంధిత శాసనసభ పార్టీలో కనీసం మూడింట రెండు వంతుల సభ్యులు అంగీకరిస్తే, ఆ విలీనాన్ని చట్టబద్ధంగా పరిగణిస్తారు. ఈ నిబంధన ప్రకారం..“సంబంధిత శాసనసభ పార్టీలోని మూడింట రెండు వంతుల కంటే తక్కువ కాని సభ్యులు అంగీకరిస్తే మాత్రమే విలీనం చెల్లుబాటు అవుతుంది” అని స్పష్టం చేస్తుంది. ఈ సందర్భంలో అటువంటి సభ్యులు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుంది.

చట్టంపై భిన్నాభిప్రాయాలు..

ఇక్కడే ప్రధాన వివాదం నడుస్తుంది. ఒకవైపు AAP నాయకత్వం ఈ చర్యను పూర్తిగా చట్టవిరుద్ధమని చెబుతుండగా, మరోవైపు పదవ షెడ్యూల్ ప్రకారం మూడింట రెండు వంతుల మద్దతు ఉంటే విలీనం చెల్లుబాటు అవుతుందని న్యాయ నిబంధనలు సూచిస్తున్నాయి.

ఇదీ జరిగింది..

రాఘవ్ చద్దాతో పాటు మరో ఆరుగురు ఆప్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆప్‌కు చెందిన మొత్తం 10 మంది రాజ్యసభ ఎంపీలలో ఏడుగురు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో చద్దా మాట్లాడుతూ.. పార్టీ నుంచి బయటకు రావడం తప్ప మరో గత్యంతరం లేదని చెప్పారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజ్యసభలో నిర్ణయానికి రావాల్సి ఉంది.

ప్రతిపక్షం ఇచ్చే ఫిర్యాదులు, చట్టపరమైన నిబంధనలు, సభ్యుల సంఖ్యపై ఆధారపడి తుది నిర్ణయం ఉండబోతుంది.

Read More
Next Story