తమిళనాడు రాజకీయ యవనికపై దళపతి విజయ్ నడిపిస్తున్న కొత్త శకంలో ఒక తెలుగు ఆడపడుచుకి కీలక అవకాశం దక్కింది. శివకాశి నియోజకవర్గం నుంచి టీవీకే ఎమ్మెల్యేగా గెలుపొందిన సెల్వి ఎస్. కీర్తన, ఆ రాష్ట్ర కేబినెట్‌లోనే అతి పిన్న వయస్కురాలైన మంత్రిగా బాధ్యతలు చేపట్టి సంచలనం సృష్టించారు. 1957 తర్వాత శివకాశి గడ్డపై ఒక మహిళా ఎమ్మెల్యే గెలవడమే అసాధ్యమనుకున్న 69 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ, అసాధారణ విజయంతో ఆమె చరిత్ర పుటల్లోకెక్కారు. విజయ్ కేబినెట్‌లో యువత, మహిళా ప్రాతినిధ్యానికి నిదర్శనంగా నిలిచిన కీర్తన, కేవలం ఒక శాసనసభ్యురాలిగా మాత్రమే కాకుండా, మంత్రిగా తమిళ రాజకీయాల్లో తెలుగు వారి సత్తాను చాటుతున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడి, తొలి ప్రయత్నంలోనే కోటను కొల్లగొట్టిన ఈ యంగ్ లీడర్ ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారారు.
విజయ్ నమ్మకం.. మంత్రిగా ప్రమోషన్
సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, తొలి ప్రయత్నంలోనే ప్రభంజనం సృష్టించిన టీవీకే అధినేత విజయ్‌కు కీర్తన అత్యంత సన్నిహితురాలు, నమ్మకస్థురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఆమెలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన విజయ్, కేవలం ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా, తన కేబినెట్‌లో ఆమెకు చోటు కల్పించారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అదే వేదికపై కీర్తన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఆమె రాజకీయ ఎదుగుదలకు నిదర్శనం.
తెలుగు రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు
కీర్తన తెలుగు అమ్మాయి కావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు, నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో రాజకీయ జెండా పాతడమే కాకుండా, ఒక నియోజకవర్గ చరిత్రను మార్చివేస్తూ మంత్రి స్థాయికి చేరడం అభినందనీయమని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తమిళ రాజకీయాల్లో తెలుగు వారి ముద్రను కీర్తన మరోసారి చాటిచెప్పారు.
కూటమి సారథిగా విజయ్ పట్టాభిషేకం
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ 'మిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్ (థలపతి విజయ్) మే 10, 2026న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఒంటరిగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మేజిక్ ఫిగర్ 118కి స్వల్ప దూరంలో నిలిచినప్పటికీ, కాంగ్రెస్ మరియు వీసీకే పార్టీల మద్దతుతో విజయ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంతో పాటు ఆయన పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టి, రాష్ట్ర పాలనలో కొత్త రక్తాన్ని నింపారు.
తొలి రోజే సంక్షేమ సంతకాలు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ తన మార్క్ పాలనను చాటుతూ మూడు కీలక నిర్ణయాలపై తొలి సంతకాలు చేశారు. సాధారణ ప్రజలకు భారీ ఉపశమనం కలిగిస్తూ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించారు. ఇక మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేకంగా సింగప్పెణ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు సమాజానికి పెను సవాలుగా మారిన మాదకద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు యాంటీ డ్రగ్స్ స్పెషల్ వింగ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టి, తన ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకున్నారు.
శివకాశిలో తెలుగుమ్మాయి చారిత్రక రికార్డు
ఈ ఎన్నికల్లో శివకాశి నియోజకవర్గం ఒక అసాధారణ విజయానికి వేదికైంది. టీవీకే అభ్యర్థిగా బరిలోకి దిగిన 29 ఏళ్ల ఎస్. కీర్తన, హేమాహేమీలను ఢీకొట్టి సంచలనం సృష్టించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఏ.ఎం.ఎస్.జి. అశోకన్‌ను సుమారు 11,670 ఓట్ల తేడాతో ఓడించి రికార్డు సృష్టించారు. తెలుగు మూలాలున్న కీర్తన సాధించిన ఈ విజయంతో, గత ఏడు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో కొనసాగుతున్న పురుషుల ఆధిపత్యానికి తెరపడింది. శివకాశి కోటలో తెలుగుమ్మాయి జెండా పాతడం ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏడు దశాబ్దాల నిరీక్షణకు తెర..మహిళా శక్తి చాటిన కీర్తన
కీర్తన సాధించిన విజయం కేవలం ఒక గెలుపు మాత్రమే కాదు, అది ఒక చారిత్రక పరిణామం. 1957 తర్వాత శివకాశి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. 69 ఏళ్ల తర్వాత ఆ నియోజకవర్గ ప్రజలు ఒక మహిళా ప్రతినిధికి పట్టం కట్టడం విశేషం. అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా, విజయ్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కీర్తన.. భవిష్యత్ రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యానికి ఒక నిదర్శనంగా నిలిచారు. పాత రికార్డులను చెరిపివేస్తూ ఆమె నడిపిస్తున్న ఈ ప్రస్థానం యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.