వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు
x

వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు

మహానాడులో లోకేశ్ బిగ్ అనౌన్స్‌మెంట్


తెలుగుదేశం పార్టీ వార్షిక రాజకీయ పండుగ మహానాడు వేదికగా ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ ఒక విప్లవాత్మకమైన ప్రకటన చేశారు. ఉదయం నుంచే సోషల్ మీడియా వేదికగా ఆయన ఇవ్వబోతున్న బిగ్ అనౌన్స్‌మెంట్ (Big Announcement) ఏంటా అని ఎదురుచూస్తున్న రాజకీయ వర్గాలకు, ముఖ్యంగా మహిళా లోకానికి ఆయన భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చినా, రాకపోయినా.. రాబోయే 2029 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని లోకేశ్ అధికారికంగా ప్రకటించి చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఇది కేవలం స్లోగన్ కాదు..మా కమిట్‌మెంట్
మహానాడు సభలో లోకేశ్ మాట్లాడుతూ.. మహిళా సాధికారత అనేది కేవలం ఎన్నికల నినాదం కాదని, అది భారతదేశ భవిష్యత్తుపై తమకున్న నిబద్ధత అని స్పష్టం చేశారు. మనకు మరింత మంది మహిళా చట్టసభ సభ్యులు, మహిళా నాయకులు, విధాన నిర్ణేతలు అవసరం. అందుకే ఏ చట్టాలతోనూ సంబంధం లేకుండా టిడిపి తరఫున ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటున్నాం. ఇది మా సంకల్పం, మా బాధ్యత అని ఆయన ప్రకటించారు. భారత రాజకీయాల్లో రాబోయే కాలం మహిళల నాయకత్వానిదేనని తాను బలంగా నమ్ముతున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.
లబ్ధిదారులుగా కాదు..నిర్ణేతలుగా మార్చడమే లక్ష్యం
ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు మహిళలు కేవలం లబ్ధిదారులుగా (Beneficiaries) ఉండిపోవడం తమకు ఇష్టం లేదని, వారు రాజకీయాల్లో, ప్రభుత్వ పాలనలో కీలక నిర్ణేతలుగా (Decision Makers) ఎదగాలన్నదే టిడిపి విజన్ అని లోకేశ్ స్పష్టం చేశారు. చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మహిళా రిజర్వేషన్ల గురించి గొప్పగా మాట్లాడి, ఆ తర్వాత వాటిని పక్కన పెడతాయని విమర్శించారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మాటలకే పరిమితం కాకుండా.. ఆచరణలో చూపిస్తుందని, దానికి ఈ 33 శాతం సీట్ల కేటాయింపు ప్రకటన ఒక సజీవ సాక్ష్యమని ఆయన కొనియాడారు.
ఎన్టీఆర్, చంద్రబాబుల వారసత్వమే ఈ స్త్రీ శక్తి
మహిళా సాధికారతకు టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు బలమైన పునాదులను వేశారని లోకేశ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. నాడు ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడంతో పాటు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మహిళా పద్మావతి యూనివర్సిటీని స్థాపించారని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు, డ్వాక్రా (DWCRA) గ్రూపుల ద్వారా కోట్లాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపారని.. అదే వారసత్వాన్ని తాము ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు.
వైసీపీకి సవాల్.. అభివృద్ధిపై చర్చకు సిద్ధం
తన ప్రసంగంలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపై లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత వైసీపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ నేతలపై జరిగిన వేధింపులను ప్రస్తావిస్తూ.. ఇప్పుడు రాష్ట్రానికి చంద్రబాబు గారి కృషి వల్లే పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసురుతూ.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు నేను సిద్ధం, డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేయండి అంటూ లోకేశ్ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలో ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫైటర్ జెట్ తయారీ వంటి భవిష్యత్తు రంగాలు ఏపీకి రాబోతున్నాయని లోకేష్ వెల్లడించారు.
Read More
Next Story