
ప్రధానమంత్రి మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చేలా ఉన్న ఏఐ క్రియేటివ్ చిత్రం
డీలిమిటేషన్ పై టీడీపీ,జనసేన, వైసీపీల 'ఐక్యతారాగం'!
మోదీకి మద్దతుపై టీడీపీ, జనసేన, వైసీపీ జై!
రాష్ట్ర రాజకీయాల్లో ఉప్పు-నిప్పులా తలపడే తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి జై కొట్టడంలో ఐక్యతా రాగాన్ని వినిపిస్తున్నాయి. జాతీయ ప్రయోజనాల పేరిట ఒకే బాటలో పయనిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే ‘నారీ శక్తి వందన్ అధినియం’ (మహిళా రిజర్వేషన్ బిల్లు), నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ (డీలిమిటేషన్) బిల్లులకు ఈ 3 పార్టీలు ముక్తకంఠంతో మద్దతు ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఒకే మాట.. ఒకే బాట!
మహిళా రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేయాలన్న మోదీ ప్రభుత్వ సంకల్పానికి ఏపీలోని అధికార కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ)తో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా సానుకూలంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల పెంపులో అన్యాయం జరుగుతుందన్న విపక్ష 'ఇండియా' కూటమి ఆందోళనల వేళ.. ఏపీ పార్టీలు కేంద్రం ఇస్తున్న హామీలపై నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి.
సీట్ల పెంపుపై సందేహాల నివృత్తి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన కూటమి నేతల భేటీ ఈ విషయంలో కీలక మలుపుగా నిలిచింది. దక్షిణాదికి అన్యాయం జరగదు అని ఆయన తేల్చేశారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయన్న భయాలను కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ తో చంద్రబాబు ఫోన్లో చర్చించి నివృత్తి చేసుకున్నారు. అదే మాట అటు పవన్ కల్యాణ్ కి ఇటు బీజేపీ నేత మాధవ్ కి కూడా చెప్పారు.
ప్రస్తుతమున్న లోక్‌సభ స్థానాల్లో ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెరుగుతాయని, ఇది జనాభాతో సంబంధం లేకుండా జరుగుతుందని కేంద్రం స్పష్టత ఇవ్వడంతో కూటమి నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.
వైసీపీ వైఖరి...
రాష్ట్రంలో అధికార కూటమితో రాజకీయంగా విభేదిస్తున్నప్పటికీ, కేంద్రం తెచ్చిన ఈ కీలక బిల్లుల విషయంలో వైసీపీ (YSRCP) కూడా సానుకూల వైఖరినే ప్రదర్శిస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతించారు. మహిళా రిజర్వేషన్లు 2029 నుంచే అమల్లోకి రావాలన్న కేంద్ర నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగడం ప్రజాస్వామ్యానికి శుభసూచకమని ఆయన పేర్కొన్నారు.
తన హయాంలో నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని, అదే స్ఫూర్తితో కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
డీలిమిటేషన్‌పై వైసీపీ ఎంపీల వాదన
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) విషయంలో వైసీపీ ఎంపీలు లోక్‌సభలో తమ గళం వినిపిస్తారు. దక్షిణాదికి భరోసా ఇవ్వాలని కోరతారు. జనాభా నియంత్రణలో ముందున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు లోక్‌సభ స్థానాల సంఖ్యలో ఎలాంటి అన్యాయం జరగకూడదని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కూటమి నేతల మాదిరిగానే, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, న్యాయ శాఖ మంత్రులతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. జనాభా ప్రాతిపదికన కాకుండా, ప్రతి రాష్ట్రానికి సమానంగా (50 శాతం పెంపు) స్థానాలు పెరుగుతాయన్న హామీతో వీరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఓటింగ్ విషయంలో వ్యూహం
'ఇండియా' కూటమి ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నప్పటికీ, వైసీపీ మాత్రం బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, బిల్లు ఆమోదం పొందే సమయంలో సభలో ఉండి ఓటు వేస్తారా? లేక బయటకు వస్తారా? అన్నది ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ తీసుకునే తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
కేంద్రానికి ఏపీ పార్టీల మద్దతు ఎందుకు కీలకం?
రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. లోక్‌సభలో ఎన్డీఏకు 292 మంది బలం ఉండగా, బిల్లు నెగ్గాలంటే మరో 68 మంది మద్దతు కావాలి.
రాజ్యసభలో 24 మంది సభ్యుల అదనపు మద్దతు అవసరం. ఈ తరుణంలో విపక్ష 'ఇండియా' కూటమి బిల్లును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, ఏపీకి చెందిన ఎంపీల మద్దతు మోదీ ప్రభుత్వానికి అత్యంత కీలకం కానుంది.
వదంతులకు చెక్..
ఉత్తరాది రాష్ట్రాల రాజకీయాధికారం పెరిగిపోతుందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఏపీ పార్టీలు కొట్టిపారేస్తున్నాయి. దామాషా పద్ధతిలో సీట్ల పెంపు ఉండటం వల్ల దక్షిణాదికే లబ్ధి చేకూరుతుందని కేంద్రం చెబుతున్న మాటలను నమ్మి, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఏపీ రాజకీయ పక్షాలు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
విపక్షాలు (కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి) చేస్తున్న 'దక్షిణాదికి అన్యాయం' అనే ఆరోపణలను ఏపీలోని అన్ని పార్టీలు ఏకతాటిపై నిలబడి తిప్పికొడుతుండటం గమనార్హం.
Next Story

