ఆ ఫూల్ చెబితే యుద్ధం ఆపుతామా! ట్రంప్ పై చెలరేగిన ఇరాన్
x

ఆ 'ఫూల్' చెబితే యుద్ధం ఆపుతామా! ట్రంప్ పై చెలరేగిన ఇరాన్

ఒప్పందమా? యుద్ధమా? ట్రంప్ అల్టిమేటంపై పాకిస్థాన్ మధ్యవర్తిత్వం - ఉత్కంఠలో ప్రపంచ దేశాలు


ఇరాన్-అమెరికా మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "శాంతి ఒప్పందం" గురించి ఆశాభావం వ్యక్తం చేస్తూనే, మరోవైపు ఇరాన్ పీచమణుస్తామన్నట్లుగా చేస్తున్న హెచ్చరికలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. దీనికి ఇరాన్ ఇచ్చిన ఘాటు సమాధానం దౌత్యపరమైన మర్యాదలను దాటి, యుద్ధ క్షేత్రంలో పంతాలకు దారితీస్తోంది.

ట్రంప్ అల్టిమేటం- ఇరాన్ తిరుగుబాటు

బుధవారం వైట్ హౌస్ వేదికగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్ ఆగ్రహానికి కారణమయ్యాయి. "యుద్ధం మా అదుపులోనే ఉంది, చాలా స్మూత్‌గా సాగుతోంది. త్వరలోనే ఒప్పందం కుదురుతుంది, లేదంటే ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో ఘోరమైన బాంబు దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని ట్రంప్ హెచ్చరించారు.

దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయీ స్పందిస్తూ.. "యుద్ధం ఎప్పుడు ఆపాలో మాకు తెలుసు. ఎవరో 'ఫూల్' చెప్పినంత మాత్రాన మేము వెనక్కి తగ్గం" అని వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతిపాదనలు ప్రస్తుతం తమ పరిశీలనలో ఉన్నాయని, తుది నిర్ణయాన్ని మధ్యవర్తిగా ఉన్న పాకిస్థాన్‌కు త్వరలోనే తెలియజేస్తామని స్పష్టం చేశారు.

హర్ముజ్ జలసంధి: కొత్త రణక్షేత్రం

వ్యూహాత్మకమైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) పై పట్టు కోసం ఇరాన్ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఈ మార్గం గుండా వెళ్లే ప్రతి అంతర్జాతీయ నౌక ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) అనుమతి తీసుకోవడమే కాకుండా, ప్రత్యేక రుసుం చెల్లించాలని ఇరాన్ కొత్త నిబంధనలు పెట్టింది.
ఇరాన్ చర్యలను అడ్డుకునేందుకు ఫ్రాన్స్ తన అణుశక్తితో పనిచేసే విమానవాహక నౌక 'చార్లెస్ డి గాలే' (Charles de Gaulle) ను ఎర్ర సముద్రం వైపు మళ్లించింది. దాదాపు 40 దేశాల సంయుక్త దళం ఈ జలసంధిలో స్వేచ్ఛా నౌకాయానాన్ని పునరుద్ధరించేందుకు సిద్ధమవుతోంది.

కాల్పుల విరమణ.. కేవలం కాగితాలకేనా?

లెబనాన్, గాజాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఏప్రిల్ 17న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ ఇజ్రాయెల్ తాజాగా బీరూట్‌పై దాడులు చేసింది. హిజ్బుల్లాకు చెందిన 'రద్వాన్ ఫోర్స్' కమాండరే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం.
దక్షిణ లెబనాన్‌లోని క్రైస్తవ పట్టణాల్లో ఇజ్రాయెల్ సైనికులు మతపరమైన విగ్రహాలను అవమానించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. దీనిపై కెనడా, ఫ్రాన్స్ వంటి దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

అణు అంశంపై తగ్గని ఇరాన్

ట్రంప్ ప్రధాన డిమాండ్ ఏంటంటే.. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికాకు లేదా వేరే దేశానికి తరలించాలి. అయితే, ఇరాన్ దీనిని 'రెడ్ లైన్'గా ప్రకటించింది. అణు శక్తిని వదులుకునే ప్రసక్తే లేదని, ఇది తమ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయమని ఇరాన్ తేల్చి చెప్పింది.
ప్రస్తుతానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నప్పటికీ, ఇరు దేశాల నేతల మధ్య మాటల యుద్ధం తగ్గుముఖం పట్టడం లేదు. ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లేలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చూస్తుండగా, ఇరాన్ మాత్రం తన పంతం నెగ్గించుకోవాలని చూస్తోంది. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ చమురు ధరలపై, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి.
Read More
Next Story