
యూఎస్ఏ: హిందువుల ఊచకోతకు కుట్ర
19 ఏళ్ల అమెరికన్ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
అమెరికాలో హిందూ ప్రార్థనా స్థలంపై దాడికి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇల్లినాయిస్లోని అరోరా ప్రాంతంలో ఈ దాడికి ప్రణాళిక రూపొందించినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడి నుంచి తుపాకులు, వందల సంఖ్యలో తూటాలు, బాడీ ఆర్మర్‌తో పాటు తీవ్రవాద భావజాలాన్ని సూచించే పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పాలటైన్‌కు చెందిన అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్‌ను అక్టోబర్ 11న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసులకు అందిన సమాచారం ఈ కేసులో కీలకంగా మారింది. నిందితుడు సామూహిక కాల్పులకు సంబంధించిన ప్రణాళిక గురించి ఎలక్ట్రానిక్ సందేశాలు పంపినట్లు అధికారులు గుర్తించారు. రైఫిల్, తూటాల మ్యాగజైన్లు, బాడీ ఆర్మర్ వంటి పరికరాలకు సంబంధించిన చిత్రాలను కూడా అతడు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ సమాచారంతో పాలటైన్, మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడి నివాసంలో తనిఖీలు నిర్వహించి రైఫిల్, లోడ్ చేసిన మ్యాగజైన్లు, వందలాది అదనపు తూటాలు, ఇతర వ్యూహాత్మక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. తెల్లజాతి ఆధిపత్య భావజాలానికి సంబంధించిన గుర్తులున్న బాడీ ఆర్మర్‌ను కూడా గుర్తించారు.
నిందితుడి వద్ద లభించినట్లు చెబుతున్న పత్రాల్లో శ్వేతజాతి ఆధిపత్యం, తీవ్రవాద భావజాలంతో పాటు దక్షిణాసియా ప్రజలు, ముఖ్యంగా భారతీయ సంతతికి చెందిన వారిపై హింసకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 11న అరోరాలోని హిందూ ప్రార్థనా స్థలంపై దాడి చేయాలనే ఉద్దేశంతో నిందితుడు ప్రణాళిక రూపొందించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే, అతడు లక్ష్యంగా చేసుకున్న నిర్దిష్ట ప్రార్థనా స్థలం ఏదో ఇంకా స్పష్టత రాలేదు.
ఈ ఘటన నేపథ్యంలో అరోరా పోలీసులు స్థానిక హిందూ ప్రార్థనా స్థలాల నిర్వాహకులను అప్రమత్తం చేశారు. నిందితుడిపై ఉగ్రవాద బెదిరింపులకు సంబంధించి ఒకటి, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు మరొకటి.. మొత్తం రెండు అభియోగాలు నమోదు చేశారు. దర్యాప్తు ఆధారంగా మరిన్ని అభియోగాలు నమోదు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ కేసు విచారణలో ఎఫ్‌బీఐ కూడా స్థానిక పోలీసులకు సహకరిస్తోంది.
అక్టోబర్ 14న జరిగిన విచారణ సందర్భంగా నిందితుడిని కస్టడీలోనే ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేశారు. ప్రస్తుతం ప్రజలకు తక్షణ ముప్పు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు గుర్తించలేదని అధికారులు వెల్లడించారు.
హిందూ పండుగల సమయంలో ఈ ఘటన వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకుముందు ఒహియోలోని రిచ్మండ్ హైట్స్‌లో శ్రీ స్వామినారాయణ వడ్తాల్ ధామ్ హిందూ మందిర్ ధ్వంసానికి గురైన ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రార్థనా స్థలాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ప్రజలకు సూచించింది.

