
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు
మళ్లీ ముదురుతున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇరవై మంది సైనికులు మృతి
జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా నేవీ ఇరాన్‌లోని కీలక సైనిక లక్ష్యాలపై భారీ స్థాయిలో ప్రతీకార దాడులు చేపట్టింది. అమెరికా-సౌదీ అరేబియా సమన్వయంతో ఈ ఆపరేషన్ జరిగినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో కనీసం 20 మంది ఇరాన్ సైనికులతో పాటు మరో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. దాడులు జరిగిన విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా కూడా ధృవీకరించింది.
హార్ముజ్ జలసంధి సమీపంలోని చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన ఖేష్మ్ ద్వీపం, అలాగే ఖుజేస్తాన్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాలు అమెరికా దాడులకు గురైనట్లు ఇరాన్ మీడియా పేర్కొంది.
ఈజిప్ట్‌పైనా డ్రోన్ దాడులు
మరోవైపు ఈజిప్ట్‌లోని పలు పోర్టులపై కూడా డ్రోన్ దాడులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో రెండు పెట్రోలియం కేంద్రాల్లో భారీ అగ్నిప్రమాదాలు సంభవించినట్లు బ్రిటన్‌కు చెందిన ఓ సముద్ర భద్రతా సంస్థ వెల్లడించింది. అదే సమయంలో గ్రీక్‌కు చెందిన ఓ చమురు ట్యాంకర్‌పై కూడా దాడి జరిగినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలకు ఇప్పటివరకు ఏ సంస్థా బాధ్యత స్వీకరించలేదు.
ఈజిప్ట్‌పై జరిగిన దాడుల వెనుక ఇరాన్ లేదా దాని మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూపుల ప్రమేయం ఉన్నట్లు తేలితే, ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు తటస్థ వైఖరి అవలంబించిన ఈజిప్ట్ కూడా తాజా పరిణామాల నేపథ్యంలో తన వ్యూహాన్ని మార్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ దేశాలు హౌతీలపై దాడులతో పాటు ఇరాన్‌కు వ్యతిరేక చర్యల్లో భాగస్వాములవుతున్నాయి.
ట్రంప్ హెచ్చరిక
బాబ్ ఎల్-మాండేబ్, హార్ముజ్ జలసంధుల్లో నౌకలపై జరుగుతున్న దాడులకు ఇరానే పూర్తి బాధ్యత వహించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అవసరమైతే మరింత భారీ స్థాయిలో సైనిక చర్యలకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, సౌదీ అరేబియాలోని చమురు కేంద్రాలపై ఇరాన్ మద్దతు ఉన్న ఇరాకీ మిలీషియా డ్రోన్లతో దాడులు జరిపిందని రియాద్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఇరాకీ మిలీషియా ఖండించింది. మరోవైపు యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు మాత్రం ఆ దాడులకు తామే బాధ్యులమని ప్రకటించారు.
ఈ పరిణామాల మధ్య సౌదీ రక్షణ మంత్రి ఖలీద్ బిన్ సల్మాన్ అమెరికాలో ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లతో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఇరు దేశాలు అధికారికంగా వెల్లడించలేదు.
తెరవెనుక శాంతి ప్రయత్నాలు
సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, తెరవెనుక శాంతి చర్చల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ప్రాంతీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇరు పక్షాలు దాడులు నిలిపివేయాలనే సంకేతాలు ఇవ్వకపోవడంతో చర్చలకు అనుకూల వాతావరణం ఇంకా ఏర్పడలేదని మధ్యవర్తులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా యుద్ధ తీవ్రత తగ్గితేనే శాంతి ప్రక్రియకు అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
భగ్గుమన్న చమురు ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ మళ్లీ తీవ్రమవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. బ్రెంట్ క్రూడ్ ధర 7.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 88.09 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితి మరింత దిగజారితే బ్యారెల్ ధర మళ్లీ 100 డాలర్ల మార్కును దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇంధన మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

