
హలో అమెరికా, నీ వీరంగం ఆపిక: ఇరాన్
మరోమారు కాల్పుల విరమణ పొడిగింపుపై ఇరాన్ ఎద్దేవా
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం 53వ రోజుకు చేరుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చేసిన ప్రత్యేక అభ్యర్థన మేరకు, ఈ నెల 8న మొదలైన రెండు వారాల కాల్పుల విరమణను (Ceasefire) మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఈ విరమణపై ఇరాన్ సానుకూలంగా స్పందించక పోగా అమెరికాను ఘాటుగా హెచ్చరించింది. కాల్పుల విరమణ, యుద్ధం ముగింపు చేయాల్సింది తామే తప్ప ఓడిపోయేవారు కాదంటూ ఎద్దేవా చేసింది.
హర్మూజ్ జలసంధి వద్ద ఉత్కంఠ
ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' పోస్ట్‌లో ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని మూసివేయడం వల్ల ఇరాన్ రోజుకు 500 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోతోందని, తమ నౌకాదళ దిగ్బంధనం కారణంగానే ఇరాన్ వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. "ఇరాన్ తనంతట తానుగా ఒక శాంతి ప్రతిపాదనతో ముందుకు రావాలి. అప్పటి వరకు దాడులు చేయం. వారు మొండిగా వ్యవహరిస్తే ఆ దేశంలోని మిగిలిన భాగాలను పేల్చేయడానికి, వారి నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి వెనుకాడం" అని ట్రంప్ హెచ్చరించారు. ఈ వాదనను ఇరాన్ తోసిపుచ్చింది. తమ భూ భాగంలోకి వచ్చి తమనే బెదిరించాలని చూడడాన్ని తాము సహించలేమని ఇరాన్ హెచ్చరించింది. యుద్ధం ఎప్పుడు, ఎలా ముగించాలో తమకు తెలుసునని తేల్చిచెప్పింది.
చర్చలు లేవన్న అమెరికా
ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రెండో విడత చర్చలకు తమ ప్రతినిధులను పంపే విషయంలో ఇరాన్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అమెరికా షరతులు తమను లొంగదీసుకునేలా ఉన్నాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఆరోపిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇప్పట్లో చర్చలు లేవన్నారు. తాము పాకిస్తాన్ వెళ్లడం లేదని చెప్పారు.
యుద్ధ రంగంలో తాజా పరిణామాలు..
కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అడపా దడపా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దక్షిణ లెబనాన్‌లోని బెకా లోయలో ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో ఒకరు మరణించారు. అల్-బయ్యాదా ప్రాంతంలో ఇజ్రాయెల్ దళాలు ఇళ్లను కూల్చివేస్తున్నాయి.
నౌకలపై కాల్పులు..
ఒమన్ తీరానికి సమీపంలో ఇరాన్‌కు చెందిన ఒక గన్‌బోట్, కంటైనర్ షిప్‌పై కాల్పులు జరిపింది. దీనివల్ల నౌక దెబ్బతిన్నప్పటికీ, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు UKMTO తెలిపింది.
ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణతో తమ సివిల్ డిఫెన్స్ విభాగంలో మేనేజర్‌గా పనిచేసిన వ్యక్తికి ఇరాన్ ఉరిశిక్ష అమలు చేసింది.
ప్రస్తుతానికి తుపాకులు నిశ్శబ్దంగా ఉన్నా, హర్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఆర్థిక దిగ్బంధనం ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్‌లో జరగబోయే చర్చలు సఫలమైతేనే ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుంది. లేనిపక్షంలో, ట్రంప్ హెచ్చరించినట్లుగా యుద్ధం మరింత భీకర రూపం దాల్చే అవకాశం ఉంది.
ఇరాన్ అంతర్గత సంక్షోభం..
యుద్ధం ఇరాన్ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణించారు. ఆయన కుమారుడు, కాబోయే వారసుడు మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఒక కాలు కోల్పోయారని, ముఖం కూడా వికృతమైందని నిఘా వర్గాల సమాచారం.
IRGC చేతిలోకి పాలన: దేశంలో అధికారికంగా అధ్యక్షుడు పెజెష్కియాన్ ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఇరాన్ మొత్తం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నియంత్రణలోకి వెళ్లిపోయింది. 'మిలిటరీ కౌన్సిల్' ప్రస్తుతం దేశ నిర్ణయాలను తీసుకుంటోంది.
Next Story

