శాంతి ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకరించడం లేదు: ట్రంప్
x
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

శాంతి ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకరించడం లేదు: ట్రంప్

జెలెన్ స్కీ సంతకం చేయడానికి ఒప్పుకోవడం లేదన్న అమెరికా అధ్యక్షుడు


రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో అమెరికా రచించిన శాంతి ప్రతిపాదనపై సంతకం చేయడానికి జెలెన్ స్కీ సిద్ధంగా లేరని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం అన్నారు.

అమెరికా పరిపాలన ప్రతిపాదనపై విభేదాలను తగ్గించే లక్ష్యంతో అమెరికా- ఉక్రెయిన్ ప్రతినిధులు మూడు రోజుల కూర్చుని మాట్లాడుకున్నా ఓ కొలిక్కి రాలేదు. చర్చల ప్రక్రియ ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నాడని ట్రంప్ తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు.

కొన్ని ప్రతిపాదనలను అధ్యక్షుడు జెలెన్ స్కీ అంగీకరించకపోవడం తనకు నిరాశ కలిగించిందని ట్రంప్ విలేకరులతో అన్నారు. రష్యా బాగానే ఉందని, కానీ జెలెన్ స్కీ మాత్రం ముందుకు సాగనివ్వడం లేదని చెప్పారు.
పుతిన్ కూడా వైట్ హౌజ్ ప్రతిపాదనలపై బహిరంగంగా ఆమోదం వ్యక్తం చేయలేదు. వాస్తవానికి గతవారం పుతిన్ ట్రంప్ ప్రతిపాదనలోని కొన్ని అంశాలు పనికిరానివని విమర్శించారు. అయినప్పటికీ ఆ ముసాయిదా మాస్కో కు అనుకూలంగా ఉంది.
ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయడమే అని ట్రంప్ గట్టిగా వాదిస్తున్నారు. తన పదవీకాలం ప్రారంభం నుంచి జెలెన్ స్కీతో సంబంధాలు ఒడిదుడుకులతో కొనసాగుతున్నాయి. యుద్ధాన్ని ఆపడానికి ఉక్రెయిన్ కోల్పోయిన భూభాగం పై ఆశలు పెట్టుకోవద్దని కీవ్ కు సూచిస్తున్నారు. ఈ వివాదం ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో ఆ దేశం కనిపించదని అన్నారు.
నేను ఫోన్ చేశాను..
ఫ్లోరిడాలో చర్చల్లో పాల్గొన్న తన అధికారులతో ఫోన్ మాట్లాడినట్లు జెలెన్ స్కీ శనివారం ప్రకటించారు. చర్చల సమాచారం తనకు వచ్చిందని పేర్కొన్నారు. ‘‘నిజంగా శాంతిని సాధించడానికి అమెరికాతో కలిసి నడవడానికి ఉక్రెయిన్ నిశ్చయించుకుంది’’ అని జెలెన్ స్కీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చిన విధానాన్ని రష్యా ఆదివారం స్వాగతించింది. ఈ నేపథ్యంలో జెలెన్ స్కీపై ట్రంప్ విమర్శలు ఎక్కుపెట్టారు. కొత్త ప్రతిపాదన రష్యా భవిష్యత్ కు అనుకూలంగా ఉందని క్రిమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నారు.
ఘర్షణ నివారించడానికి, చర్చలకు అనుకూలంగా మంచి సంబంధాలు నెరపడానికి ఈ ప్రతిపాదనలోని అంశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఉక్రెయిన్ పరిష్కారంపై వాషింగ్టన్ తో నిర్మాణాత్మక సహకారానికి దారితీస్తుందని రష్యా ఆశిస్తోందని అన్నారు.
రష్యాతో వ్యూహాత్మక స్థిరత్వాన్ని అమెరికా తిరిగి సాధారణీకరించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఉక్రెయిన్ రాయబారీ కీత్ కెల్లాగ్, యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలు చివరి పది మీటర్లలో ఉన్నాయని అన్నారు. భూభాగం, ప్రధానంగా డాన్ బాస్, జపోరీజియా అణు విద్యుత్ ప్లాంట్ అనే రెండు అపరిష్కృత సమస్యలపై ఒప్పందం ఆధారపడి ఉందని ఆయన అన్నారు.
డాన్ బాస్ లోని ఎక్కువ భాగం రష్యా ఆధీనంలో ఉంది. అలాగే లుహాన్స్క్, డోనెట్స్క్ కూడా వీటిలో ఉన్నాయి. ఇవి ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతాలలో ఉన్నాయి. జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్ పై రష్యా చాలా సార్లు దాడి చేసింది.
ఇక్కడ ఉన్న అణు రియాక్టర్లను షట్ డౌన్ చేశారు. జనవరిలో పదవీ విరమణ చేయనున్న కెల్లాగ్ ప్రస్తుత చర్చలకు హజరుకాలేదు. ఈ రోజు లండన్ లో జెలెన్ స్కీ యూకే, ఫ్రాన్స్, జర్మనీ నాయకులతో చర్చలు జరపబోతున్నారు.
ఓ వైపు చర్చలు సాగుతుండగానే రష్యా భారీ స్థాయిలో క్షిపణి, డ్రోన్ లతో విరుచుకుపడింది. ఇందులో కనీసం నలుగురు చనిపోయారు. అలాగే అనేక ప్రాంతాలపై మాస్కో దళాలు దాడులు చేస్తున్నాయి.


Read More
Next Story