
లిండ్సే గ్రాహం చట్టంపై ట్రంప్ కీలక ప్రతిపాదన
భారత్ కు భారీ ఊరట కలిగినట్లేనా?
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే దిశగా అడుగులు వేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు అదే విషయంలో వెనక్కి తగ్గారు. లిండ్సే ఓ. గ్రాహం చట్టం కింద విధించాల్సిన ఆంక్షలు, అదనపు సుంకాల అమలుకు మినహాయింపులు ప్రకటించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా నుంచి భారీగా ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌కు ఇది తాత్కాలిక ఊరటనిచ్చే అవకాశముంది.
గ్రాహం చట్టం ప్రకారం, రష్యా నుంచి చమురు, సహజ వాయువును పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు అదనపు సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. ఈ పరిధిలో భారత్, చైనా వంటి దేశాలు కూడా ఉన్నాయి. రష్యా ఆదాయాన్ని తగ్గించి, ఆ దేశంపై ఆర్థిక ఒత్తిడి పెంచడమే ఈ చర్యల వెనుక ఉద్దేశం.
అయితే, శుక్రవారం జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుతో ట్రంప్ ఈ సుంకాలు, కొన్ని ఆంక్షల అమలుకు మినహాయింపులు ఇచ్చారు. ఈ నిర్ణయం అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరమని పేర్కొంటూ, సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని కాంగ్రెస్‌కు సమర్పించినట్లు వెల్లడించారు. ఈ మినహాయింపులకు నిర్దిష్ట గడువు లేదు. అమెరికా అధ్యక్షుడు లేదా విదేశాంగ మంత్రి తదుపరి చర్యలు అవసరమని భావించే వరకు ఇవి కొనసాగుతాయి. అయినప్పటికీ, రష్యా చమురు కొనుగోళ్లపై పర్యవేక్షణ కొనసాగుతుందని, ఇప్పటికే అమల్లో ఉన్న ఇతర ఆంక్షలకు ఈ ఉత్తర్వు వర్తించదని స్పష్టమవుతోంది.
మరోవైపు, అమెరికా అనుసరిస్తున్న ఈ విధానంపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలకు ఆంక్షల విషయంలో కఠినమైన సందేశాలు ఇస్తున్న అమెరికా.. మరోవైపు రష్యా నుంచి భారీ స్థాయిలో డీజిల్ కొనుగోలు చేస్తున్నట్లు విమర్శకులు ప్రస్తావిస్తున్నారు. దీంతో రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదే సమయంలో అమెరికాలో మధ్యంతర ఎన్నికల రాజకీయాలు కూడా ట్రంప్ నిర్ణయానికి కారణమై ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దేశంలో గ్యాసోలిన్ ధర గ్యాలన్‌కు ఆరు డాలర్లకు చేరిన నేపథ్యంలో ఇంధన ధరల పెరుగుదల ప్రజలపై భారంగా మారింది. ఈ పరిస్థితి రిపబ్లికన్ పార్టీకి ఎన్నికల్లో నష్టం కలిగించే అవకాశముండటంతో, ఇంధన సరఫరా విషయంలో ఒత్తిడి తగ్గించేందుకే ట్రంప్ ఈ మినహాయింపులు ఇచ్చి ఉండవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత ట్రంప్ మళ్లీ తన వైఖరిని మార్చుకునే అవకాశముందని కూడా అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌పై తిరిగి దాడులు చేయడంతో పాటు, రష్యాపై మరోసారి ఆంక్షలను కఠినతరం చేసే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, ఇవి ప్రస్తుతానికి అంచనాలు మాత్రమే.
ఇక మార్కో రూబియో భారత్ పర్యటనలో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ఇంధన అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. మొత్తంగా, ట్రంప్ తాజా నిర్ణయం వెనుక అమెరికా ఆర్థిక ప్రయోజనాలు, ఇంధన ధరలు, ఎన్నికల రాజకీయాలు ఎంతవరకు ప్రభావం చూపాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ మినహాయింపులు తాత్కాలిక ఉపశమనమేనా, లేక అమెరికా విధానంలో విస్తృతమైన మార్పునకు సంకేతమా అన్నది రాబోయే పరిణామాలే స్పష్టం చేయనున్నాయి.

