ట్రంపూ, ఇక ఆపు, యుద్ధానికి మన దగ్గర డబ్బుల్లేవ్!
x

ట్రంపూ, ఇక ఆపు, యుద్ధానికి మన దగ్గర డబ్బుల్లేవ్!

తేల్చి చెప్పిన పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్‌సెత్


ఇరాన్-అమెరికా మధ్య మొదలైన రణం నేటికి 62వ రోజుకు చేరుకుంది. యుద్ధ రంగంలోని 3 దేశాలు శాంతి వైపు అడుగులు వేయాల్సింది పోయి, ఒకరిపై ఒకరు కాలుదువ్వుతూ హెచ్చరికల పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. తాజా పరిణామాలు ఈ ప్రాంతంలో యుద్ధం మరింత ముదిరిపోతోందన్న సంకేతాలను ఇస్తున్నాయి.

అమెరికా తీరుపై ఇరాన్ ఆగ్రహం

ఇరాన్ రేవు పట్టణాలపై అమెరికా విధిస్తున్న నావికా దళ ఆంక్షలను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ తీవ్రంగా ఖండించారు. ఇది సైనిక చర్యను విస్తరించడమేనని, ఈ తీరును ఎంతమాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు. అటు టెహ్రాన్ గగనతలంలో డ్రోన్ల సంచారం, వాటిని ఎదుర్కోవడానికి ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు జరిపిన కాల్పులతో అక్కడి వాతావరణం భీతావహంగా మారింది.

ట్రంప్ వ్యాఖ్యలతో సంచలనం

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యుద్ధాన్ని మరింత అనిశ్చితిలోకి నెట్టాయి. "ఇరాన్‌తో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉంది" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నప్పటికీ, అవి కేవలం కొద్దిమందికి మాత్రమే తెలిసిన రహస్యాలుగా ఉన్నాయని ఆయన అనడం గమనార్హం.

ఖజానా ఖాళీ.. సామాన్యుడికి ఇబ్బందులు

ఈ యుద్ధం వల్ల అమెరికాకు ఇప్పటివరకు సుమారు 25 బిలియన్ డాలర్ల (సుమారు ₹2.10 లక్షల కోట్లు) వ్యయం అయిందని పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్‌సెత్ వెల్లడించారు. అయితే వాస్తవానికి ఈ ఖర్చు అంతకంటే ఎక్కువే ఉంటుందని అంచనా. ఇంకా యుద్ధం కొనసాగించాలనుకుంటే కాసుల కోసం వెతుక్కోవాల్సి వస్తోందని సూచనప్రాయంగా చెప్పారు. ఇంతటితో విరమిస్తే మేలన్న సంకేతాలు ఇచ్చారు.
సెంట్రల్ కమాండ్ (CENTCOM) తన నౌకలను ఆయుధాలు, ఇంధనం మరియు నిత్యావసరాలతో నిరంతరం నింపుతూ యుద్ధానికి సిద్ధంగా ఉంచుతోంది.

లెబనాన్ లో ఆగని దాడులు..

ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో ఒక్కరోజే 30 మందికి పైగా మరణించడం, గాజాకు సాయం చేసే సామాజిక కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం వంటి చర్యలు పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయి.

ప్రపంచవ్యాప్త ఆక్రందనలు

అమెరికా ప్రయోజనాల కోసం లేదా పట్టుదల కోసం మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు యావత్ ప్రపంచానికి శాపంగా మారుతోందన్న ఆక్రందనలు వినిపిస్తున్నాయి. ఇంధన ధరల పెరుగుదల, దేశాల మధ్య సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం వంటి కారణాలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
అగ్రరాజ్యం ఆరంభించిన ఈ యుద్ధానికి ముగింపు ఎప్పుడు? శాంతి అనేది కేవలం చర్చలకే పరిమితమా లేక క్షేత్రస్థాయిలో అమలవుతుందా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
Read More
Next Story