ఇరాన్ నౌకలు కనిపిస్తే కాల్చేయండి: కాలుదువ్విన ట్రంప్!
x

'ఇరాన్ నౌకలు కనిపిస్తే కాల్చేయండి': కాలుదువ్విన ట్రంప్!

56వ రోజుకు చేరిన యుద్ధం.. ఇంకా అందని శాంతి తీరం!


ఇరాన్- అమెరికా యుద్ధం 56వ రోజుకు చేరింది. ముసిరిన యుద్ధ మేఘాలు ఇంకా తేలిపోలేదు. మరింతగా ముదురుతున్నాయి. ఇరు దేశాల మొండి వైఖరితో శాంతి చర్చలు వాయిదా పడటమే కాకుండా, ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. యుద్ధాన్ని ఆపాల్సిన బాధ్యత ఎదుటి పక్షానిదేనని అటు వైట్ హౌస్, ఇటు టెహ్రాన్ వాదిస్తున్నాయి.
'షూట్ అండ్ కిల్' ఆదేశాలు
హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా దిగ్బంధం కొనసాగుతోంది. హర్ముజ్ జలసంధిలో సముద్రపు మైన్లు (Sea Mines) వేసే ఏ ఇరాన్ పడవనైనా సరే 'షూట్ అండ్ కిల్' (కనిపిస్తే కాల్చివేత) చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ నౌకలకు తోడుగా తాజాగా మూడవ యుద్ధనౌక యూఎస్‌ఎస్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ కూడా చేరుకుంది. దీంతో మధ్యప్రాచ్యంలో అమెరికా నౌకాదళం తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది.
టైమ్ లేదు మిత్రమా అంటూ ఇరాన్ కు ట్రంప్ చురక
సోషల్ మీడియా వేదికగా స్పందించిన అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. "ఈ యుద్ధాన్ని ముగించాలనే ఒత్తిడి నాపై ఏమీ లేదు. నా దగ్గర కావాల్సినంత సమయం ఉంది. ఇరాన్‌కు మాత్రమే లేదు. గడియారం ముల్లు వేగంగా తిరుగుతోంది (The clock is ticking!)" అని ట్రంప్ హెచ్చరించారు.
మరోవైపు, లెబనాన్‌లో అమలవుతున్న తాత్కాలిక కాల్పుల విరమణను మరో మూడు వారాల పాటు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే ఇజ్రాయెల్, లెబనాన్ నేతలతో తాను సమావేశం కానున్నట్లు చెప్పారు.
అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేసే వరకు శాంతి చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. దిగ్బంధం కొనసాగిస్తూ చర్చల గురించి మాట్లాడటం అర్థరహితమని టెహ్రాన్ తేల్చిచెప్పింది.
యుద్ధం 56వ రోజుకు చేరినా, ఇరు పక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో ప్రపంచ చమురు మార్కెట్లు, సరఫరా వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిలో 'షూట్ అండ్ కిల్' ఆదేశాలు ఏ క్షణమైనా పెద్ద ఎత్తున ప్రాణనష్టానికి దారితీయవచ్చు. శాంతి చర్చలు ఎప్పుడు పునఃప్రారంభమవుతాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
Read More
Next Story